• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అంత క‌ష్టం కాదు! స‌రైన స‌న్న‌ద్ధ‌త‌తో విజ‌యం!

గేట్‌-2021 టాప‌ర్ల సూచ‌న‌లు

 

 

జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఒకటి. ఏటా లక్షల్లో విద్యార్థులు దీనికి పోటీపడతారు. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉన్నతవిద్య అవకాశంతోపాటు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశానికీ ఇది మంచి మార్గం. ఇటీవల గేట్‌ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయస్థాయిలో పీఐ, ఈసీఈ బ్రాంచిల్లో మేటి ర్యాంకులు సాధించిన గౌతమ్‌ గుడిమెల్ల, ఎం. పూజశ్రీలు తమ సన్నద్ధత విశేషాలను ‘చదువు’తో పంచుకున్నారు. వారి విజయగాథ వారి మాటల్లోనే..

 

పక్కా ప్లానింగ్‌ ఉండాలి 

మా స్వస్థలం ఏలూరు. తండ్రి సుదర్శనాచార్యులు ఎస్‌బీఐ రిటైర్డ్‌ మేనేజర్‌. తల్లి శేషు గృహిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఇంజినీరింగ్‌ నిట్‌ నాగ్‌పుర్, మాస్టర్స్‌ ఐఐఎస్‌సీ బెంగళూరులో చేశాను. ప్రస్తుతం ఓ ప్రభుత్వ పరిశోధన సంస్థలో సైంటిస్ట్‌ గా పనిచేస్తున్నా. ఐఐటీ హైదరాబాద్‌ నుంచి పీహెచ్‌డీ చేయాలనేది నా తదుపరి ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే గేట్‌ రాశాను. దీనివల్ల నా సబ్జెక్టు కాన్సెప్ట్స్, బేసిక్స్‌ పునశ్చరణ బాగా అయింది.

 

సరైన ప్రిపరేషన్‌ చేయనివారికి గేట్‌ చాలా క్లిష్టమే. కానీ పరీక్ష పేపర్‌ తయారుచేసే ఐఐటీ, ఐఐఎస్‌సీ ప్రొఫెసర్స్‌ మన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్‌ అయితే మాత్రం ఇదో స్పష్టమైన పరీక్ష. దీనిలో ర్యాంకు రావాలంటే  ప్రిపరేషన్‌ సమయంలో మన మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నా ఉద్దేశ్యంలో ర్యాంకు కోసమని మాత్రమే సిద్ధమైతే దానివల్ల స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే ర్యాంకు వల్ల వచ్చే ప్రభుత్వ ఉద్యోగం లేదా మాస్టర్స్‌ సీటు ధ్యేయంగా చదివితే ఒత్తిడి  తగ్గుతుంది. ఇక జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే చదివితే అసలు ఒత్తిడే ఉండదు.

 

ఇంకో జాగ్రత్త- వీలైనంత ముందుగా ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం మధ్య సమయంలో మన ధ్యేయం ఏమిటో తెలుసుకుని ఆ దిశగా ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. సాధించదల్చినది ఏది అయినా కూడా కొంచెం ముందుగా మొదలుపెట్టి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిత్యం మన ధ్యేయం మనకు గుర్తుండేలా చూసుకోవాలి. ప్రిపరేషన్‌ మనల్ని ముందు సంతృప్తి పరచాలి.

 

సగటు విద్యార్థికి సాధ్యమే!  

