• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పైచదువులకు అండగా.. ప్రైవేటుకు దీటుగా!
 

‣ బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలు 

‣ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్-2021తో అవకాశం

 

 

ప్రతిభ ఉన్న తమ పిల్లలను పైచదువులు చదివించేందుకు ఎంతోమంది తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వారిని ఉన్నతులుగా చూడాలన్న కల సాకారం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారు. అయితే అలాంటి తల్లిదండ్రులకు భరోసానిస్తూ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలను స్థాపించింది. వీటి ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. తాజాగా వీటిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ప్రవేశపరీక్ష ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్జేసీ & ఆర్డీసీ సెట్-2021లో ప్రతిభ కనబరిస్తే ఇంటర్, డిగ్రీ మొదటి సంవ్సరంలో ప్రవేశం పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా బోధన, వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుతాయి. 

 

గురుకులాలు.. క్రమశిక్షణకు మారుపేరు. విద్యాసంవత్సరం మొదట్లో వీటిలో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆయా కళాశాలల ముందు బారులు తీరుతుంటారు. ప్రతి అంశంలోనూ ప్రైవేటుకు దీటుగా ఉండే ఈ విద్యాలయాల్లో చేరిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నది వారి భావన. ఇది ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే ఇందులో చేరే విద్యార్థులు సాధించిన విజయాలు అలాంటివి. క్రమశిక్షణ నేర్పుతూ నాణ్యమైన బోధనతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు అధ్యాపకులు. 

 

కోర్సులు.. అర్హత

‣ ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరడానికి 2021-22 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 134 కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో బాలుర కళాశాలలు 66, బాలికలకు సంబంధించి 68 విద్యాలయాలు ఉన్నాయి. 

‣​​​​​​​ సిద్దిపేట జిల్లా వర్గల్లోని మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ఏడాది(ఇంగ్లిష్ మీడియం)లో చేరడానికి మహిళలకే అవకాశం ఉంది. బీఎస్సీ-ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీజడ్సీ, బీబీసీ, డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఏ-హెచ్ఈపీ, హెచ్పీఈ, బీకాం-జనరల్, కంప్యూటర్స్, బిజినెస్ అనలైటిక్స్లోనూ చేరవచ్చు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత, ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 40శాతం మార్కులు సాధించి ఉండాలి.

 

ఎంపిక విధానం

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే ఆర్జేసీ & ఆర్డీసీ సెట్ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఆయా కళాశాలల్లో బీసీలకు 75శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 5, ఈబీసీలకు 2, అనాథలు, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఏ కోర్సు ఎంచుకుంటున్నారో తెలపాల్సి ఉంటుంది. దాన్ని బట్టి పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ చేసి ప్రవేశాలు కల్పిస్తారు. 

 

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.200 చెల్లించాలి. దరఖాస్తులకు మే 31, 2021 చివరి తేదీ. 

 

పరీక్షల తేదీలు

‣​​​​​​​ ఆర్జేసీ సెట్-2021 పరీక్షను జూన్ 12, 2021న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. 

‣​​​​​​​ ఆర్డీసీ సెట్-2021 పరీక్ష జూన్ 13, 2021న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది.

 

ప్రత్యేక శిక్షణకు సూపర్-100

జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరిన విద్యార్థుల్లో వంద మందిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సూపర్-100గా ఎంపిక చేస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఐఐటీ, నీట్, ఎంసెట్ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. అలాగే అన్ని కళాశాలల్లోనూ ఐఐటీ, నీట్, ఎంసెట్, సీఏ/సీపీటీ & క్లాట్ శిక్షణ సైతం అందిస్తారు.

 

రాత పరీక్ష విధానం

‣​​​​​​​ ఆర్జేసీ సెట్లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగులో వస్తాయి. రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్లో సమాధానాలు చూపాలి. పదో తరగతి సబ్జెక్టుల నుంచే ప్రశ్నలొస్తాయి. ఎంపీసీ గ్రూప్నకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. బైపీసీ గ్రూప్ వారికి ఇంగ్లిష్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయి. ఎంఈసీ గ్రూప్లో చేరాలనుకునే వారికి ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

