• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరదాగా... సంపాదనగా..

టూరిజం కోర్సులు, కొలువులకు పెరుగుతున్న డిమాండ్

2021-2023 విద్యా సంవ‌త్స‌ర‌ ప్ర‌వేశాలకు ఐజీఎన్‌టీయూ, ఐజీఎన్‌టీయూ నోటిఫికేష‌న్‌

 

 

ఒంట‌రిత‌నం, బాధ‌లు, ప‌ని ఒత్తిడి‌ని చిత్తు చేసే శ‌క్తి ప‌ర్య‌ట‌నకే ఉంది. అందుకే చాలామంది ఏడాదిలో కొన్ని రోజులైనా అలా అలా ఊళ్లు తిరిగి వస్తుంటారు. దీంతో దేశాల ఆర్థిక వ్య‌వస్థ‌లను ప్ర‌భావితం చేసేంతగా టూరిజం ఎదిగింది. దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ప‌ర్య‌‌ట‌క రంగాన్ని ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కార‌ణంగా ఎన్నో ఉద్యోగాలు, కోర్సులు అందుబాటులోకి వ‌చ్చాయి. వ‌చ్చే ద‌శాబ్ద ‌కాలంలో అంటే 2028 నాటికి మ‌న దేశ ప‌ర్య‌ట‌క‌, దాని అనుబంధ రంగాల్లో దాదాపు కోటి కొలువులు కొత్త‌గా పుట్టుకొస్తాయ‌ని ద వ‌ర‌ల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్(డ‌బ్ల్యూటీటీసీ) అంచ‌నా వేసింది. త‌గిన కోర్సులు చేసి సిద్ధంగా ఉంటే ఈ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌చ్చు. సరదాగా తిరుగుతూ మంచి సంపాదననూ పొందవచ్చు. క‌రోనా కార‌ణంగా దాదాపు 2020 సంవ‌త్స‌రమంతా అన్ని దేశాలూ లాక్‌డౌన్ విధించాయి. దీంతో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిత‌మ‌య్యారు. సంద‌ర్శ‌న‌లు, ప‌ర్య‌ట‌న‌లు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బడుతుండ‌టంతో ప్ర‌జలు కొత్త ప్ర‌దేశాలు చుట్టి రావ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. దీంతో మ‌ళ్లీ ప‌ర్య‌ట‌కానికి డిమాండ్ పెరిగింది. ప్ర‌స్తుతం ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ(ఐజీఎన్‌టీయూ), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఐఐటీటీఎం) సంయుక్తంగా 2021-2024 విద్యాసంవ‌త్స‌రానికి దేశ వ్యాప్తంగా బీబీఏ, ఎంబీఏ(టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌) కోర్సుల్లో ప్ర‌వేశాలు కల్పిస్తున్నాయి.

 

అర్హ‌త‌

బీబీఏలో చేర‌డానికి క‌నీసం 50 శాతం మార్కుల‌(ఎస్సీ/ ఎస్టీలు 45 శాతం)తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వ‌య‌సు జులై 1, 2021 నాటికి 22 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సు స‌డ‌లింపు ఉంది. ఎంబీఏలో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు క‌నీసం 50 శాతం మార్కుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు మేనేజ్‌మెంట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష (మ్యాట్‌/ క‌్యాట్‌/ సీమ్యాట్‌/ గ‌్జాట్‌/ జీమ్యాట్‌/ ఏటీఎంఏ)లో అర్హ‌త మార్కులు సాధించి ఉండాలి. వ‌యసు జులై 1, 2021 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

ద‌ర‌ఖాస్తు ఎలా?

