• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మన్నికైన కొలువులకు ప్లాస్టిక్ కోర్సులు

 సిపెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ‌‌ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

దేశంలోని 27 క‌ళాశాలల్లో చేరేందుకు అవ‌కాశం

ప్ర‌జ‌లు విరివిగా విని‌యోగిస్తున్న వ‌స్తువుల్లో ప్లాస్టిక్ మొద‌టి స్థానంలో ఉంది. ఇది చౌకగా, ఎక్కువ కాలం మన్నిక‌గా ఉండ‌ట‌మే అందుకు కార‌ణం. ఈ త‌యారీ రంగం ద్వారా ఎంతో మంది జీవ‌నోపాధి పొందుతున్నారు. కానీ ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ను సక్రమంగా వినియోగించే టెక్నాలజీతో ప్రధానంగా కొన్ని కోర్సులు రూపొందాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాటిలో చేరాలంటే ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.  ఈ మేరకు దేశంలోని 27 సిపెట్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి తాజాగా సిపెట్ అడ్మిష‌న్ టెస్ట్ ‌ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ అర్హ‌త‌తో 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో ఆయా కోర్సుల్లో చేర‌వ‌చ్చు.
  దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న 30 వేల‌కు పైగా ప్లాస్టిక్ కంపెనీల్లో కోట్ల మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. ఈ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన కోర్సుల‌ను సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (సిపెట్‌) అందిస్తోంది. గ‌తంలో దీన్ని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీగా వ్య‌వ‌హ‌రించేవారు. కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఇది ప‌ని చేస్తుంది. తెలంగాణ‌కు సంబంధించి హైద‌రాబాద్‌లో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో సిపెట్ క‌ళాశాల‌లు ఉన్నాయి.

 

అర్హ‌త‌లు

సిపెట్ కళాశాలల్లో అందించే వివిధ కోర్సుల‌ను బ‌ట్టి అర్హ‌త ఉంటుంది. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాల‌జీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాల‌జీ (డీపీటీ), పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్‌/కామ్‌(పీజీ-పీఎండీ విత్ సీఏడీ/సీఏఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ) కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నాయి.

వివిధ కోర్సుల వివరాలు

డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాల‌జీ (డీపీఎంటీ)

ఇందులో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు ప‌దో త‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్‌/ఐటీఐ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ కోర్సు వ్య‌వ‌ధి మూడేళ్లు (6 సెమిస్ట‌ర్లు) ఉంటుంది.

 

* డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ (డీపీటీ)

ప‌దో త‌ర‌గ‌తి/ఇంట‌ర్మీడియ‌ట్‌/ఐటీఐ ఉత్తీర్ణ‌త సాధించిన వారు అర్హులు. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కోర్సు వ్య‌వ‌ధి మూడేళ్లు (6 సెమిస్ట‌ర్లు). 

 

* పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్‌/ క్యామ్‌

మెకానిక‌ల్‌/ప్లాస్టిక్స్‌/పాలిమ‌ర్‌/టూల్‌/ప్రొడ‌క్ష‌న్/ మెక‌ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌/టూల్‌&డై మేకింగ్‌/పెట్రోకెమిక‌ల్స్‌/ఇండ‌స్ట్రియ‌ల్/ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్ స‌బ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న వారూ ద‌ర‌ఖాస్తుకు అర్హులే. ఈ కోర్సు వ్య‌వ‌ధి ఏడాదిన్న‌ర (మూడు సెమిస్టర్లు).


* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)

సైన్స్ స‌బ్జెక్టుల‌తో మూడేళ్ల ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ కోర్సు వ్య‌వ‌ధి రెండేళ్లు (4 సెమిస్ట‌ర్లు) ఉంటుంది.

