• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆఫీస్ అటెండెంట్ కొలువులకు ఆర్బీఐ ఆహ్వానం

841 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల 

* తెలుగు రాష్ట్రాల్లో 57 ఖాళీలు

ప‌దోత‌ర‌గ‌తి అర్హ‌త ఉంటే చాలు‌

 

 

దేశ ఆర్థిక విధి విధానాలను నిర్దేశించి, నడిపించే అత్యున్నత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పదో తరగతి అర్హతతో ఆర్‌బీఐలోకి చిన్న ఉద్యోగిగా ప్రవేశించే అవకాశం వచ్చింది. 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. 

 

భారతీయ రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో వివిధ స్థాయిల్లో వేల సంఖ్యలో సిబ్బంది పని చేస్తుంటారు. ప్రస్తతం రీజినల్ కార్యాలయాల్లోని ఆఫీస్ అటెండెంట్ పోస్టల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో 57 ఖాళీలు ఉన్నాయి.

 

అర్హతలు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి (ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఫిబ్రవరి 1, 2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. వయసు ఫిబ్రవరి 1, 2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

 

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్(ఎల్పీటీ) నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ‌పరీక్షలో కనీస మార్కులు సాధించిన వారినే లాంగ్వేజ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది అభ్యర్థుల రాష్ట్రానికి చెందిన భాషలో ఉంటుంది. అభ్యర్థులు ఇందులో త‌ప్ప‌క అర్హత సాధించాలి. అనంతరం ఆన్‌లైన్, లాంగ్వేజ్ పరీక్షలను బట్టి తుది ఎంపికలు ఉంటాయి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థుల కోసం రాష్ట్రాల్లోని ప్రాంతీయ ‌కార్యాలయాల్లో ప్రీ-ఎగ్జామినేషన్ శిక్షణ ఇవ్వనున్నారు. పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఆయా కేటగిరీల అభ్యర్థులు అక్కడి శిక్షణలకు హాజరుకావ‌చ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఈ శిక్షణ ఉంటుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. 

 

పరీక్ష తీరు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. సమయం గంటన్నర. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. రీజనింగ్(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్(30 ప్రశ్నలు), జనరల్ అవేర్ నెస్ (30 ప్రశ్నలు), న్యూమరికల్ ఎబిలిటీ(30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానికి పావు మార్కు కోత విధిస్తారు.

 

మెరవాలంటే...

ఈ పరీక్షను ఆర్‌బీఐ తరఫున ఐబీపీఎస్‌ నిర్వహిస్తోంది. అందువల్ల ప్రశ్నపత్రం ఐబీపీఎస్‌ క్లరికల్‌ ప్రిలిమినరీ స్థాయికి దగ్గరలో ఉండవచ్చు. ఆ స్థాయిలో సన్నద్ధమైనవారు ప్రశ్నలు ఎదుర్కోవడం తేలికవుతుంది. 

అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ- మల్టీ టాస్కింగ్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పాత ప్రశ్నపత్రాలు సాధనచేయడం మంచిది. 

పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జవాబులు సరిచూసుకుని, తప్పులు పునరావృతం కాకుండా సిద్ధపడాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో పరీక్ష పూర్తి చేయడం సాధ్యమవుతుంది. 

రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీల్లో కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. అలాంటివాటిని ఆఖరులో, సమయం ఉంటేనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున అసలేమాత్రం తెలియని, అవగాహన లేని ప్రశ్నలను వదిలేయడమే మంచిది. 

120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. అంటే ఒక్కో ప్రశ్నకు గరిష్ఠంగా 45 సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. రీజనింగ్‌ ప్రశ్నలకు ఈ సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్‌ సెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. ఈ విభాగాల్లో మిగిల్చిన సమయాన్ని రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీలకు ఉపయోగించుకోవాలి.  

 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

 

జీతభత్యాలు 

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మొదట్లో నెల వేతనం రూ.10,940 పొందుతారు. ఇది అలవెన్సులతో కలిపి రూ.26,508 వరకు ఉంటుంది. 

 

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు త‌ప్ప‌నిస‌రిగా మార్చి 15, 2021లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుముగా ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/ జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు రూ.50 చెల్లించాలి.

 

శాఖల వారీగా ఖాళీలు: హైదరాబాద్‌-57, బెంగళూరు-28, భోపాల్‌-25, భువనేశ్వర్‌-24, చండీగఢ్‌-31, చెన్నై-71, తిరువనంతపురం-26, న్యూదిల్లీ-50, ముంబయి-202, అహ్మదాబాద్‌-50, సిమ్లా-47, గువాహటి-38, జమ్మూ-9, కోల్‌కతా-35, నాగ్‌పూర్‌-55, జయపుర-43, కాన్పూర్‌-69, పట్నా-28

 

ప్రిపరేషన్ విధానం

పరీక్షను రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధిస్తేనే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ)కు ఎంపిక చేస్తారు. అంటే తొలి టెస్ట్‌లో కచ్చితంగా అర్హత మార్కులు సాధించాలన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ప్రశ్నపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ఒక్కసారి కష్టం కావచ్చు. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి. ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్ ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు. 

 

రీజనింగ్ 

అనలిటికల్ రీజనింగ్, డైరెక్షన్ అండ్ డిస్టన్స్, లీనియర్ అరెంజ్ మెంట్స్, నంబర్ సిరీస్, మ్యాట్రిక్స్ అరెంజ్ మెంట్స్, బ్లడ్ రిలేషన్ షిస్ టెస్ట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నమూనా ప్రశ్నలను వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి ఇదో మంచిమార్గం. 

 

జనరల్ ఇంగ్లిష్

ఇంగ్లిష్ గ్రామర్ నియమాలు తెలిస్తే సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సెంటెన్స్ అరెంజ్ మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్ల ప్రశ్నలు ఈ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ప్యాసెజ్లలో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసెజీని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రిక చదవాలి. 

 

న్యూమరికల్ ఎబిలిటీ 

ఈ విభాగంలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అరిథ్‌మెటిక్, నంబర్ సిస్టమ్, స్క్వేర్‌రూట్స్, క్యూబ్ రూట్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింప్లిఫికేషన్, వేరియేషన్, రేషియో అండ్ ప్రపొర్షన్, ఆవెరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

 

జనరల్ అవెర్‌నెస్

చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాలతో పాటు భారతదేశం, పొరుగు దేశాలకు సంబంధించిన సమాచారం, సంఘటనలపై ప్రశ్నలుంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, భారతదేశం పాల్గొన్న సమ్మిట్స్, వాటి ముఖ్యాంశాలు, ఆయాదేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు, ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, కరోనా వైరస్, కొత్త ప్రాజెక్టులు, సంబంధిత సమాచారాన్ని సేకరించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం ద్వారా పరీక్షకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.

 

వెబ్‌సైట్‌; https://www.rbi.org.in/

Posted Date : 25-02-2021 .