ఆస‌క్తి క‌లిగిన బీబీఏ, ఎంబీఏ అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది మే 21, 2021. ఐజీఎన్‌టీయూ, ఐఐఎన్‌టీయూ సంయుక్తంగా నిర్వ‌హించే ఐఐఏటీ ప్ర‌వేశ ప‌రీక్ష జూన్ 6, 2021న ఉంటుంది. గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ జూన్ 14 నుంచి 18 తేదీల్లో ఉంటాయి. తుది జాబితా జూన్ 25న వెల్ల‌డిస్తారు. త‌ర‌గ‌తులు జులై 19 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

 

ఎంపిక విధానం

విద్యార్థులను ఐజీఎన్‌టీయూ, ఐఐటీటీఎం అడ్మిష‌న్ టెస్ట్ (ఐఐఏటీ), గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంబీఏలో చేరే విద్యార్థులు మ్యాట్‌/ క‌్యాట్‌/ సీమ్యాట్‌/ గ‌్జాట్‌/ జీమ్యాట్‌/ ఏటీఎంఏ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త మార్కులు సాధించినా స‌రిపోతుంది. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 70 శాతం, గ్రూప్ డిస్క‌ష‌న్‌లో 15 శాతం, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో 15 శాతం వెయిటేజీ లెక్కిస్తారు. బీబీఏ సీట్లు గ్వాలియ‌ర్‌, భువ‌నేశ్వ‌ర్‌, నోయిడా, నెల్లూరు ప్రాంగ‌ణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏకు ఈ నాలుగు ప్రాంగ‌ణాల‌తోపాటు గోవాలోని ఇన్‌స్టిట్యూట్‌లోనూ ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. ఐఐఏటీ ప‌రీక్ష 100 మార్కుల‌కు అబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉంటుంది. 100 ప్ర‌శ్న‌లు ఇస్తారు. జ‌న‌ర‌ల్ అవెర్‌నెస్ నుంచి 50, వ‌ర్బ‌ల్ ఎబిలిటీ నుంచి 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. రుణాత్మ‌క మార్కులు లేవు. రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఎంపిక‌ల‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఐజీఎన్‌టీయూ (అమ‌ర్‌కంఠ‌క్‌), ఐఐటీటీఎం (గ్వాలియ‌ర్‌) చేప‌డుతున్నాయి.  

 

ఫీజుల వివ‌రాలు

బీబీఏ కోర్సు కాల‌వ్య‌వ‌ధి మూడేళ్లు. మొత్తం రూ.2,79,350 ఖ‌ర్చ‌వుతుంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు రూ.3,39,850 చెల్లించాల్సి ఉంటుంది.  ఒక్కో ఏడాది రెండు సెమిస్ట‌ర్లు ఉంటాయి. వ‌స‌తితో పాటు ఇత‌ర ఖ‌ర్చులు అద‌నం.‌ 

 

ఇత‌ర కోర్సులు.. కావాల్సిన‌అర్హ‌తలు‌

ప‌ర్య‌ట‌క రంగంలో స్థిర‌ప‌డ‌టానికి ఉప‌క‌రించే గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, స‌ర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌తోపాటు దేశంలోని కొన్ని విశ్వ‌విద్యాల‌యాలు మాస్ట‌ర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేష‌న్‌కోర్సును అందిస్తున్నాయి. మేనేజీరియ‌ల్‌, అడ్మినిస్ట్రేష‌న్ స్థాయి ఉద్యోగాలు పొంద‌డానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తోడ్ప‌డుతుంది. 

ప్ర‌పంచస్థాయి సంస్థ అయిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ (ఐఏటీఏ) ప్ర‌యాణ‌, ప‌ర్య‌ట‌క‌, కార్గో ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి స‌ర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఏదైనా విదేశీ భాష వ‌చ్చి ఉంటే అద‌న‌పు అర్హ‌త‌గా ప‌రిగ‌ణిస్తారు. ప‌బ్లిక్ రిలేష‌న్స్‌లో లేదా అడ్వటైజింగ్‌డిప్లొమా క‌లిగి ఉంటే కెరియ‌ర్ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో కార్యాచ‌ర‌ణ ఉద్యోగాల‌కు ట్రావెల్‌, టూరిజం డిగ్రీ ఉత్తీర్ణులైన ‌వారికి డిమాండ్ ఉంటుంది. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించిన ‌వారిని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఇన్ఫ‌ర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. భార‌తదేశ చరిత్ర‌, క‌ళ‌లు, నిర్మాణంపై అవ‌గాహ‌న‌, ఆంగ్ల భాషా నైపుణ్యం ఉంటే స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌చ్చు. ‌

 

గ్రాడ్యుయేష‌న్‌: ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన కోర్సు ఉత్తీర్ణులైన‌వారు టూరిజంలో అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు.