ఫీజులు

ఆయా కోర్సుల్లో చేరేవారు చెల్లించాల్సిన ఫీజులు సెమిస్ట‌ర్ల వారీగా ఉంటాయి. డీపీఎంటీ, డీపీటీ కోర్సుల్లో చేరే అభ్య‌ర్థులు సెమిస్ట‌ర్‌కు రూ.16,700 చొప్పున ‌చెల్లించాలి. పీజీ-పీఎండీ కాడ్‌/కామ్‌, పీజీడీ-పీపీటీలో చేరాలంటే సెమిస్ట‌ర్‌కు రూ.20,000 ఉంటుంది. అడ్మిష‌న్‌, ప‌రీక్షలు, హాస్ట‌ల్ త‌దిత‌ర ఫీజులు అద‌నంగా ఉంటాయి. 

 

ఎంపిక ఇలా..

కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వ‌హిస్తారు. ఇందులో ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన సిల‌బ‌స్‌తోపాటు జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌శ్న‌ప‌త్రం మొత్తం 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్‌/మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రుణాత్మ‌క మార్కులుండ‌వు. ప‌రీక్ష స‌మ‌యం రెండు గంట‌లు. డీపీటీ, డీపీఎంటీ కోర్సుల వారికి జీకే నుంచి 50, సైన్స్‌, మ్యాథ్స్ 40, ఇంగ్లిష్‌కు సంబంధించి 10 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. పీజీడీ-పీపీటీ కోర్సు ప‌రీక్ష రాసేవారికి జీకే నుంచి 40, సైన్స్‌, మ్యాథ్స్ 20, ఇంగ్లిష్ నుంచి 20, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బ‌యాల‌జీ, మ్యాథ్స్ త‌దిత‌ర స‌బ్జెక్టుల నుంచి 20 ప్ర‌శ్న‌లు అడుగుతారు. పీడీ-పీఎండీ కోర్సుకు సంబంధించి జీకే 40, సైన్స్‌, మ్యాథ్స్ 20, ఇంగ్లిష్ 20, మెకానికల్, ప్రొడక్ష‌న్‌, ఇంస్ట్రుమెంటేష‌న్‌, ప్లాస్టిక్స్‌/పాలిమ‌ర్స్‌, టూల్ రూమ్‌, ఇండ‌స్ట్రియ‌ల్ త‌దిత‌ర స‌బ్జెక్టుల నుంచి 20 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. 

 

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్‌/ఓబీసీ అభ్య‌ర్థులు రూ.500, ఎస్సీ/ఎస్సీ రూ.250, నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్ వారు రూ.100 ఆన్‌లైన్‌‌ద్వారా చెల్లించాలి.  ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి తుది గ‌డువు 2021 జులై మూడో వారం కాగా అదే నెల చివ‌రి వారంలో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

 

ఉద్యోగావ‌కాశాలు

సిపెట్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల్లో ఏటా 85-90 శాతం మందికి ఉద్యోగాలు ల‌భిస్తున్నాయి. కేవ‌లం ప్లాస్టిక్ త‌యారీ సంస్థ‌లే కాకుండా ఆటోమొబైల్స్‌, సాఫ్ట్ వేర్ & ఇంజినీరింగ్‌, రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్, ప్యాకేజింగ్‌త‌దిత‌ర‌రంగాల‌కు చెందిన ఎన్నో కంపెనీలు ప్లేస్‌మెంట్స్ క‌ల్పిస్తున్నాయి. వీటిలో టాటా, హ్యుందాయ్‌, వోల్వో, మ‌హీంద్రా, ఫోర్డ్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, పెప్సికో, నెస్లే, ఐటీసీ, పెడిలైట్‌, హెరిటేజ్‌, అమూల్‌తోపాటు ఇండియ‌న్‌ఆయిల్‌, రిల‌య‌న్స్‌, హెచ్‌పీ, భార‌త్ పెట్రోలియం త‌దిత‌ర సంస్థలు ఉద్యోగాలిస్తున్నాయి. 

 

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

Posted Date : 17-04-2021 .