• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సక్రమంగా సాగుతుందా... సమయం సరిపోతుందా?

ఇంటర్ పరీక్షల వాయిదాతో అయోమయంలో విద్యార్థులు

ఇప్పటికే  జేఈఈ, నీట్ తేదీల్లో మార్పులు

ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ఆలస్యం

 

 

కరోనా మహమ్మారి సామాన్యుల‌ జీవితాలతోపాటు విద్యారుల భవితతోనూ చెలగాటమాడుతోంది. తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. గతేడాది మార్చి 23 లాక్‌డౌన్ మొదలు.. ఆ విద్యాసంవత్సరంతా సక్రమంగా సాగిందేలేదు. ఈ ఏడాది తొలి నుంచి వైరస్ వ్యాప్తి తగ్గడంతో దేశవ్యాప్తంగా విద్యాలయాలు తెరుచుకున్నాయి. కానీ పట్టుమని రెండు నెలలు గడవక ముందే కరోనా ‘సెకండ్ వేవ్‌’ అంటూ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను సీబీఎస్ఈ, ఐసీఎస్సీ వరుసగా రెండో ఏడాదీ రద్దు చేసి, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేశాయి. ఇప్ప‌టికే దేశంలోని 12కుపైగా రాష్ట్రాలు సైతం బోర్డు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. రానున్న రోజుల్లో ఈ జాబితాలో మ‌రిన్ని రాష్ట్రాలు కూడా చేర‌నున్నాయి. విద్యార్థుల రక్షణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణ‌యమే తీసుకుంది. 

 

ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై ప్రభావం

దేశవ్యాప్తంగా పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేయడంతో ఆ ప్రభావం ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలపై పడనుంది. వీటిలో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలు ఆలస్యం కానున్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రక‌టించింది. ఈసారి మొత్తం నాలుగు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తుండగా రెండు విడతలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్ష వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం మేలో నాలుగో విడత నిర్వహించాల్సి ఉండగా.. అప్పటివరకు పరిస్థితులు చక్కబడతాయా అనే సందిగ్ధం నెలకొంది. ఇక నీట్ కూడా ఆగస్టు 1న నిర్వహించేందుకు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. అందుకు మరో నాలుగు నెలల సమయం ఉన్నా.. దేశంలో అప్ప‌టిలోపు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయా అనే అనుమానాలు నెల‌కొన్నాయి. మ‌రోవైపు నీట్ కూడా వాయిదా వేయాల‌నే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వ్య‌క్త‌మవుతోంది. బోర్డు ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో రెండు ప‌రీక్ష‌ల మ‌ధ్య స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని, వారు స‌న్న‌ద్ధం కావ‌డానికి స‌మ‌యం స‌రిపోద‌ని పేర్కొంటున్నారు. 

 

 

గతేడాదే పునారావృతం అవుతుందా?

కరోనా లాక్‌డౌన్‌కారణంగా గతేడాది విద్యాసంవత్సరం తుడిచిపెట్టుకుపోయింది. షెడ్యూలు ప్రకారం జరగాల్సిన పరీక్షలు కూడా నిర్వహించలేకపోయారు. జేఈఈ(మెయిన్, అడ్వాన్స్ డ్), నీట్  కూడా సెప్టెంబరులో జరిగాయి. ఫలితంగా ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలయ్యింది. ఈ ఏడాది కూడా ఇప్పటికే ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ (అడ్వాన్స్ డ్)-2021 షెడ్యూలు ప్రకారం మేలో జరగాల్సి ఉండగా  జులై 3కి వాయిదా వేశారు. ముందు జేఈఈ(మెయిన్) పూర్తి కావాల్సి ఉంది. అలాగే నీట్ ఆగస్టు 1న జరిపేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ, ఐసీఎస్సీ పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసి జూన్ మొదటి వారంలో పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. పలు రాష్ట్రాలు  ఇంటర్ ద్వితీయ సంవత్సరంపై ఇలాంటి ప్రకటనలే చేశాయి. దీంతో ప్రవేశ పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఫ‌లితంగా ఈ ఏడాది కూడా విద్యాసంవత్సరం ఆలస్యమయ్యే ప్రమాదముందని భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ, ఎసీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో అదే నెల మూడు లేదా నాలుగో వారంలో పన్నెండో తరగతి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. లేదంటే జులైలోనూ నిర్వ‌హించే ఆస్కారం ఉంది. అదే జరిగితే జేఈఈ(అడ్వాన్స్ డ్) పరీక్షలు  వాయిదా ప‌డ‌తాయ‌ని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎందుకంటే బోర్డు పరీక్షలు ప్రవేశ పరీక్షలకు అడ్డంకిగా మారుతాయి. ఆగ‌స్టులో నిర్వ‌హించే నీట్ ‌కు స‌న్న‌ద్ధం కావ‌డానికి స‌మ‌యం ఉండ‌దు. అయితే క‌రోనా ఉద్ధృతి త‌గ్గిన తర్వాత‌ జేఈఈ(అడ్వాన్స్ డ్), నీట్  నిర్వహించినా.. ఫలితాల వెల్లడికి సమయం పడుతుంది. దీంతో ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ఆలస్యం కానున్నాయి.  

Posted Date : 21-04-2021 .