బ్యాచిల‌ర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (టూరిజం అండ్ ట్రావెల్)

బ్యాచిల‌ర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్‌

బీఎస్సీ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌

స‌ర్టిఫికెట్‌: 10+2 ఉత్తీర్ణులైన వారు టూరిజం స‌ర్టిఫికెట్ కోర్సుల‌కు అర్హులు. 

డిప్లొమా: అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌

డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌

పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌: మాస్ట‌ర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేష‌న్ - ఈ రెగ్యుల‌ర్‌కోర్సు వ్య‌వ‌ధి రెండేళ్లు. దీనికి కేంద్ర ప‌ర్య‌ట‌క‌శాఖ అనుమ‌తి ఉంది. ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణులైన‌వారు ఆయా సంస్థ‌లు నిర్వ‌హించే ప్ర‌వేశ‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూలో అర్హ‌త సాధించ‌డం ద్వారా ఈ కోర్సులో ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు.

ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్‌)/కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌)/కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్‌)/ గ్జేవియ‌ర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గ్జాట్‌)/ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (జీమ్యాట్‌)/ఆత్మా(ఎయిమ్స్ టెస్ట్ ఫ‌ర్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్స్‌)ల‌లో అర్హ‌త సాధించి ఉండాలి. 

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ టూరిజం

ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) 

ఎంబీఏ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌

ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ

పీహెచ్‌డీ ఇన్ టూరిజం

పీహెచ్‌డీ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం

 

అందిస్తున్న సంస్థ‌లు..

నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, హైద‌రాబాద్‌.

మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సీటీ, న‌ల్గొండ‌.

ఆచార్య నాగార్చున యూనివ‌ర్సీటీ, గుంటూరు.

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌, నెల్లూరు.

అమిటీ యూనివ‌ర్సిటీ

చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీ

 

అవ‌కాశాలు ఎలా ఉంటాయి?

ఎయిర్ లైన్స్‌: ఈ సంస్థ‌ల్లో ఉద్యోగాలు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. కొత్త ప్ర‌దేశాల‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ట్రాఫిక్ అసిస్టెన్స్‌, రిజ‌ర్వేష‌న్ అండ్ కౌంట‌ర్ స్టాఫ్‌, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్టాఫ్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీసెస్ లాంటి విభాగాల్లో ఉద్యోగావ‌కాశాలు ఉంటాయి. ఎయిర్ ఇండియా, ఇండియ‌న్ ఎయిర్ లైన్స్‌‌, జెట్ ఎయిర్‌వేస్‌, ఎయిర్ స‌హారా, బ్రిటీష్ ఎయిర్‌వేస్‌, ఎమిరేట్స్‌, సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ మొద‌లైన సంస్థల్లో ఆక‌ర్ష‌ణీయ‌మైన వేత‌నాలు, ఇత‌ర సౌక‌ర్యాలతో కూడిన కొలువులు ఉంటాయి.

