• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేంద్ర బలగాల్లో కొలువులెన్నో!

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) నియామకాల వివరాలు

 

 

దేశంలో ఏటా వేల సంఖ్యలో కేంద్ర బలగాలు నియామకాలు చేపడుతున్నాయి. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ... వీటన్నింటినీ కలిపి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)గా పేర్కొంటారు. వీటినే గతంలో పారామిలిటరీ ఉద్యోగాలుగా వ్యవహరించేవారు. వీటిలో ఖాళీల భర్తీకి ఉమ్మడిగా, విడిగానూ ఏటా ప్రకటనలు వెలువడుతున్నాయి. పదో తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ...ఇలా వివిధ విద్యార్హతలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు కొలువు సాధించడానికి అవకాశాలెక్కువ! సీఏపీఎఫ్‌ల్లో ఉండే ఉద్యోగాలు, పోస్టుల వారీగా కావాల్సిన అర్హతలు, పరీక్ష విధానం తెలుసుకుని ఇప్పటి నుంచే సన్నద్ధమైతే ప్రకటనలు వెలువడే సమయానికి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయడానికి వీలవుతుంది. 

 

ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల మాదిరిగానే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)ల్లో ప్రతి సంవత్సరం నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా విభాగాలున్నాయి. వీటిలో కానిస్టేబుల్‌ పోస్టులను పదో తరగతి విద్యార్హతతో ఉమ్మడి పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే డిగ్రీ అర్హతతో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు సైతం ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నియామకాలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు కేంద్ర బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. ఈ ఉమ్మడి పరీక్షను ఏడాదికి ఒకసారి యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. మరికొన్ని పోస్టులకు ఆయా సంస్థలు నేరుగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)ల్లో కానిస్టేబుల్, ఎస్సై, ఏఎస్సై ఖాళీలను ఎస్‌ఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో విడతలో యాభై వేలకు పైగా కానిస్టేబుల్, 3000కు పైగా ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాలు లభిస్తున్నాయి. అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఏసీ) పోస్టు నియామకాలు యూపీఎస్‌సీ ద్వారా జరుగుతాయి. ఏటా 400 వరకు ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ప్రకటనలు ప్రతి సంవత్సరం వెలువడుతున్నాయి. అసిస్టెంట్‌ కమాండెంట్‌లో స్పెషలిస్టు ఉద్యోగాలతోపాటు కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆయా సంస్థల వారీ ప్రకటనలు వెలువడుతున్నాయి.

 

ఎస్‌ఎస్‌సీతో... 

 

 

కానిస్టేబుల్‌ (జీడీ) 

పదో తరగతి ఉత్తీర్ణులు పరీక్ష రాసుకోవచ్చు. మహిళలూ అర్హులే. వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, దేహదార్ఢ్య, శారీరక ప్రామాణిక పరీక్షలు, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ...అదనం. అందువల్ల శిక్షణ అనంతరం విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం పొందవచ్చు.

 

పరీక్ష ఇలా 

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లిష్‌/హిందీ ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 90 నిమిషాల్లో వీటిని పూర్తిచేయాలి. పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ బహుళైచ్చిక విధానంలో వస్తాయి.

 

పీఈటీ

పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో పూర్తిచేయాలి. 

 

ఎస్సై, ఏఎస్సై

బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీల్లో ఎస్సై పోస్టులతోపాటు సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ఉమ్మడి పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్సై పోస్టుల నియామకాలూ ఈ పరీక్షతోనే చేపడుతున్నారు. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 25 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సై పోస్టులకు ఎంపికైనవారికి రూ.35,400 మూలవేతనం అందుతుంది. అంటే వీరు మొదటి నెల నుంచే రూ.యాభై అయిదు వేలకు తక్కువ కాకుండా అందుకోవచ్చు. ఏఎస్సై లకు రూ.29,200 బేసిక్‌ పే చెల్లిస్తారు. వీరు సుమారు రూ.45వేల వేతనం పొందవచ్చు.

 

పరీక్ష ఇలా

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది. 

 

పీఈటీ

పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకెన్లలో చేరుకోవాలి. 1.6 కి.మీ. పరుగును పురుషులు 6.5 నిమిషాల్లో, 800 మీటర్లను మహిళలు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. లాంగ్‌ జంప్‌లో పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరంలో దూకాలి. అదే మహిళలైతే 3 ప్రయత్నాల్లో 2.7 మీటర్ల దూరం గెంతాలి. హైజంప్‌లో పురుషులు 1.2 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఎగరాలి. మహిళలు 0.9 మీటర్ల ఎత్తుకు ఎగరాలి. షాట్‌పుట్‌ పురుషులకు మాత్రమే ఉంటుంది. 3 ప్రయత్నాల్లో 16ఎల్‌బీఎస్‌ గుండును 4.5 మీ దూరానికి విసరాలి.

 

యూపీఎస్‌సీ...

 

 

అసిస్టెంట్‌ కమాండెంట్స్‌

అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఏసీపీ/ డీఎస్‌పీ లతో సమాన హోదా అసిస్టెంట్‌ కమాండెంట్లకు ఉంటుంది. డిగ్రీ అర్హతతో పాతికేళ్లలోపు వయసు వాళ్లు ఈ ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. 

 

వీటికి మహిళలూ అర్హులే. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఏసీ) పోస్టులను రూపొందించారు. ఇవి గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు. ఈ పరీక్షతో ఎంపికైనవారు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎందులోనైనా అసిస్ట్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగానికి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపికైన విభాగం వీరికి శిక్షణ అందిస్తుంది. శిక్షణ అనంతరం ఆయా విభాగాలకు అవసరమైన సేవలు అందిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ...ఉంటాయి. అందువల్ల వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వరకు వేతనం పొందవచ్చు.

