• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అందుకోండి.. అణుపరిశోధన సంస్థలో ఉద్యోగం

బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్).. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ. ఇందులో కొలువు సాధిస్తే ఆక‌ర్ష‌ణీయ‌మైన జీత‌భ‌త్యాలు అందుకోవ‌చ్చు. భవిత‌కు బంగారు బాట‌లు వేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం కోల్‌క‌తాలోని రేడియేష‌న్ మెడిసిన్ రిసెర్చ్ సెంట‌ర్‌, ముంబ‌యిలోని బార్క్ మొత్తం 63 పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేశాయి. అందులో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సైంటిస్ట్‌, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 53, స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు 10 ఉన్నాయి. న‌్యూక్లియ‌ర్ మెడిసిన్‌, పాథాల‌జీ, రేడయాల‌జీ, ఫార్మ‌సిస్ట్ త‌దిత‌ర విభాగాల్లో వీటిని భ‌ర్తీ చేయ‌నున్నారు.


 

 

అర్హత.. జీత‌భ‌త్యాలు

మెడిక‌ల్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌/ఎండీ లేదా డీఎన్‌బీ (న్యూక్లియర్ మెడిసిన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులో డి, ఈ కేట‌గిరిలున్నాయి. ‘డి’ కేట‌గిరికి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి క‌నీసం 4 సంవ‌త్స‌రాల అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు. నెల వేతనం రూ.78800 నుంచి మొదలవుతుంది. ‘ఈ’ కేట‌గిరి అభ్య‌ర్థులకు 40 ఏళ్లకు మించకూడదు. వీరి వేత‌నం నెలకు రూ.67700 పైగా ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్/డి(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్) ద‌ర‌ఖాస్తుదారులు 60% మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించాలి. 50% మార్కులతో డీఎంఆర్ఐటీ/డీఎన్ఐటీ/డీఎఫ్ఐటీ చేసి ఉండాలి. నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. వీరి నెల వేతనం రూ.67700 నుంచి మొద‌ల‌వుతుంది. న‌ర్సులు 10+2 తోపాటు డిప్లొమా ఇన్ నర్సింగ్, మిడ్వైఫరీ (మూడేళ్ల కోర్సు)+ సెంట్రల్/స‌్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో సభ్యత్వం పొంది ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్/నర్సింగ్ ‘ఎ’ ధ్రువ‌ప‌త్రంతో పాటు అసుప‌త్రిలో మూడేళ్ల‌ అనుభవం అవ‌స‌రం. ఓబీసీలకు 33 ఏళ్లు, ఇతరులకు 30 ఏళ్ల వయసు మించకూడదు. నెల జీతం రూ.44900 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. స‌బ్ ఆఫీస‌ర్లు హెచ్ఎస్సీ (10+2)(సైన్స్, కెమిస్ట్రీ)/ నేషనల్ ఫైర్ సర్వీస్ కళాశాల(నాగ్పూర్)లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. ఎస్టీలకు 45, ఓబీసీలకు 43, ఇతరులకు 40 ఏళ్లు మించకూడదు. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, పాథాలజీ, రేడియోగ్ర‌ఫీ విభాగాల్లో సైంటిఫికే అసిస్టెంట్‌గా చేరాల‌నుకునే వారు 60% మార్కుల‌తో బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత విభాగాల్లో అనుభ‌వంతులై ఉండాలి. పోస్టును బ‌ట్టి వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపు ఉంది. వీరి వేత‌నాలు రూ.35,400 పైగా ఉన్నాయి. ఫార్మాసిస్టులు హెచ్ఎస్‌సీతో పాటు ఫార్మ‌సీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, శిక్ష‌ణ పొంది ఉండాలి. సెంట్రల్/స‌్టేట్ ఫార్మ‌సీ కౌన్సిల్లో సభ్యత్వం అవ‌స‌రం. వ‌య‌సు 25 ఏళ్ల‌కు మించ‌కూడుదు. నెల వేత‌నం రూ.29200 నుంచి ఉంటుంది. డ్రైవ‌ర్ /ప‌ంపు ఆప‌రేట‌ర్‌/ ఫైర్‌మెన్‌లు హెచ్ఎస్‌సీ ఉత్తీర్ణ‌త సాధించాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌, అనుభ‌వం ఉండాలి. అలాగే స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంట‌ర్ నుంచి స‌ర్టిఫికెట్ పొంది ఉండాలి. గ‌రిష్ఠ వ‌య‌సు ఓబీసీల‌కు 30, ఇత‌రుల‌కు 27 ఏళ్లుగా నిర్ధారించారు. నెల వేత‌నం రూ.21700 నుంచి మొద‌ల‌వుతుంది.

 

స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు...

ఈ పోస్టుల‌కు ఎంపికయ్యే అభ్య‌ర్థుల‌కు ముంబై/ కోల్‌క‌తాలో రెండేళ్లు శిక్ష‌ణ ఇస్తారు. శిక్ష‌ణ కాలంలో స్టైఫండ్ ఇస్తారు. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థుల‌ను పూర్తిస్థాయి ఉద్యోగులుగా సంస్థ‌లోకి తీసుకుంటారు. పోస్టును బ‌ట్టి నెల జీతం కూడా పెరుగుతుంది. కంప్యూటర్ ఆప‌రేష‌న్, హెల్త్ ఫిజిసిస్ట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, డెంటల్ టెక్నీషియన్-హైజినిస్ట్ విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఆయా విభాగాల్లో 60% మార్కుల‌తో హెచ్ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బ‌ట్టి గ‌రిష్థ వ‌యోప‌రిమితి ఉంది. వీరిలో మొద‌టి ఏడాది కొన్ని విభాగాల వారికి రూ.16000, మ‌రికొంద‌రికి రూ.10500 స్టైఫండ్ ఇస్తారు. రెండో ఏడాది అంద‌రికీ రూ.2000 పెంచుతారు. ‌ 

 

ఎంపిక ఇలా...

