• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిగ్రీతో కేంద్ర బలగాల్లో కొలువులు
 

సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ ప్రకటన

మ‌హిళ‌ల‌కూ అవ‌కాశం

ఎన్నిక‌లు.. ఉత్స‌వాలు.. ఇత‌ర ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన పారా మిల‌ట‌రీ బ‌ల‌గాలు క‌వాతు చేయ‌డం చూస్తుంటాం. దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో వీటి పాత్ర కీల‌కం. ఇందులో బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌), ఇండో-టిబెటన్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ), స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ) విభాగాలు ఉంటాయి. తాజాగా వాటిలో ఖాళీల భ‌ర్తీకి యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
సాధార‌ణంగా పోలీసు ఉద్యోగ‌మంటేనే గ‌ర్వంగా భావిస్తాం. డిగ్రీ అర్హ‌త‌తో అంత‌కుమించిన కొలువు ద‌క్కితే ఇక ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. అలాంటి అవ‌కాశం వ‌చ్చిందిప్పుడు. దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌తే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప‌నిచేసే సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో చేరేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇది సివిల్ విభాగంలో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) / డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)తో స‌మాన హోదా క‌లిగిన గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీస‌ర్ ఉద్యోగం. భ‌విష్య‌త్తులో సంబంధిత విభాగాల్లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ఏడీజీ) స్థాయికి కూడా చేరుకోవ‌చ్చు. బీఎస్ఎఫ్‌(35), సీఆర్‌పీఎఫ్‌(36), సీఐఎస్ఎఫ్‌(67), ఐటీబీపీ(20), ఎస్ఎస్‌బీ(1) క‌లిపి మొత్తం 159 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.  

 

అర్హ‌త‌..

ఆయా విభాగాల్లో పోస్టుల‌కు పురుషుల‌తోపాటు మ‌హిళా అభ్య‌ర్థులు కూడా అర్హులే. ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ/త‌త్స‌మాన ‌ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2021లో డిగ్రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌య‌సు ఆగ‌స్టు 1, 2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అంటే ఆగ‌స్టు 2, 1996 నుంచి ఆగ‌స్టు 1, 2001 మ‌ధ్య జ‌న్మించాలి. నిర్దిష్ట శారీర‌క‌, ఆరోగ్య ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి.

 

ద‌ర‌ఖాస్తు ఇలా...

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష రుసుము రూ.200 చెల్లించాలి. మ‌హిళా అభ్య‌ర్థులు, ఎస్సీ/ఎస్టీల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ద‌ర‌ఖాస్తుకు మే 5, 2021 తుది గ‌డువు. ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడే అభ్య‌ర్థులు త‌మ ప‌రీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో ఉన్నాయి. 

 

ఎంపిక ఎలా ?

రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌/మెడిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌, ఇంట‌ర్వ్యూ / ప‌ర్స‌నాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక‌లు ఉంటాయి. 

 

రాత ప‌రీక్ష విధానం

ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్-1లో జ‌న‌ర‌ల్ ఎబిలీటీ అండ్ ఇంటెలిజెన్స్ అంశాల నుంచి ప్ర‌శ్న‌లొస్తాయి. 250 మార్కులు కేటాయించారు. రెండు గంట‌ల స‌మ‌యం ఉంటుంది. ప్ర‌శ్న‌ల‌న్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఆంగ్లం, హిందీ భాష‌ల్లో ఇస్తారు. పేప‌ర్‌2లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, ఎస్సే, కాంప్ర‌హెన్ష‌న్ విభాగాల నుంచి అడిగే ప్ర‌శ్న‌ల‌కు డిస్క్రిప్టివ్ విధానంలో స‌మాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడు గంట‌ల స‌మ‌యం ఇస్తారు. ఇది 200 మార్కుల‌కు ఉంటుంది. రెండు పేప‌ర్ల‌లోనూ క‌నీస అర్హ‌త మార్కులు సాధించాలి. పేప‌ర్‌1లో అర్హ‌త సాధిస్తేనే రెండో పేప‌ర్ మూల్యాంక‌నం చేస్తారు. 

 

 

శారీరక ‌సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు

రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ చూపిన అభ్య‌ర్థుల‌కు ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ / ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ ప‌రీక్ష‌లు ఉంటాయి. ఇందులో భాగంగా వంద మీట‌ర్ల దూరాన్ని పురుషులు 16, మ‌హిళ‌లు 18 సెక‌న్ల‌లో ప‌రుగెత్తాలి. 800 మీట‌ర్ల‌ను పురుషులు 3 నిమిషాల 45 సెక‌న్ల‌లో, మ‌హిళ‌లు 4 నిమిషాల 45 సెకన్ల‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్‌లో పురుషులు మూడు ప్ర‌య‌త్నాల్లో 3.5 మీట‌ర్లు, మహిళ‌లు 3 మీట‌ర్లు జంప్ చేయాలి. షాట్‌పుట్‌లో 7.26 కిలోగ్రాముల గుండును పురుషులు 4.5 మీట‌ర్ల దూరానికి విస‌రాలి. మ‌హిళ‌ల‌కు షాట్‌పుట్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. 

