• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టెన్త్‌తో కోస్ట్‌గార్డ్ కొలువు

50 ఖాళీలతో ప్రకటన విడుదల
 

పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత పరీక్ష, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో కలుపుకుని మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు. పురుష అభ్యర్థులకే ఈ అవకాశం!  
 

నావిక్‌ ఉద్యోగానికి నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్‌ సైన్స్, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఫొటోను జతచేసిన మూడు అడ్మిట్‌ కార్డులు, పదో తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్, మార్కుల పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌; డొమిసైల్‌ సర్టిఫికెట్, ఏదో ఒక గుర్తింపు పత్రం (ఓటర్‌ ఐడీ లేదా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా కాలేజీ ఐడీ) తీసుకెళ్లాలి. వీటన్నింటికీ 3 సెట్ల ఫొటో కాపీలు తీసుకెళ్లాలి.
 

దేహదార్ఢ్య పరీక్షలు
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్‌ అప్స్‌- 20, పుష్‌అప్స్‌ -10 తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి. దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. జోన్లవారీ ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
 

ఎంపికైతే... 
అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ ప్రారంభానికి ముందే మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌గా ఎంపికైనవారు కోస్ట్‌ గార్డు ఉద్యోగులకు మెనూ ప్రకారం శాకాహార, మాంసాహార వంటకాలు తయారుచేయాల్సి ఉంటుంది. స్టివార్డ్‌గా విధుల్లో చేరినవాళ్లు భోజన వడ్డన, హౌస్‌ కీపింగ్, స్టోర్స్‌ నిర్వహణ తదితర సహకార పనులు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి (లెవెల్‌ 8) హోదా వరకు చేరుకోవచ్చు.
 

ముఖ్యమైన అంశాలు
ఖాళీలు: 50. వీటిలో అన్‌ రిజర్వ్‌ డ్‌ 20, ఓబీసీ 14, ఎస్సీ 8, ఎస్టీ 3, ఈడబ్ల్యుఎస్‌ 5 ఉన్నాయి. 
అర్హత: పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 45 శాతం). పురుష విద్యార్థులు అర్హులు. 
వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 1999 - మార్చి 31, 2003 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదార్ఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 30 నుంచి 
సమర్పణకు గడువు: డిసెంబరు 7 సాయంత్రం 5 వరకు 
రాత పరీక్ష: జనవరిలో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్ష కేంద్రం: విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in/
 

Posted Date : 23-11-2020 .

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