• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిష‌న్ ఎలా?

అయిదు ల‌క్ష‌ల సీట్ల ప్ర‌వేశాలు మొద‌లు

 

 

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ఐదు లక్షల డిగ్రీ సీట్లలో తొలిసారిగా ఆన్‌లైన్‌ ప్రవేశాలు మొదలయ్యాయి. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, సోషల్‌ వర్క్‌ మొదలైన సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌  కోర్సుల్లో చేరదల్చినవారు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. నాలుగేళ్ల డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేస్తున్నారు. మూడేళ్లు చదివాక అవసరమైతే బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. వీరికి మూడేళ్ల డిగ్రీ ప్రదానం చేస్తారు. నాలుగేళ్లు చదివితే పరిశోధన డిగ్రీ- ఆనర్స్‌ ఇస్తారు.

 

నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసినవారికి పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఏడాది మాత్రమే ఉంటుంది. పీజీ రెండో ఏడాదిలోకి ప్రవేశం కల్పిస్తారు. పీహెచ్‌డీలోనూ ఏడాది సమయం ఆదా అవుతుంది. మూడేళ్లలో 10నెలలు అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది. మొదటి, రెండు ఏడాదుల్లో వేసవి సెలవుల్లో రెండేసి నెలల చొప్పున నాలుగు నెలలు, చివరి ఏడాది సెమిస్టర్‌ ఉద్యోగ కల్పన శిక్షణ ఉంటుంది.  ఏపీ ఇంటర్‌ బోర్డు పరిధిలో చదివిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వీరి ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో చేస్తారు. ఇంటర్మీడియట్‌ హాల్‌టిక్కెట్‌ నంబరు నమోదు చేస్తే పూర్తి వివరాలు వాటికవే వస్తాయి. వెబ్‌సైట్‌లోని సహాయ కేంద్రాల వివరాలపై క్లిక్‌ చేస్తే సహాయ కేంద్రాల ప్రతినిధుల ఫోన్‌ నంబర్లు వస్తాయి.  

 

బీవోక్‌లో 89 కోర్సులు 

బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌లో 89 వరకు కోర్సులున్నాయి. డెయిరీ, పశుసంవర్ధక, వ్యవసాయం, ఆక్వాకల్చర్, మత్స్య సబ్జెక్టులతో ఆరోగ్య సంరక్షణ, మెడికల్‌ ల్యాబ్, పర్యాటకం, వసతి, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఫుడ్‌ ప్రాసెసింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, మల్టీమీడియా, యానిమేషన్‌ లాంటివి ఉన్నాయి. వీటికి కోర్సుల వారీగా యూజీసీ అర్హతలను నిర్దేశించింది. వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

 

డబ్బులు చెల్లించినా..

దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌ చెల్లింపు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లిపోయి, సెల్‌ఫోన్‌కు దరఖాస్తు ఐడీ, పాస్‌వర్డ్‌ రాకపోతే విద్యార్థులు ‘నో యువర్‌ అప్లికేషన్‌’ను క్లిక్‌ చేసి, పరిశీలించుకోవచ్చు. డబ్బులు కట్‌ అయ్యి ఐడీ, పాస్‌వర్డ్‌ రాకపోయినా మళ్లీ చెల్లిస్తే ముందు చెల్లించిన మొత్తం తిరిగి బ్యాంకు ఖాతాకు జమవుతుంది. దీనిపై విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ ఎలాంటి ఆందోళనకూ గురి కావాల్సిన అవసరం లేదు.

 

ఎన్ని కళాశాలలు? 

మొత్తం సీట్లు: 4,92,820

ప్రభుత్వ కళాశాలలు: 152

ఎయిడెడ్‌: 120

ప్రైవేటు: 1,062

విశ్వవిద్యాలయాల కళాశాలలు: 2

 

స్థానికత 

కళాశాలల సీట్లలో 85 శాతం స్థానికం, 15 శాతం ఓపెన్‌ కేటగిరిలో ఉంటాయి. ఇంటర్మీడియట్‌ నుంచి నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే దాన్ని స్థానికంగా నిర్థ్దారిస్తారు. 9, 10, ఇంటర్మీడియట్‌ రెండేళ్ల చదువును పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందినవారికి ఓపెన్‌ కోటా మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏపీలో రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు కలిపి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థానికతగా పరిగణిస్తారు. మిగతా అన్ని జిల్లాలూ ఆంధ్రా యూనివర్సిటీ స్థానికతగా ఉంటాయి. 

 

షెడ్యూల్‌ ఇలా 

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: జనవరి 17

వెబ్‌ ఐచ్ఛికాలు: జనవరి 9-17

సహాయ కేంద్రాలు: జనవరి 6-17 (సంక్రాంతి సందర్భంగా 13, 14, 15 తేదీల్లో  ఈ కేంద్రాలు పనిచేయవు. తిరిగి జనవరి 16, 17 తేదీల్లో పనిచేస్తాయి.) 

సీట్ల కేటాయింపు: జనవరి 20

కళాశాలల్లో చేరికలు: జనవరి 21-23

వెబ్‌సైట్‌: https://oamdc.ap.gov.in/

 

విధానం ఇదీ 

మొదట ప్రీ-రిజిస్ట్రేషన్‌ చేసుకొని, దరఖాస్తు రుసుము చెల్లించాలి.

అప్లికేషన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది.

ఆ తర్వాత ఐడీ, పాస్‌వర్డ్‌తో విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి, కన్మర్మేషన్‌ చేయాలి.

