• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పల్లెల ప్రగతిపై పరిశోధనలకు ‘ఫెలో’

మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ - తొమ్మిది ఐఐఎంల్లో 660 పైగా ఖాళీలు 

నెలకు రూ. 60 వేల వరకు స్టైపెండ్

 

 

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ప్రణాళికలు, జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై కోర్సులు చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) మంచి అవకాశం కల్పిస్తోంది. దేశంలోని తొమ్మిది ఐఐఎంలు అందించే పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్ మెంట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇది. ఇందుకు సంబంధించి ఐఐఎం-బెంగళూరు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. 2021-23 సంవత్సరానికి సంబంధించిన ప్రకటన తాజాగా విడుదలైంది. భారత ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంత్రప్రిన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖ (ఎంఎస్‌డీఈ) ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ల (ఎస్ఎస్‌డీఎమ్) సహకారంతో అమలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చైతన్యవంతులైన యువత నైపుణ్య, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. 

 

అర్హత ఏమిటి?

ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి లాభాపేక్ష లేని సామాజిక అంశాలకు సంబంధించి పని చేయడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అనుభవం లేకపోయినా ఆయా ప్రాంతాల్లో పని చేయాలనే తపన ఉంటే అప్లై చేసుకోవచ్చు. కనీస వయసు 21 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి. స్థానిక భాషపై పట్టు తప్పనిసరి. 

 

దరఖాస్తు విధానం

తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 27,2021.

 

ఎంపిక విధానం

ఐఐఎం బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దాన్ని బట్టి తుది ఎంపికలు ఉంటాయి. రాత పరీక్ష 2021 ఏప్రిల్ మూడో వారంలో ఉంటుంది. 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ తరహాలో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. జనరల్ అవెర్‌నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. 

 

ప్రోగ్రామ్ వివరాలు

మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్)నకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఐఐఎంలలో 660కి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అహ్మదాబాద్, బెంగళూరు, జమ్మూ,  కోజికోడ్, లఖ్నవు, నాగ్పూర్, రాంచీ,  ఉదయ్పూర్, విశాఖపట్నం ఐఐఎంలు ఉన్నాయి. ప్రస్తుతం ఐఐఎం-బెంగళూరు ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం. ప్రోగ్రామ్ రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో భాగంగా పైన పేర్కొన్న ఐఐఎంల ద్వారా తరగతి గది సెషన్లు(అకడమిక్ మాడ్యూల్), జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయి పర్యటనలూ ఉంటాయి. ఒక్కో మాడ్యూల్లో 10 రోజుల చొప్పున మొత్తం అకడమిక్ మాడ్యూల్లో 40 తరగతి రోజులు ఉంటాయి. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యార్థులు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించాల్సి ఉంటుంది. ఫెలోషిప్ ప్రపంచ బ్యాంక్ లోన్ అసిస్టెడ్ ప్రోగ్రామ్. దీన్ని స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవెర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కింద రూపొందించారు. ప్రోగ్రామ్కు ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌ అండ్ ఆంత్రప్రిన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖ మొదటి ఏడాది నెలకు రూ.50,000, రెండో ఏడాది నెలకు రూ.60,000 చొప్పున స్టైపెండ్ అందిస్తుంది. 

 

 

సన్నద్ధతకు సూచనలు

జనరల్ అవెర్‌నెస్

భారతదేశం, పొరుగు దేశాల్లో జరిగే ప్రధాన సంఘటనలపై ప్రశ్నలు అడుగుతారు. చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, భారతదేశం పాల్గొన్న సమ్మిట్స్, వాటి ముఖ్యాంశాలు, ఆయాదేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. పొడవైన/లోతైన/ ఎత్తైన నదులు, పర్వతాలు, వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్ సంబంధిత అంశాల్లో ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, కరోనా వైరస్, బ్యాక్టీరియా తదితర సమాచారాన్ని సేకరించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం ద్వారా పరీక్షకు కావాల్సిన సమాచారాన్ని సేరించుకొని సరైన ప్రిపరేషన్ సాగించవచ్చు.

 

డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్

డాటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు సాధారణంగా పట్టికలు, బొమ్మలు, గ్రాఫ్ లు తదితర రూపాల్లో ఉంటాయి. వాటి కింద  ప్రశ్నలు ఇస్తారు. సమర్థంగా జవాబులు గుర్తించాలంటే ప్రాథమిక గణిత ప్రక్రియలపై పట్టు సాధించాలి. కొన్ని ముఖ్యమైన టేబుల్స్ నేర్చుకోవడంతోపాటు, గణిత సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. స్క్వేర్ లు, స్క్వేర్ రూట్ లు మొదలైన వాటిని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి అంశాన్ని వివరంగా అధ్యయనం చేసి, నమూనా ప్రశ్నలను సాధన చేయాలి. సమస్యలకు సైద్ధాంతిక భావనలను ఎలా ఉపయోగించాలో అర్థం తెలుసుకోవాలి. లాజికల్ రీజనింగ్లో అనలిటికల్ రీజనింగ్, లీనియర్ అరెంజ్మెంట్స్, నంబర్ సిరీస్, మ్యాట్రిక్స్ అరెంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్ షిప్ తదితర అంశాలు ఉంటాయి. దీని కోసం నమూనా ప్రశ్నలను వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి ఇదొక్కటే మార్గం. ఈ ప్రశ్నలను ఎంత బాగా పరిష్కరిస్తే అంత మంచి స్కోరు సాధించవచ్చు. 

 

* క్వాంటిటేటివ్ ఎబిలిటీ

అభ్యర్థులు మొదటిగా షార్ట్కట్విధానంలో గుణకారం, భాగహారం, కూడిక, తీసివేతలు చేయడం నేర్చుకోవాలి. సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటకు వచ్చి, పెన్ ఉపయోగించకుండా సింప్లిఫికేషన్ చేయటం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థుల దృష్టి సమాధానం మీద కాకుండా ఏ విధానంలో చేస్తే తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవడంపై ఉండాలి. చాప్టర్ వేరైనప్పటికీ లాజిక్ ఒకటే ఉంటుంది. అలా చాప్టర్ల మధ్య పోలికలు, తేడాలు గుర్తిస్తూ సిద్ధమవ్వాలి.

 

వెర్బల్ ఎబిలిటీ రీడింగ్ కాంప్రహెన్షన్

రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ప్యాసేజ్ ఇస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం సులభమే. కచ్చితంగా 8 నుంచి 10 ప్రశ్నలుండే ప్యాసేజ్‌లపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆంగ్ల వార్తాపత్రికలను రోజూ చదవడం ద్వారా ప్యాసేజ్‌లను తేలిగ్గా అవగాహన చేసుకోవడం అలవాటవుతుంది. ఆంగ్ల పదసంపదను పెంచుకోవాలి. ఇది పలు రకాల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో సాయపడుతుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్యాసేజ్‌లు ఇస్తున్నారో తెలుస్తుంది. 

 

వెబ్‌సైట్‌ : https://www.iimb.ac.in/mgnf

Posted Date : 18-02-2021 .