ఒక మెరిట్‌ విద్యార్థి ర్యాంకు తెచ్చుకోవడం కంటే సగటు విద్యార్థి మంచి ర్యాంకు తెచ్చుకోవడమే సులభం. ఎందుకంటే మెరిట్‌ విద్యార్థి తనకన్నీ తెలుసనే భ్రమలో ఉంటాడు. ఆ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ సిల్లీ మిస్టేక్స్‌ ఎక్కువ చేసేలా చేసి సాధారణ ర్యాంకర్‌గా మిగులుస్తుంది. అదే సగటు విద్యార్థి ప్రణాళికతో, మంచి గైడెన్స్‌ తీసుకుంటూ నిజాయతీగా తయారైతే తప్పక మంచి ర్యాంకు గేట్‌లో సాధించవచ్చు. గణాంకాల ప్రకారం మొదటి 100 లోపు ర్యాంకర్స్‌లో దాదాపు 95 మంది ఇంజినీరింగ్‌లో సగటు విద్యార్థులే. దీనికి కారణం ఒక మెరిట్‌ విద్యార్థికి గేట్‌ రాసే సమయానికే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం రావడం వల్ల గేట్‌ అంత ముఖ్యం కాకపోవచ్చు. అదే సగటు విద్యార్థికి తను అనుకున్న మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చి ఉండకపోవచ్చు. కొంతమందికి మార్కుల శాతం తక్కువ ఉండటంవల్ల అసలు ఉద్యోగమే వచ్చి ఉండకపోవచ్చు. ఇవి సగటు విద్యార్థిలో ఏదైనా సాధించాలనే తపన పెంచుతాయి. దీన్ని సరైన మార్గంలో పెట్టి కృషి చేస్తే తప్పక మంచి ర్యాంకు వస్తుంది. 

 

ఏ పరీక్షకు అయినా ఈ పోటీ ప్రపంచంలో కోచింగ్‌ తప్పనిసరి. ఎందుకంటే కోచింగ్‌ క్లాసులు మనతో పోటీ పడేవారిని మనకి పరిచయం చేస్తాయి. ఇంజినీరింగ్‌లో సరిగా అర్థంకాని ఎన్నో బేసిక్‌ కాన్సెప్ట్స్‌నీ, చక్కని టిప్స్‌నీ, ట్రిక్స్‌నీ మనకి నేర్పిస్తాయి. మంచి కోచింగ్‌ క్లాసులో  సమయాన్ని సరైనవిధంగా వెచ్చిస్తే ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. ఒకవేళ నేరుగా క్లాస్‌కి వెళ్ళలేకపోతే ఆన్‌లైన్‌ తరగతులైనా వినవచ్చు. కోచింగ్‌ వారు మెటీరియల్‌ తయారుచేసేటప్పుడు అన్ని పాఠ్యపుస్తకాల సారాన్ని సులభమైన విధంగా అందించి ప్రిపరేషన్‌ని సులభతరం చేస్తారు. అది కుదరని పక్షంలో నమూనా ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ రూపంలోనైనా సాధన చెయ్యాలి. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల కోచింగ్‌ తీసుకోలేకపోయాను. కానీ హైదరాబాద్‌ ఏస్‌ అకాడెమీ వారి స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ నా ప్రిపరేషన్లో ముఖ్య భూమికను పోషించాయి. 

 

ఎంత సమయం చదవాలంటే..

సాధారణంగా ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ వారు గేట్‌ పరీక్షకి ఏడాది ముందు నుంచి రోజుకి 2-3 గంటల సమయం చదవాలి. పరీక్షకి నెల ముందు రోజుకి 4-5 గంటల సమయం పునశ్చరణ, ప్రాక్టీస్‌ల కోసం కేటాయించాలి. ఇంజినీరింగ్‌ పూర్తి అయి పూర్తిగా గేట్‌ కోసం ప్రిపేరయ్యేవారు 6-7 నెలల సమయం రోజుకి 12-14 గంటల సమయం వెచ్చించాల్సివస్తుంది. ఉద్యోగులయితే 3-4 నెలల సమయం రోజుకి 2-3 గంటలు చదువుతూ, చివరి నెలలో రోజుకి 5-6 గంటలు పునశ్చరణ, ప్రాక్టీస్‌ కోసం కేటాయించాలి.

 

ప్రిపరేషన్‌ సమయంలో ముఖ్యమైన పొరపాటు ప్లానింగ్‌ లేకపోవటం. ఇంకా తమ శక్తులూ, బలహీనతలూ తెలుసుకోకపోవడం. దీని కోసం సీనియర్స్‌/ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యాపకుల/ పూర్వపు ర్యాంకర్ల సలహాలతో ప్రణాళిక వేసుకోవాలి. క్రమబద్ధమైన ప్రిపరేషన్‌తో ముందుకు సాగుతూ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు రాయాలి. బలాలను పెంచుకుంటూ, బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకోవాలి. నిజాయతీ, పట్టుదలతో ఆత్మవిశ్వాసం పెరిగేలా సన్నద్ధత సాగించాలి.  