ట్రావెల్ ఏజెన్సీలు: వీటిలో ప‌నిచేసే ఉద్యోగులు ప‌ర్య‌ట‌కులు, వ్యాపార‌వేత్త‌ల అవ‌స‌రాల‌ను అంచ‌నా వేసి, సౌక‌ర్య‌వంతంగా ప‌ర్య‌టించ‌డానికి సాయం చేస్తారు. రిసార్ట్స్‌, ట్రావెల్ సంస్థ‌లు త‌మ టూర్ ప్యాకేజీల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ట్రావెల్ ఏజెంట్ల‌ను ఉప‌యోగించుకుంటాయి. ఏ దారిలో ప్ర‌యాణిస్తే త్వ‌ర‌గా గ‌మ్యం చేరుకోవ‌చ్చు? ఎలా వెళ్లాలి? ముఖ్య‌మైన ప‌త్రాలు (వీసా, పాస్‌పోర్ట్‌, వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌), ఉండ‌టానికి అనువైన ప్రాంతాలు, ద్ర‌వ్య‌మార్పిడి రేట్లు, సంద‌ర్శించాల్సిన ప‌ర్య‌ట‌క‌ప్రాంతాలు, వాతావ‌ర‌ణం లాంటివి దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తారు. ప‌ర్య‌ట‌కుల బ‌డ్జెట్‌, ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను బ‌ట్టి సేవ‌లు అందిస్తారు. ఈ ట్రావెల్ ఏజెన్సీల్లో రిజ‌ర్వేష‌న్‌/కౌంట‌ర్ స్టాఫ్‌, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్టాఫ్‌, టూర్ ఎస్కార్ట్స్, టూర్ ఆప‌రేట‌ర్లు, కార్గో/కొరియ‌ర్ ఏజెన్సీ లాంటి అవ‌కాశాలు ఉంటాయి. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల‌ను ఉద్యోగంలోకి తీసుకుని శిక్ష‌ణ ఇస్తున్నాయి. 

హోటళ్లు: ప‌ర్య‌ట‌కుల‌కు వ‌స‌తి, భోజ‌న ఏర్పాట్లు క‌ల్పించ‌డంలో హోట‌ళ్లు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. ఒక ప్ర‌దేశ ప్రాచుర్యాన్ని బ‌ట్టి, అక్క‌డికి వ‌చ్చే ప‌ర్య‌ట‌కుల సంఖ్య‌ను బ‌ట్టి హోట‌ళ్లలో ప‌నిచేయ‌డానికి పెద్ద‌సంఖ్య‌లో, ర‌క‌ర‌కాల నైపుణ్యాలున్న ఉద్యోగులు అవ‌స‌రం.
ర‌వాణా: ప‌ర్య‌ట‌క రంగంలో వేర్వేరు ప్రాంతాలు క‌లుపుతూ బ‌స్సులు, కార్లు ఇత‌ర వాహ‌నాలు న‌డ‌ప‌డం, అద్దెకు వాటిని అందుబాటులో ఉంచ‌డం ద్వారా సొంతంగా ఉపాధి పొందే వీలుంది.

టాప్ రిక్రూట‌ర్లు:

ఐఆర్‌సీటీసీ

షెర‌టాన్ హోట‌ల్స్

హాలిడే ఇన్

మారియ‌ట్ హోట‌ల్స్

మేక్ మై ట్రిప్

కాక్స్ అండ్ కింగ్స్

థామ‌స్ కుక్

యాత్రా.కామ్

జెట్ ఎయిర్‌వేస్

మామ‌ర్ లారీ ట్రావెల్స్ అండ్ వెకేష‌న్స్‌.

 