వెబ్‌ ఐచ్ఛికాల నమోదు

మెరిట్‌ జాబితా తయారీ

సీట్ల కేటాయింపు 

 

వీలైనన్ని ఎక్కువ వెబ్‌ ఐచ్ఛికాలు మేలు

వెబ్‌ ఐచ్ఛికాలను వీలైనన్ని ఎక్కువ ఇచ్చుకోవడం మంచిది. ముందుగా విద్యార్థులు కోర్సు, కళాశాలల వారీగా పేపర్‌పై రాసుకోవాలి. అనుకున్న కోర్సు, కళాశాలలో సీటు రాకపోతే ఆ తర్వాత ఏ  కోర్సు, కళాశాల అనేదానిపై దృష్టి పెట్టాలి. ఈ విధానంలో వెబ్‌ ఐచ్ఛికాలను ఇచ్చుకుంటూ వెళ్లడం మంచిది. ముఖ్యమైన, మంచి కళాశాలలను 25-30 వరకు ఎంచుకొని జాబితా సిద్ధం చేసుకోవాలి. ఐచ్ఛికాలను ఎక్కువ ఇచ్చుకోవడం వల్ల అనుకున్న కళాశాల, కోర్సులో సీటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వేరే రీజియన్‌ వారు మరో రీజియన్‌లో మంచి కళాశాల ఉందనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు తీసుకోవడం, సమర్పించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ కావడంతో ఎక్కడైనా, ఏ కళాశాలకైనా వెబ్‌ ఐచ్ఛికాలు ఇచ్చుకోగలిగే అవకాశం ఏర్పడింది. రిజిస్ట్రేషన్, వెబ్‌ ఐచ్ఛికాలపై వీడియోను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచాం. - హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

 

రిజిస్ట్రేషన్‌లో మెలకువలు

ఏపీలో ఇంటర్మీడియట్‌ చదివినవారు హాల్‌టిక్కెట్‌ నంబరు, తల్లి పేరు నమోదు చేస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు వాటికవే వస్తాయి. 

ఇతర బోర్డులకు చెందినవారు పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫోన్‌ నంబరు నమోదులో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమాచారం అంతా దీనికే వస్తుంది. ఒక విద్యార్థికి ఒక నంబరునే వినియోగించాలి.

క్రీడలు, మాజీ సైనికోద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్‌ ఉన్నవారు తప్పనిసరిగా ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు రిజర్వేషన్‌ కోసం మీ-సేవ నుంచి పొందిన సర్టిఫికెట్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువపత్రం, రేషన్‌ కార్డు నంబర్లు వేస్తే సరిపోతుంది. ధ్రువపత్రాలను స్కానింగ్‌ చేయాల్సిన పని లేదు. 

విద్యార్థి ఫొటో, సంతకాన్ని స్కానింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వివరాలన్నీ నమోదు చేశాక ప్రీవ్యూ బటన్‌ను నొక్కితే మొత్తం వివరాలు కనిపిస్తాయి. 

వివరాలన్నింటినీ పరిశీలించి సరిగ్గా ఉంటే ‘సేవ్‌’ ఆప్షన్‌ నొక్కాలి. లేదంటే ఎడిట్‌ ఆప్షన్‌ నొక్కి మార్పులు చేసుకోవాలి.

దరఖాస్తు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ప్రింట్‌ అవుట్‌ తీసుకుంటే మంచిది. 

పేరు, రిజర్వేషన్, ఆదాయం ధ్రువీకరణ పత్రాల వివరాల్లో ఎలాంటి మార్పులూ లేకపోతే వెబ్‌ ఐచ్ఛికాలకు వెళ్లాలి.

 

కోర్సుల, కళాశాలల ఎంపిక 

విద్యార్థులు మొదట కోర్సుకు ప్రాధాన్యమా? కళాశాలకు ప్రాధాన్యమా? అనేది నిర్ణయించుకోవాలి. నచ్చిన కోర్సు చదవాలనుకుంటే ఆ కోర్సు ఏ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉంది? ఏ కళాశాలల్లో ఉందో తెలుసుకోవాలి. కళాశాలే ముఖ్యమనుకుంటే ఆ కళాశాలలో ఉన్న కోర్సుల్లో మార్కెట్‌లో ఉపాధి లభించేవి ఏమి ఉన్నాయో వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. 

వెబ్‌సైట్‌లోని రిపోర్టులో కళాశాలలు, కోర్సులు, న్యాక్‌ గుర్తింపు, అధ్యాపకుల పరిస్థితి లాంటి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు కోర్సులు, కళాశాలల ఎంపిక వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు ముందుకు రిపోర్టులో పరిశీలించుకుంటే మంచిది.

సెర్చ్‌ ఆప్షన్‌లోనూ ప్రోగ్రాం, కళాశాల, కోర్సుల వారీగా పరిశీలించుకోవచ్చు. 

కళాశాలలు, కోర్సులను ఒక పేపర్‌పై రాసుకొని ప్రాధాన్య క్రమంలో ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడం మేలు.  

‣ విద్యార్థులు తమకు ఉన్న అర్హతను అనుసరించి ఎన్నయినా ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు.

వెబ్‌ ఐచ్ఛికాలు పూర్తయిన తర్వాత ‘సేవ్‌’ చేయాల్సి ఉంటుంది.

 

- మాసిన శ్రీనివాసరావు (ఈనాడు - అమరావతి)

Posted Date : 12-01-2021 .