 

ఇంట‌ర్వ్యూ / ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌

ఫిజిక‌ల్ ‌టెస్టుల్లో అర్హ‌త సాధించిన వారికి మెడిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఇందులోనూ విజ‌యం సాధిస్తే ఇంట‌ర్వ్యూ / ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌కు పిలుస్తారు. ఇది 150 మార్కుల‌కు ఉంటుంది. రాత పరీక్ష‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక‌లు ఉంటాయి. 

 

సిల‌బ‌స్‌.. ప్రిప‌రేష‌న్‌

పేప‌ర్ 1కు సంబంధించి అభ్య‌ర్థి అవ‌గాహ‌న‌, నైపుణ్యాల‌ను ప‌రీక్షిస్తారు. జ‌న‌ర‌ల్ మెంట‌ల్ ఎబిలిటీ విభాగంలో రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ త‌దిత‌ర అంశాల‌కు చెందిన ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. జ‌న‌ర‌ల్ సైన్స్‌లో ఐటీ, బ‌యోటెక్నాల‌జీ, ప‌ర్యావ‌ర‌ణం అంశాల‌కు ప్రాధాన్యం ఉంటుంది. వీటితోపాటు ప్ర‌స్తుత‌జాతీయ‌, అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టు సాధించాలి. ఇండియ‌న్ పాలిటీ, ఎకాన‌మీకి సంబంధించి దేశ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌, భార‌త రాజ్యాంగం, సామాజిక వ్య‌వ‌స్థ‌, ప్రజాప‌రిపాల‌న భార‌త ఆర్థిక పురోగ‌తి, ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు తదిత‌ర అంశాల‌పై ప్ర‌శ్న‌లడుగుతారు. హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ నుంచి సామాజిక, ఆర్థిక, రాజ‌కీయ, భౌతిక అంశాల‌ను అర్థం చేసుకోవాలి. వీటి కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్త‌కాలు చ‌ద‌వాలి. ముఖ్యంగా 8 నుంచి 12వ‌త‌ర‌గతి పుస్త‌కాల‌పై దృష్టి పెట్టాలి. 

పేప‌ర్ 2లో పార్ట్ ఎ, పార్ట్ ‌బి అని రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ ఎలో వ్యాసాల‌పై ప్ర‌శ్న‌లు అడుగుతారు. వీటికి 80 మార్కులు కేటాయించారు. ఇందులో ఆధునిక భార‌తదేశ చ‌రిత్ర‌కు సంబంధించి స్వాతంత్రోద్యమం, జాగ్రీఫీ, పాలిటీ, ఎకాన‌మీ, భద్ర‌త‌, మాన‌వ హ‌క్కులు త‌దిత‌ర మొద‌లైన వాటిపై ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. పార్ట్ బిలో అభ్య‌ర్థి ఆంగ్ల నైపుణ్యాల‌ను ప‌రీక్షిస్తారు. కాంప్ర‌హెన్ష‌న్‌, లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించి 120 మార్కుల‌కు ప్ర‌శ్న‌లు అడుగుతారు. వ‌ర్త‌మాన అంశాలు, ఎస్సే ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి ఆంగ్ల పత్రిక‌ల‌ను చ‌ద‌వాలి. అంశాల‌ను గుర్తుంచుకోవ‌డం కోసం నోట్సు రాసుకోవాలి. వ్యాసం రాయ‌డానికి స‌మ‌కాలీన విష‌యాల‌పై ప‌ట్టు సాధించాలి. ఇందులోని ప‌లు ప్ర‌శ్న‌లు ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల ఆధారంగా అడుగుతారు. అందుకే ప‌త్రికల్లో వ‌చ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థ‌లు విడుద‌ల చేసిన నివేదిక‌ల‌ను చ‌ది‌వితే ఇచ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాలు సుల‌భంగా రాయ‌వ‌చ్చు.

 

శిక్షణ.. విధులు...

ఎంపికైనవారికి సంబంధిత విభాగానికి చెందిన కేంద్రాల్లో ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఉదాహరణకు సీఐఎస్‌ఎఫ్‌లో అవకాశం పొందినవారు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడెమీ (ఎన్‌ఐఎస్‌ఎ)- హైదరాబాద్‌లో 53 వారాల ప్రాథమిక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. ఇందులో భాగంగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా నక్సలైట్లు, ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ ప్రమాదం ఉన్నచోట ప్రత్యక్షమవుతారు. చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి వ్యూహరచన చేస్తారు. అవసరమైన చోట ఎన్నికల విధులను సైతం నిర్వర్తిస్తారు. సరిహద్దుల్లో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగమవుతారు. వీరికి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే దాదాపు లక్ష రూపాయలకు పైగా జీతం అందుకోవచ్చు. నిర్ణీత వ్యవధుల్లో పదోన్నతులు పొందవచ్చు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగానికి ప్రధానాధికారి కావచ్చు.


 

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

 

Posted Date : 17-04-2021 .