• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎవ‌ర్‌గ్రీన్‌ యాక్చూరియ‌ల్ సైన్స్!

ఆర్థిక గణకులకు అంతర్జాతీయ డిమాండ్

ఇంటర్ తో ఏసెట్‌ రాస్తే కోర్సుల్లోకి ప్రవేశాలు

జూన్ 2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

 

 

పిల్ల‌లు చిన్న‌ప్ప‌టి నుంచే లెక్క‌ల్లో చురుగ్గా ఉన్నారా? అయితే ఇంట‌ర్ త‌ర్వాత యాక్చూరియ‌ల్ సైన్స్ కోర్సు చేయించ‌డం మంచిది. ఎందుకంటే దేశ‌విదేశాల్లో ఆర్థిక గ‌ణ‌కుల‌కు మంచి డిమాండ్ ఉంది. వివిధ సంస్థ‌ల్లో వీరి పాత్ర కీల‌కం. ముఖ్యంగా బీమా, ఆర్థిక సంస్థ‌ల్లో ఉద్యోగావ‌కాశాలు మెండుగా ఉంటాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు సైతం ఆర్థికప‌ర‌మైన స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి యాక్చూరీల స‌ల‌హాల‌ను తీసుకుంటాయి.  ఈ కోర్సు చేసిన వారిని పెద్ద‌పెద్ద సంస్థ‌లు భారీ ప్యాకేజీలు ఇచ్చి చేర్చుకుంటున్నాయి. ఇలాంటి ఉద్యోగాలు సాధించాలంటే ముందుగా కోర్సులో చేర‌డానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వ‌హించే యాక్చూరియ‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏసెట్‌)  రాయాలి. ఈ ప్ర‌క‌ట‌న‌ ఏటా రెండు సార్లు వెలువ‌డుతుంది. తాజాగా జూన్ సెష‌న్‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 

 

అర్హ‌తలు

ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌(10+2)/ త‌త్సమాన ప‌రీక్ష‌ల్లో అర్హత సాధించి ఉండాలి. ఈఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులే. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులపై పట్టున్నవారు యాక్చూరియల్ సైన్స్‌ను సులువుగా అర్థం చేసుకుంటారు. 

 

కోర్సుకు ఎంపిక ఎలా?

ఏసెట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ చేప‌డ‌తారు. ఇందులో వ‌చ్చిన మార్కుల‌ను బ‌ట్టి యాక్చూరియ‌ల్ సైన్స్ కోర్సు అందిస్తున్న క‌ళాశాల‌ల్లో చేర‌వ‌చ్చు. 

 

రాత ప‌రీక్ష వివరాలు

ఈ ప‌రీక్ష ఆన్‌లైన్ హోమ్ బేస్డ్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా టెక్నిక‌ల్ ప‌రిక‌రాలు (హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌) క‌లిగి ఉండాలి. అంటే ప‌రీక్ష‌కు అవ‌స‌ర‌మైన ఇంట‌ర్నెట్, వెబ్ కెమెరా, విండోస్ 10/8/7 వ‌ర్ష‌న్ త‌దిత‌ర సౌక‌ర్యాలు ఉంటేనే ప‌రీక్ష రాయ‌డానికి అనుమ‌తిస్తారు. మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంగ్లిష్‌, డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌, లాటిక‌ల్ రీజ‌నింగ్‌ విభాగాల నుంచి ప‌రీక్ష‌లో ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. సమయం 3 గంట‌లు ఉంటుంది. మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సెక్ష‌న్‌-ఏలో ఒక మార్కు ప్ర‌శ్న‌లు 45, సెక్షన్-బీలో రెండు మార్కుల ప్రశ్నలు 20, సెక్షన్-సీలో మూడు మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్(30 మార్కులు), స్టాటిస్టిక్స్(30 మార్కులు), డేటా ఇంటర్‌ప్రిటేషన్(15 మార్కులు), ఇంగ్లిష్(15 మార్కులు), లాజికల్ రీజనింగ్(10 మార్కులు) నుంచి ప్రశ్నలొస్తాయి. ఈ ప‌రీక్ష‌లో రుణాత్మక మార్కులు ఉండవు. అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు వ‌స్తే అర్హత సాధించిన‌ట్టు.

