• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆఫీసర్ కొలువులకు ఆర్బీఐ ఆహ్వానం!

322 గ్రేడ్-బి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

 

 

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ).. మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తూ అభివృద్ధి పథంలో నడపడమే దీని ప్రధాన లక్ష్యం. దీని కోసం ద్రవ్య విధానాలను రూపొందించి, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా అదుపు చేస్తుంది. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వేల మంది రకరకాల విధులు నిర్వహిస్తుంటారు. ఈ అత్యున్నత సంస్థలో ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటుంటారు. వాటిని సాకారం చేసుకునే అవకాశం ఇస్తూ ఏటా పలు రకాల నోటిఫికేషన్లు వెలువడుతుంటాయి. అందులో భాగంగా గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగ భద్రతతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు ఉండటం వల్ల యువత ఈ కొలువులపై ఆస్తకి చూపుతోంది. దీంతో పోటీ పెరిగింది. రాత పరీక్ష సిలబస్‌పై సరైన అవగాహన పెంచుకొని అధ్యయనాన్ని సాగిస్తే ఆర్‌బీఐలో ఆఫీసర్ కావ‌చ్చు.

 

ఎవరు అర్హులు?

ఆర్బీఐ గ్రేడ్-బి(డీఆర్) జనరల్, డీఈపీఆర్, డీఎస్ఐఎం విభాగాలకు సంబంధించి పరీక్ష రాయాలనుకునే అభ్యర్థుల వ‌య‌సు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. జ‌న‌వ‌రి 2, 1991 కి ముందు, జ‌న‌వ‌రి 1, 2000 త‌ర్వాత జ‌న్మించి ఉండ‌కూడ‌దు. ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులకు వయసు పరిమితిని 32, 34 ఏళ్లుగా నిర్ధారించారు. రిజర్వ్ కేటగిరీలకు చెందిన వారికి గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. గ్రేడ్-బి జనరల్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 60% మార్కులతో డిగ్రీ లేదా 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి.  

డీఈపీఆర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్/ క‌్వాంటిటేటివ్ ఎకనామిక్స్/ మ‌్యాథమెటికల్ ఎకనామిక్స్/ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కోర్సు/ ఫైనాన్స్/ అగ్రిక‌ల్చ‌ర్/ బిజినెస్‌/ డెవ‌ల‌ప్‌మెంట‌ల్‌/ అప‌్లైడ్‌) ఉత్తీర్ణత సాధించాలి. లేదా పీజీడీఏ/ ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి. 

డీఎస్ఐఎం పోస్టుల అభ్యర్థులు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్/ మ‌్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ మ‌్యాథమెటికల్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్/ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్) లేదా పీజీ డిప్లొమా (స్టాటిస్టిక్స్‌/ బిజినెస్ అనాలిటిక్స్‌‌) చేసి ఉండాలి.  

ఆయా పోస్టులకు ఇప్పటికే ఆరుసార్లు ప్రయత్నించిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్య్లూడీ అభ్యర్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. 

 

జీతభత్యాలు..

ఆర్‌బీఐ గ్రేడ్-బి ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. ఉద్యోగంలో చేరిన సమయంలో నెలకు రూ.35150 జీతంతో పాటు అల‌వెన్సులు  ఇస్తారు. 

 

ఎంపిక తీరు

పోస్టుల‌ను అనుస‌రించి ఎంపికలు వేర్వేరుగా చేపడతారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. జ‌న‌ర‌ల్ పోస్టుల ఎంపికకు ఫేజ్‌‌-1, 2 ప‌రీక్ష‌లు ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు. ఫేజ్‌-1 ప‌రీక్ష ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తి‌లో 200 మార్కుల‌కు ఉంటుంది. రెండు గంటల సమయం ఇస్తారు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఇందులో ఉత్తీర్ణులైతే ఫేజ్‌-2కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇందులో మూడు పేప‌ర్లుంటాయి. పేప‌ర్‌-1లో ఎక‌నామిక్స్‌, సోష‌ల్ ఇష్యూస్ మీద ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్ర‌శ్న‌ల‌డుగుతారు. మొత్తం 100 మార్కుల‌కు రెండు గంట‌ల స‌మ‌యం ఇస్తారు. పేప‌ర్‌-2లో ఇంగ్లిష్(రైటింగ్ స్కిల్స్‌)కు సంబంధించి డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్ర‌శ్న‌లుంటాయి. 100 మార్కుల‌కు 1.30 గంట‌ల స‌మ‌యం ఉంటుంది. పేప‌ర్‌-3లో ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌ నుంచి ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్ర‌శ్నలు ఇస్తారు. రెండు గంట‌ల స‌మ‌యంలో 100 మార్కుల‌కు ప‌రీక్ష రాయాలి. ఈ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ చూపిన వారిని షార్ట్ లిస్ట్ ద్వారా ఇంట‌ర్య్వూల‌కు ఎంపిక చేస్తారు. అందులో 75 మార్కులుంటాయి. డీఈపీఆర్‌, డీఎస్ఐఎం అభ్య‌ర్థులనూ మూడు ద‌శ‌ల్లో ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు పేప‌ర్‌-1లో 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. డీఈపీఆర్ పోస్టుల‌కు ఎక‌‌నామిక్స్ నుంచి, డీఎస్ఐఎం పోస్టుల‌కు స్టాట‌స్టిక్స్ నుంచి ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు అడుగుతారు. రెండు గంట‌ల సమ‌యం ఇస్తారు.