 

ర్యాంకు అనేది ఒక నంబర్‌ మాత్రమే. కానీ దాన్ని సాధించే మన ప్రయాణం అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక సగటు ర్యాంకర్‌ అత్యున్నత ర్యాంకర్‌గా తయారవ్వాలంటే జ్ఞానం, యాటిట్యూడ్‌ చాలా ముఖ్యం. సగటు ర్యాంకర్‌గా చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. పునశ్చరణ వీలైనన్ని ఎక్కువసార్లు చెయ్యాలి. నమూనా ప్రశ్నపత్రాలు బాగా సాధన చేసి బలాన్ని పెంచుకోవాలి. పరీక్ష సమయంలో పరీక్ష మీద మాత్రం మనసుండాలి గానీ ర్యాంకు మీద కాదు. ఇక అతి ముఖ్యమైనది- అత్యున్నత ర్యాంకర్‌ సిల్లీ మిస్టేక్స్‌ అసలు చేయడు. అదే సగటు ర్యాంకర్‌ వాటిని ఎక్కువ చేస్తాడు. అందువల్ల మన ప్రిపరేషన్‌ ఈ సిల్లీ మిస్టేక్స్‌ని తగ్గించేవిధంగా ఉండాలి.

 

సాధన చేస్తే సత్ఫలితం

మాది చిత్తూరు. నాన్న చెన్నకేశవరెడ్డి, అమ్మ సుభాషిణి. ఇద్దరూ ఉపాధ్యాయులే. బీటెక్‌ నాలుగో సంవత్సరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో చదువుతున్నాను.

 

పీఎస్‌యూల్లో మంచి ఉద్యోగం వస్తుందని స్నేహితులూ, తెలిసిన వారినుంచి విని గేట్‌పై ఆసక్తి ఏర్పడింది. ఈ పరీక్ష సన్నద్ధతను బీటెక్‌ రెండో సంవత్సరం చివర్లో మొదలుపెట్టాను. వేసవి సెలవుల్లో షార్ట్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నాను. దాని ఆధారంగా ఆపై సొంతంగా సిద్ధమయ్యా.

 

గేట్‌ కష్టమని చాలామంది భావిస్తారు. కానీ సన్నద్ధతపై సరిగా దృష్టిపెడితే మంచి ర్యాంకు సాధించడం సాధ్యమే అనేది నా అభిప్రాయం. సాధనపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. మాక్‌ టెస్ట్‌లు, గత ప్రశ్నపత్రాలను బాగా సాధన చేశాను. ఇవి సిలబస్‌పై పట్టుకు సాయపడ్డాయి. కాలేజీ, పరీక్షల సమయంలో గేట్‌ సన్నద్ధతకు కేటాయించిన సమయం తక్కువే. కానీ సెలవులు, లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. 

 

గేట్‌ రాయాలనుకునేవారు ఎవరైనా ఎక్కువగా సాధనపై దృష్టిపెట్టాలి. మాదిరి పరీక్షలను రాయడం, చేసిన తప్పులను సరిచూసుకుని, తిరిగి వాటిని చేయకుండా చూసుకోవటం ముఖ్యం. సన్నద్ధతను ఆపకుండా కొనసాగించగలగాలి. ఇవి మంచి ర్యాంకు సాధనకు తప్పక ఉపయోగపడతాయి. చేసిన తప్పులను చూసుకోకపోవడం, కష్టంగా ఉన్న టాపిక్‌లను వదిలేయడం, సన్నద్ధతను కొనసాగించకుండా ఆపేయడం లాంటివి చాలామంది చేస్తుంటారు. ఒక్కోసారి ప్లేస్‌మెంట్లపై దృష్టిపెడుతూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవన్నీ వారిని ర్యాంకుకు దూరం చేస్తాయి. నేనూ ప్లేస్‌మెంట్లపై దృష్టిపెట్టినా గేట్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదనుకున్నాను. 

 

నా దృష్టిలో సాధారణ విద్యార్థి కూడా గేట్‌ను సాధించగలడు. రెండో ఏడాది చివర్లో లేదా మూడో ఏడాది ప్రారంభం సన్నద్ధత ప్రారంభించడానికి తగిన సమయం. కాకపోతే సాధనకు ఎక్కువ సమయం కేటాయించగలగాలి.
 

Posted Date : 07-04-2021 .