 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు

తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ‌ప‌ట్నంలో ఏసెట్ ప‌రీక్షా కేంద్రాలు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా మొత్తం 24 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

 

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు జూన్ 2, 2021 తుది గ‌డువు. సంబంధిత వెబ్‌సైట్‌లో గ‌డువులోగా త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి. 

 

వివిధ స్టేజీలు.. 13 పేప‌ర్లు

కోర్సుకు ఎంపికైన‌అభ్య‌ర్థులు యాక్చూరీ ఫెలో కావ‌డానికి మొత్తం 13 పేప‌ర్ల‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇవి స్టేజీల వారీగా ఉంటాయి. స్టేజ్‌కోర్ ప్రిన్సిప‌ల్స్‌లో 7, స్టేజ్‌కోర్ ప్రాక్టీసెస్‌లో 3 పేప‌ర్లు అంద‌రికీ ఉమ్మ‌డిగా ఉంటాయి. ఈ రెండు ద‌శ‌ల‌ను పూర్తి చేసిన వారిని అసోసియేట్‌గా ప‌రిగ‌ణిస్తారు. స్టేజ్‌స్పెష‌లిస్ట్ ప్రిన్సిప‌ల్స్‌లోని 8 పేప‌ర్ల‌లో అభ్య‌ర్థులు త‌మ‌కు న‌చ్చిన రెండింటిని ఎంపిక చేసుకుని పూర్తి చేయాలి. ఇక స్టేజ్‌స్ప‌ష‌లిస్ట్ అడ్వాన్స్‌డ్‌లో ఏదైనా ఒక పేప‌రును సాధించాలి. ఈ క్ర‌మంలో స్టేజ్‌పాసైనా ఉద్యోగం ల‌భించ‌డం ఖాయం. ఇక అన్ని పేప‌ర్లు పూర్తి చేసిన వారికి నెల వేత‌నం రూ.ల‌క్ష‌ల్లో ఉంటుంది. 

 

ఇదీ సిల‌బ‌స్‌

ప‌రీక్ష‌లో మొత్తం అయిదు విభాగాల‌కు చెందిన అంశాల నుంచి ప్రశ్న‌లు అడుగుతారు. 

 

మ్యాథమేటిక్స్‌: ఆర్థిక గ‌ణ‌కులుగా రాణించాలంటే గ‌ణితంపై ప‌ట్టు ఉండాలి. పరీక్షలో అడిగే ఈ ప్ర‌శ్న‌లు కాస్త క‌ఠినంగా ఉన్న‌ప్ప‌టికీ సాధ‌న చేస్తే సుల‌భమే. ఈ విభాగంలో నొటేష‌న్ అండ్ స్టాండ‌ర్డ్ ఫంక్ష‌న్స్‌, న్యూమెరిక‌ల్ మెథ‌డ్స్‌, ఆల్‌జీబ్రా, డిఫ‌రెన్సియేష‌న్, ఇంటిగ్రేష‌న్, వెక్ట‌ర్స్, మాట్రిసెస్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతారు. 

 

స్టాటిస్టిక్స్‌: ప‌ర్ముటేష‌న్స్ అండ్ కాంబినేష‌న్స్‌, టైప్స్ ఆఫ్ డేటా నుంచి స్టాట‌స్టిక‌ల్ డైగ్రామ్స్‌, బార్ చార్ట్‌, హిస్టోగ్రామ్‌, డాట్ ప్లాట్‌, స్టెమ్ అండ్ లీఫ్‌, బాక్స్‌ప్లాట్ నుంచి అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాలు గుర్తించాలి. అలాగే మేజ‌ర్స్ ఆఫ్ లొకేష‌న్‌, మేజ‌ర్స్ ఆఫ్ స్ప్రెడ్‌కు సంబంధించి మీన్స్‌, మెడియ‌న్‌, మోడ్‌, రేంజ్, ఇంట‌ర్‌క్వార్ట్‌టైల్ రేంజ్‌, స్టాండ‌ర్డ్ డీవియేష‌న్‌, వేరియెన్స్‌తోపాటు ప్రాబ‌బిలిటీస్, అడ్వాన్సుడ్ ప్రాబ‌బిలిటీస్ డిస్క్రీట్ రాండ‌మ్ వేరియ‌బుల్ త‌దిత‌ర అంశాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి.