పేప‌ర్‌-2లో డిస్క్రిప్టివ్‌ విధానంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. మూడు గంట‌ల‌ స‌మ‌యంలో 100 మార్కుల‌కు ప‌రీక్ష రాయాలి. పేప‌ర్‌-3లో 100 మార్కుల‌కు ఇంగ్లిష్‌(డిస్క్రిప్టివ్‌) ప‌రీక్ష‌ను నిర్వహిస్తారు. 1.30 గంట‌ల‌ స‌మ‌యం కేటాయించారు. అనంత‌రం షార్ట్‌లిస్ట్ ద్వారా ఇంట‌ర్య్వూల‌కు ఎంపిక చేస్తారు. అందులో 75 మార్కులుంటాయి. 

 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు..

మూడు పోస్టుల్లోని ఫేజ్‌-1 ప‌రీక్షను ఏపీలో.. గుంటూరు, కాకినాడ, తిరుప‌తి, చీరాల‌, క‌ర్నూలు, నెల్లూరు, విజ‌వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం. తెలంగాణ‌లో.. హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఫేజ్-2 ప‌రీక్ష మొత్తం తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి హైద‌రాబాద్‌లో ఉంటుంది.  ‌

 

 

దరఖాస్తు విధానం

ఆసక్తి క‌లిగిన అభ్య‌ర్థులు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 28, 2021న ప్రారంభ‌మై ఫిబ్ర‌వ‌రి 15, 2021న ముగుస్తుంది.  ద‌ర‌ఖాస్తు రుసుముగా జనరల్/ ఓబీసీ/ ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్య్లూడీ వారు రూ.100 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఆర్‌బీఐ ఉద్యోగులైతే మినహాయింపు ఉంది. జ‌న‌ర‌ల్, డీఈపీఆర్‌, డీఎస్ఐఎం ఫేజ్-1 ప‌రీక్షలు మార్చి 6, 2021న నిర్వ‌హిస్తారు. ఇందులో ఎంపికైన జ‌న‌ర‌ల్ పోస్టు అభ్య‌ర్థుల‌కు ఏప్రిల్ 1, 2021న ఫేజ్‌-2 ప‌రీక్ష ఉంటుంది. డీఈపీఆర్‌, డీఎస్ఐఎం పోస్టుల వారు మార్చి 31, 2021న ఫేజ్‌-2 ప‌రీక్ష‌కు హాజ‌రు కావాలి.   

 

ప్రిపరేషన్ ఇలా..

జ‌న‌ర‌ల్ పోస్టుల అభ్య‌ర్థులు ఫేజ్‌-1లో అడిగే జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్‌తోపాటు ఫేజ్-2లో అడిగే స‌బ్జెక్టుల‌పై దృష్టి సారించాలి. పేప‌ర్‌-1లో ఎకానమిక్స్ అండ్ సోష‌ల్ ఇష్యూస్ నుంచి గ్రోత్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఇండియ‌న్ ఎకాన‌మీ, గ్లోబ‌లైజేష‌న్‌, సోష‌ల్ స్ర్ట‌క్చ‌ర్ ఇన్ ఇండియా అనే అంశాల‌పై ప్ర‌శ్న‌ల‌డుగుతారు. వీటికి సం‌బంధించి ఇండియ‌న్ ఎకాన‌మీ పుస్తకాలు చ‌ద‌వాలి. వార్తాప‌త్రిక‌లను ఎప్ప‌టిక‌ప్పుడు అనుస‌రిస్తుండాలి. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉండే వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఔట్‌లుక్ మెటీరియ‌ల్‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి. పేప‌ర్‌-2 ఇంగ్లిష్‌లో రైటింగ్ స్కిల్స్ చూస్తారు కాబ‌ట్టి విషయ ప‌రిజ్ఞానం, వ్యక్తీకరణ, నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. పేప‌ర్‌-3లో ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కు సంబంధించి ఫైనాన్షియ‌ల్ సిస్టం, మార్కెట్లు, జ‌న‌ర‌ల్ అంశాల‌‌పై ప‌ట్టు సాధించాలి. డీఈపీఆర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులకు ఎక‌నామిక్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ త‌ర‌హాలోనే ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. డీఎస్ఐఎం అభ్య‌ర్థులకు పేప‌ర్‌-1లో డెఫినేష‌న్ ఆఫ్ ప్రాబ‌బులిటీ, స్టాండ‌ర్డ్ డిస్ట్రిబ్యూష‌న్ లార్జ్, స్మాల్ సింపుల్ థియ‌రీ త‌దిత‌ర అంశాల నుంచి ప్ర‌శ్న‌లొస్తాయి. పేప‌ర్‌-2లో ప్రాబ‌బులిటీ అండ్ సాంప్లింగ్‌, లీనియ‌ర్ మోడ‌ల్స్ అండ్ ఎక‌నామిక్ స్టాట‌స్టిక్స్ త‌దిత‌ర అంశాలుంటాయి. పేప‌ర్‌-3లో ఇంగ్లిష్‌పై ప‌ట్టు అవ‌స‌రం. ఈ మూడు ప‌రీక్ష‌ల్లోనూ ఇంగ్లిష్ స‌బ్జెక్టుకు సంబంధించి ఒక పేప‌ర్ కేటాయించారు.

 

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in

Posted Date : 28-01-2021 .