‣​​​​​​​ ఆర్డీసీ సెట్ పరీక్ష రెండున్నర గంటలు ఉంటుంది. మొత్తం 150 మార్కులకు కేటాయించారు. గ్రూపును బట్టి 40 మార్కుల చొప్పున మూడు పేపర్లుంటాయి. వీటితోపాటు ఇంగ్లిష్ 30 మార్కులకు ఉంటుంది. ఇంటర్మీడియట్కు సంబంధించిన సబ్జెక్టుల ఆధారంగానే ప్రశ్నపత్రం తయారు చేస్తారు. బీఎస్సీ-ఎంపీసీ, ఎంపీసీఎస్తోపాటు డేటా సైన్స్లో చేరాలనుకునే వారికి ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ నుంచి, బీఎస్సీ ఎంఈసీ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎకనామిక్స్ & కామర్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. బీఎస్సీ-బీజడ్సీ, బీబీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బీఏకు సంబంధించిన గ్రూపుల్లో చేరే విద్యార్థులకు ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్ సబ్జెక్టుల ప్రశ్నలు ఉంటాయి. బీకాం గ్రూపుల్లో చేరాలంటే ఇంగ్లిష్, ఎకనామిక్స్ & కామర్స్ నుంచి ప్రశ్నలొస్తాయి.

 

​​​​​​​

 

సబ్జెక్టుల వారీగా సిద్ధమవ్వండిలా..

ఆర్జేసీ సెట్- ఇంగ్లిష్:

ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయికి చెందినవే ఉంటాయి. పాఠాల నంచి ఎలాంటి ప్రశ్నలూ అడగరు. ఏదైనా పదానికి అర్థం గుర్తించమనడం, ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్షంలోకి, పరోక్షం నుంచి ప్రత్యక్షంలోకి మార్చమంటారు. అలాగే వాఖ్యంలోని ఖాళీలను పూరించడం, రెండు వాక్యాలు ఇచ్చి కలిపి రాయడం, ఇచ్చిన వాక్యాల్లో సరైనదాన్ని గుర్తించమనడం తదితర అంశాల నుంచి అడుగుతారు. ప్యాసేజ్ ప్రశ్నలు మొదలైనవి ఉంటాయి. ఈ పరీక్షలో ముఖ్యంగా విద్యార్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడో పరిశీలిస్తారు. అందుకే వ్యాకరణంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవాలి. ఆర్టికల్స్, లెటర్ రైటింగ్ తదితరాలు తెలుసుకోవాలి. భాషాభాగాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నల తీరు, ఏయే విభాగాల నుంచి వస్తున్నాయో తెలుసుకుని సన్నద్ధం కావచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఆంగ్ల విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. 

 

భౌతిక రసాయన శాస్త్రాలు

ఈ విభాగంలో మార్కులు సాధించాలంటే భావనలపై పట్టు పెంచుకోవాలి. అనువర్తన, పరిశీలనాత్మక ప్రశ్నలు అడుగుతారు. ప్రయోగాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. పదో తరగతిలోని అన్ని పాఠ్యాంశాల నుంచీ ప్రశ్నలు వస్తాయి. రెండు సబ్జెక్టుల్లోని అన్ని పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్సు రాసుకోవాలి. సమస్యలపైనా ప్రశ్నలు వస్తాయి. అందుకే సూత్రాలను గుర్తుంచుకుని, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. 

 

గణితం

అన్ని అధాయ్యాల నుంచీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ముఖ్యమైన సూత్రాలను రాసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నకు ఏ సూత్రం అనువర్తించాలో తెలుసుకోవడానికి ముందస్తు సాధన అవసరం. గత ప్రశ్నపత్రాలను పరిశీలస్తే.. అన్ని అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అన్ని పాఠ్యాంశాల్లోని సమస్యలను సమ ప్రాధాన్యంలో చేయాలి. ఇచ్చిన సమయంలో ప్రశ్నలు సాధించడానికి సాధనే కీలకం. 

 

జీవశాస్త్రం

పటాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. పాఠ్యాంశాలను శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలస్తే ప్రాథమికాంశాల నుంచే నేరుగా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ప్రతి వాక్యాన్నీ శ్రద్ధతో మననం చేస్తే ఈ విభాగంలో వీలైనన్ని మార్కులు సాధించవచ్చు. 

 

సాంఘిక శాస్త్రం

ముందే అనుకున్నట్టు ప్రశ్నలన్నీ పదో తరగతి పుస్తకం నుంచే వస్తాయి. భోగోళశాస్త్రం, చరిత్ర, పౌర, అర్థ శాస్త్రాలకు పరీక్షలో సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. వాటిని క్షుణ్ణంగా చదవడం మేలు. గత పరీక్షలను పరిశీలిస్తే.. రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన ఆర్టికల్, తలసరి ఆదాయం కన్నుకోవడానికి ఉపయోగించే సూత్రం, మహానది జన్మస్థలం తదితర ప్రశ్నలు నేరుగా అడిగారు. కంఠతా పట్టకుండా ప్రతి పాఠ్యాశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోవాలి. 

 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ31.05.2021

 

వెబ్‌సైట్‌: https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB20/#!/home0602asderf.rps


 

Posted Date : 24-04-2021 .