 

ఇంగ్లిష్‌: ఇంగ్లిష్‌లో అభ్య‌ర్థి ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు. ఇది హైస్కూల్ స్థాయిలోనే ఉంటుంది. ఇంగ్లిష్ గ్రామ‌ర్ నియ‌మాలు తెలిస్తే స‌మాధానాలు సులువుగా గుర్తించ‌వ‌చ్చు. ఒకాబ్యుల‌రీ, గ్రామ‌ర్‌కు సంబంధించిన అంశాల నుంచే ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఒకాబ్యుల‌రీలో  సిన‌నిమ్స్‌, ఆంటోనిమ్స్‌, మీనింగ్స్ ఆఫ్ వ‌ర్డ్స్‌, సెకండ‌రీ షేడ్స్ ఆఫ్ మీనింగ్‌, యూసేజ్, ఇడియ‌మ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి అడుగుతారు. ఇక గ్రామ‌ర్‌లో సెంటెన్స్ క‌రెక్ష‌న్, సెంటెన్స్ అరేంజ్‌మెట్స్‌, ఖాళీలు పూరించ‌డం, ప్యాసేజ్‌లు ఇస్తారు. ఆంగ్ల ప‌త్రిక‌లు చ‌ద‌వ‌డం ద్వారా భాషపై పట్టు పెరిగి మార్కులు సాధించుకోడానికి దోహదపడుతుంది. వె‌ర్బ‌ల్ రీజ‌నింగ్‌లో ప‌దాలు, వాక్యాల స‌మూహాల్లో సంబంధాలు, నమూనాలను గుర్తించాలి. 

 

డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌: డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్ విభాగంలో ప్ర‌శ్న‌లు పట్టిక‌ల రూపంలో ఉంటాయి. ఇందుకోసం గ‌ణిత అంశాలు, సూత్రాల‌పై దృష్టి పెట్టాలి. టేబుల్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్స్ గుర్తుంచుకోవ‌డం ముఖ్యం.  కాల‌మ్ గ్రాఫ్స్‌, బార్ గ్రాఫ్స్‌, లైన్ చార్ట్స్‌, పై చార్ట్స్‌, వెన్ డ‌యాగ్రామ్, కేస్‌లెట్స్ నుంచి అడుగుతారు. న‌మూనా ప్ర‌శ్న ప‌త్రాల‌ను గ‌మ‌నిస్తే ప్ర‌శ్న‌లు ఎలా వ‌స్తున్నాయో అర్థ‌మ‌వుతాయి. స‌మ‌స్య‌ల‌పై సైద్ధాంతిక భావ‌న‌ల‌ను ఉప‌యోగించడంపై దృష్టి పెట్టాలి.  

 

లాజిక‌ల్ రీజ‌నింగ్‌: ఈ విభాగంలో లాజిక‌ల్‌గా ఆలోచించి స‌మాధానాలు క‌నిపెట్టాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల తార్కిక ఆలోచ‌న విధానాన్ని ప‌రిశీలిస్తారు. నంబ‌ర్స్ అండ్ లెట‌ర్ సిరీస్‌, క్యాలెండ‌ర్‌, క్లాక్స్‌, క్యూబ్స్‌, వెన్ డ‌యాగ్రామ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, లాజిక‌ల్ సీక్వెన్స్‌, మ్యాచింగ్‌, సిలోజియం, బ్ల‌డ్ రిలేష‌న్స్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. అలాగే  ఏదైనా ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతారు. వాటిని స‌మాధానం గుర్తించాలి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించాలంటే సాధ‌న చేయ‌డ‌మే కీల‌కం. వీలైన‌న్ని షార్ట్‌క‌ట్స్ ఉప‌యోగించి ప్ర‌శ్న‌ల‌ను సాధిస్తే స‌మ‌యం మిగులుతుంది.  

 

ప‌రీక్ష తేదీ: జూన్ 26, 2021.

 

వెబ్‌సైట్‌: http://www.actuariesindia.org/index.aspx

 

పాత ప్ర‌శ్న‌ప‌త్రాల కోసం క్లిక్ చేయండి....

Posted Date : 28-04-2021 .