హోదాలు.. విధులు

అంత‌‌ర్జాతీయ సంస్థ‌లు, ఇమ్మిగ్రేష‌న్ అండ్ క‌స్ట‌మ్స్ స‌ర్వీసెస్, ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్‌, హోట‌ళ్ల‌తోపాటు ఎయిర్‌లైన్ క్యాట‌రింగ్‌, గైడ్స్‌, సేల్స్ లాంటి సేవారంగాల సమ్మిళిత‌మే ప‌ర్య‌ట‌క రంగం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్ర‌యాణ‌, ప‌ర్య‌టక‌ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఏడో పెద్ద దేశం. జీడీపీలో కూడా అధిక వాటాను టూరిజం స‌మ‌కూరుస్తోంది. ప్యాకేజీ యాత్ర‌లు, తీర్థయాత్ర‌లు, సాహ‌స‌(అడ్వెంచ‌ర్‌) యాత్రలు లేదా వ్యాపార ప‌ర్య‌ట‌న‌లు త‌దిత‌రాలు ఏవైనా.. ఈ రంగంలో ప‌ని చేసే ఉద్యోగులు అన్ని ద‌శ‌ల్లో ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు క‌లిగి ఉంటారు. ట్రావెల్, టూరిజం రంగాల్లో వైవిధ్యంతో కూడిన ఉద్యోగాలుంటాయి. 
ట్రావెల్ ఏజెంట్‌: వీరు ఏయే ప్రాంతాలు ప‌ర్య‌ట‌న‌కు అనుకూల‌మో ఎంపిక చేసి, వ్య‌క్తిగ‌తంగా లేదా బృందాలుగా వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేస్తారు.

టూర్ ఆప‌రేట‌ర్‌: టూర్‌, ట్రావెల్‌కి సంబంధించిన అన్ని విష‌యాల‌ను స‌మ‌న్వ‌య‌ప‌రుస్తూ, హాలిడే ప్యాకేజీల‌ను రూపొందించ‌డం వీరి బాధ్య‌త.

ఈవెంట్ అండ్ కాన్ఫ‌రెన్స్ ఆర్గ‌నైజ‌ర్‌: కార్య‌క్ర‌మం అంతా స‌జావుగా సాగేలా చూడటం ఈవెంట్ మేనేజ‌ర్ విధి. మైకులు, సౌండ్ సిస్టం నుంచి మీటింగ్‌కు అనువైన ప్ర‌దేశాన్ని ఎంపిక చేయ‌డం వ‌ర‌కు వీళ్లే చూసుకుంటారు. 

టూర్ ప్లాన‌ర్ అండ్ గైడ్స్‌(రీజిన‌ల్‌/స‌్టేట్‌/లోక‌ల్‌): వీరు ప‌ర్య‌ట‌క రంగంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తారు. సంద‌ర్శ‌కులు/ప‌ర్య‌ట‌కుల బృందాల‌కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ కెరియ‌ర్ ఎంచుకోవాలంటే సంద‌ర్శ‌నీయ ప్రాంతాల‌కు సంబంధించి విశేషాలు తెలిసి ఉండాలి.

లీజ‌ర్ యాక్టివిటీ కోఆర్డినేట‌ర్‌: వీళ్లు రిసార్టులు,హోట‌ళ్ల‌లో ప‌ని చేస్తారు. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌ణాళిక ప్రకారం కార్య‌క్ర‌మం అంతా చ‌క్కగా సాగేలా చూడటం వీరి విధి. 

పీఆర్ మేనేజ‌ర్‌: ఒక బ్రాండ్‌కి సంబంధించిన గౌర‌వాన్ని కాపాడ‌టం పీఆర్ మేనేజ‌ర్ ప్ర‌ధాన బాధ్య‌త‌. సంస్థ త‌ర‌ఫున అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తారు. 

మ‌రికొన్ని ఉద్యోగాలు: ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్స్, ఇంట‌ర్‌ప్రిటేట‌ర్స్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ‌ర్, ట్రావెల్ కౌన్సిల‌ర్స్, టూర్‌/  డెస్టినేష‌న్ మేనేజ‌ర్, ట్రావెల్ మీడియా స్పెష‌లిస్ట్, ట్రావెల్ ఎడ్యుకేష‌నిస్ట్, టికెటింగ్ ఆఫీస‌ర్, అడ్వెంచ‌ర్ టూరిజం ఎక్స్‌ప‌ర్ట్‌/ఆప‌రేట‌ర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస‌ర్, టూర్‌/హాలిడే క‌న్స‌ల్టెంట్, టూరిజం ట్రెయిన‌ర్, ట్రావెల్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, టూర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్.

 

వెబ్‌సైట్‌: https://iittm.ac.in/main/admission%202015-2017.htm
 

Posted Date : 12-02-2021 .