* మెడిక‌ల్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌/ఈ, మెడిక‌ల్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌/డి, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌/డి, సైంటిఫిక్ అసిస్టెంట్‌/సి(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్), సైంటిఫిక్ అసిస్టెంట్‌/బి(పాథాలజీ), సైంటిఫిక్ అసిస్టెంట్‌/బి(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్), సైంటిఫిక్ అసిస్టెంట్‌/బి(రేడియోగ్ర‌ఫీ) పోస్టుల‌కు ఇంట‌ర్య్వూ నిర్వ‌హించి ఎంపిక చేస్తారు. అత్య‌ధిక మంది ద‌ర‌ఖాస్తులు చేస్తే.. స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండ‌వ‌చ్చు. 

* స్టైఫండరీ ట్రెయినీలకు రాత ప‌రీక్ష ఉంటుంది. 40 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. ఇందుకు గంట స‌మ‌యం కేటాయించారు. ప్ర‌శ్న‌ల‌న్నీ డిప్లొమా/ బీఎస్సీ నుంచే అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు 3 మార్కులు. త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ చూపిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్య్వూ నిర్వ‌హించి ఎంపిక చేస్తారు. 

* నర్సు/ఎ, ఫార్మాసిస్ట్‌/బి, స్టైఫండరీ ట్రెయినీ కేటగిరీ-2 (ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, డెంటల్ టెక్నీషియన్-హైజినిస్ట్) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌ను మూడు స్జేజిల్లో ఎంపిక చేస్తారు. స్జేజ్‌-1 ప‌్రిలిమిన‌రీ టెస్ట్‌లో 50 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు అడుగుతారు. గంట‌ స‌మ‌యం ఇస్తారు. గ‌ణితం నుంచి 20, సైన్స్ (20), జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌(10) ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు 3 మార్కులు. ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 40 శాతం, రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీ వారికి 30 శాతం క‌టాఫ్ మార్కులుగా నిర్ణ‌యించారు. ఇందులో అర్హ‌త సాధించిన వారిని స్టేజ్-2కి పంపిస్తారు. 

స్టేజ్‌-2లో అడ్వాన్డ్స్ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ 50 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లుంటాయి. ‌రెండు గంట‌ల స‌మ‌యం ఇస్తారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 3 మార్కులుంటాయి. ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 30 శాతం, రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీ వారికి 20 శాతం క‌టాఫ్ మార్కులు రావాలి. ఇందులోనూ ఉత్తీర్ణ‌త సాధిస్తే స్టేజ్‌-3కి అర్హ‌త ల‌భిస్తుంది. స్టేజ్‌-3లో స‌్కిల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఇది గో/నో-గో విధానంలో ఉంటుంది. ఇందులో ప్ర‌తిభ చూపిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి తుది జాబితా రూపొందిస్తారు. 

* సబ్-ఆఫీసర్/బి, డ్రైవ‌ర్/ప‌ంపు ఆప‌రేట‌ర్‌/ ఫైర్‌మెన్‌/ఎ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారిని మూడు స్టేజీల్లో వ‌డ‌పోస్తారు. అభ్య‌ర్థులు 165 సెం.మీ ఎత్తు, బ‌రువు క‌నీసం 50 కిలోలు ఉండాలి. స్టేజ్‌-1లో అభ్య‌ర్థుల‌కు ఫిజిక‌ల్ అసెస్‌మెట్ టెస్ట్‌, పోస్టును బ‌ట్టి డ్రైవింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. స‌్టేజ్-1‌లో అర్హ‌త పొందిన వారికి స్టేజ్‌-2లో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఉంటుంది. ఇందులో 50 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లుంటాయి. గంట స‌మ‌యం ఇస్తారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు మూడు మార్కులుంటాయి. ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. గ‌ణితం నుంచి 20 ప్ర‌శ్న‌లు, సైన్స్ (20), జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (10) ప్ర‌శ్న‌లు అడుగుతారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 40 శాతం, రిజ‌ర్వుడ్ కేట‌గిరీ వారికి 30 శాతం క‌టాఫ్ మార్కులు ఉన్నాయి. ప‌్రిలిమిన‌రీ టెస్ట్‌లో అర్హ‌త సాధిస్తే స్టేజ్‌-3లో అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష ఉంటుంది. ఇందులోనూ 50 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లుంటాయి. రెండు గంట‌ల సమ‌యం కేటాయిస్తారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో మాదిరే ప్ర‌శ్న‌ల‌కు మార్కులుంటాయి. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 30 శాతం, రిజ‌ర్వుడ్‌ కేట‌గిరీ వారికి 20 శాతం మార్కులు రావాలి. ఇక్క‌డ‌ వ‌చ్చిన మార్కుల ఆధారంగానే తుది జాబితా తయారు చేస్తారు.  


దరఖాస్తు విధానం
అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 21, 2021 నుంచి ప్రారంభమై ఫిబ్ర‌వ‌రి 15, 2021న ముగుస్తుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే పోస్టును బ‌ట్టి ప‌రీక్ష రుసుము రూ.100 నుంచి రూ.500 వ‌ర‌కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్యాంగులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. గ్రూపు సి పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే మాజీ ఉద్యోగుల‌కు ప‌రీక్ష రుసుము లేదు.

 

వెబ్‌సైట్‌: recruit.barc.gov.in
 

Posted Date : 22-01-2021 .