 

పరీక్ష ఇలా

పేపర్‌ -1 జనరల్‌ అబిలిటీ అండ్‌ ఇంటలిజెన్స్‌ అంశాల్లో 250 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పేపర్‌-2 జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. 

 

ఫిజికల్‌ టెస్టు

రాత పరీక్షలో అర్హులకు పిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలైతే 18 సెకెన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకెన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకెన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో  భాగంగా పురుషులైతే 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు జంప్‌ చేయగలగాలి. షాట్‌ పుట్‌లో 7.26 కి.గ్రా. గుండును పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్‌పుట్‌ లేదు. 

 

నియామకాలు నేరుగా!

ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల మాదిరిగానే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)ల్లో ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా విభాగాలున్నాయి. నియామకాలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), యూపీఎస్‌సీల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి.  మరికొన్ని పోస్టులకు ఆయా సంస్థలు నేరుగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి.  

 

 

కొన్ని పోస్టులకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ...విడిగా ప్రకటనలు జారీ చేస్తాయి.

 

స్టాఫ్‌ నర్సు (ఎస్సై హోదా), ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్‌ టెక్నీషియన్, లేబొరేటరీ టెక్నీషియన్, రేడియో గ్రాఫర్, స్టెనోగ్రాఫర్‌ (ఇవన్నీ ఏఎస్సై హోదా), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) కానిస్టేబుల్‌ మోటార్‌ మెకానిక్, కానిస్టేబుల్‌ పయనీర్‌ ( ప్లంబర్‌/ ఎల్రక్టీషియన్‌/ కార్పెంటర్‌/ మాసన్‌/ బ్లాక్‌ స్మిత్‌/ వెల్డర్‌/ పెయింటర్‌), కానిస్టేబుల్‌ డ్రైవర్, కానిస్టేబుల్‌ టెలికాం/ టెలి కమ్యూనికేషన్, కానిస్టేబుల్‌ యానిమల్‌ ట్రాన్స్‌పోర్టు, కానిస్టేబుల్‌ డ్రెస్సర్‌ వెటర్నరీ, కానిస్టేబుల్‌ (ఫాలోవర్స్‌) కుక్‌/ వాటర్‌ క్యారియర్‌/ బార్బర్‌/ వాషర్‌మెన్‌/ సఫాయీ కర్మాచారీ, కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌) టైలర్‌/ కోబ్లర్‌/ గార్డెనర్, కానిస్టేబుల్‌ క్రూ, హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌ వైఫ్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్‌ డ్రైవర్, వర్క్‌షాప్, మాస్టర్, మోటార్‌ మెకానిక్, డ్రెస్సర్‌ వెటర్నరీ, టెలి కమ్యూనికేషన్‌), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఓవర్‌ సీర్, టెలి కమ్యూనికేషన్, హిందీ ట్రాన్స్‌లేటర్‌) ఇన్‌స్పెక్టర్‌ (ఎడిటర్, లైబ్రేరియన్‌), అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఇంజినీర్, వెటర్నరీ, జడ్జ్‌ అటార్నీ)...తదితర పోస్టులను సీఏపీఎఫ్‌లు విడిగా భర్తీ చేస్తున్నాయి. 

 

దాదాపు ఏటా ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. పోస్టు ఏదైనప్పటికీ ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ఫిజికల్‌ స్టాండర్డ్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంబంధిత విభాగాల్లో కోర్సులు పూర్తిచేసినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

ఒకే విద్యార్హతతో ఉన్న ఉద్యోగాలకు మూల వేతనం మిలిటరీ, సీఏపీఎఫ్‌ (పారా మిలటరీ) రెండు చోట్లా సమానంగానే ఉంటుంది. ఉదాహరణకు పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులకు రూ.21,700 మూల వేతనం చెల్లిస్తారు. అయితే మిలిటరీ (ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌)లో మిలిటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) ఉంటుంది. సాధారణ పోస్టులకు రూ.5200, ఆఫీసర్‌ పోస్టులకు రూ. 15,500 చొప్పున ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ సౌకర్యం సీఏపీఎఫ్‌ ఉద్యోగాల్లో ప్రస్తుతానికి లేదు. 

 

 

ఏమిటి తేడా?

 

మిలిటరీ  

‣ ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు గరిష్ఠంగా 21 ఏళ్ల వరకే అవకాశం ఉంటుంది. 

‣ ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తించవు. 

‣ మిలిటరీ ఉద్యోగాలకు రిజర్వేషన్లు వర్తించవు.

‣ పోస్టులను బట్టి 15 లేదా 20 ఏళ్లు విధుల్లో కొనసాగి, పదవీ విరమణ చేస్తే జీవితకాల పింఛనుకు అర్హులు

‣ 60 ఆర్జిత సెలవులు ఉంటాయి.

 

సీఏపీఎఫ్‌ 

‣ సీఏపీఎఫ్‌ ఉద్యోగాలకు 23 ఏళ్ల వరకు పోటీ పడవచ్చు. 

‣ అన్ని ఉద్యోగాలకూ ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు.

‣ ఆయా కేటరిగీలవారీ కొన్నేసి పోస్టులు ఉంటాయి.

‣ తక్కువ వ్యవధిలో వైదొలగే అవకాశం లేదు. పూర్తికాలం సేవలు అందించాలి.

‣ 45 మాత్రమే ఉంటాయి.

 

వెబ్‌సైట్లు: https://ssc.nic.in, https://www.upsc.gov.in/

Posted Date : 15-02-2021 .