• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యారంగంలో ట్రెండింగ్ టెక్నాలజీలు

బోధన, అభ్యసన విధానాల్లో వినూత్న మార్పులు

 

 

మారుతున్న జీవ‌న విధానాల‌కు అనుగుణంగా చాలామంది త‌మ విద్యానైపుణ్యాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు ఉన్నత విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి విద్యా బోధ‌న ప‌ద్ధ‌తుల‌ను సైతం మార్చేసింది. భౌతిక‌దూరం కారణంగా విద్యార్థులు డిజిటల్ వేదిక‌ల‌ ద్వారా విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. ప్ర‌స్తుతం కొవిడ్ నిబంధ‌న‌లను స‌డ‌లిస్తూ పాఠశాలలు తిరిగి తెరుస్తున్న‌ప్ప‌టికీ, ఈ ధోరణి 2021 చివ‌రి వ‌ర‌కు కొనసాగవచ్చు. మారుతున్న టెక్నాల‌జీల‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన విధానాలను, విద్యార్థులు తమ ప్రిపరేషన్ తీరును మార్చుకుంటే మరింత మంచి ఫలితాలను సాధించవచ్చు.

 

టెక్నాల‌జీకి పెరుగుతున్న ప్రాధాన్యం..!

సంప్రదాయ బోధనను డిజిటల్ రూపంలోకి మార్చి, అభ్యర్థుల అవసరాలు, అనుకూలతల ప్రకారం వినియోగించుకోడాన్ని ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీ అంటారు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా నాణ్యమైన విద్యను పెద్దసంఖ్యలో విద్యార్థులకు ఏకకాలంలో అందించవచ్చు. సాంకేతికత సాయంతో నిపుణుల సేవలు మరింత విస్తరిస్తున్నాయి. మంచి బోధనతో ఉన్న‌త‌ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ప్ర‌స్తుతం యానిమేషన్, లైవ్ వీడియో మొదలైన విభిన్న బోధ‌న ప‌ద్ధ‌తుల‌ను అనుసరిస్తున్నారు. ఇందుకోసం మల్టీమీడియాను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి వీలైనంత వేగంగా నేర్చుకోడానికి సాయపడే కొత్త పద్ధతులతో కోర్సులను ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిస్తున్నారు.  

 

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో...

 

 

విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరికి తెలిసిన విషయాలు వాళ్లు పరస్పరం పంచుకుంటూ నిరంతరం అధ్యయనం సాగించడానికి టెక్నాలజీ దోహదపడుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక గంట సమయంలో ఒక తరగతిలో పరిమితమైన బోధన సాగిస్తాడు. విద్యార్థులూ ఆ కొంత సమయం మాత్రమే ఉపాధ్యాయుడితో సంభాషించగలుగుతారు. కానీ ఇప్పుడొస్తున్న సాంకేతికత వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక గ్రూప్ గా ఏర్పడవచ్చు. పలు అంశాలపై విస్తృతంగా చర్చలు చేయవచ్చు. తాము నేర్చుకున్నవి, తెలుసుకున్నవీ పంచుకుంటూ పరస్పరం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ప్రయోగాత్మక విషయాలను వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా ప్రత్యక్షంగా చేస్తున్న అనుభవాన్ని పొందవచ్చు. ఇలాంటి సాంకేతికతను వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించవచ్చు. దీని కోసం పెద్ద ఎత్తున ఐటీ నైపుణ్యాలూ అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానం, కొంత ప్రాక్టీస్ సరిపోతుంది. 

 

వృద్ధి చెందుతున్న ఈ-లెర్నింగ్

కొవిడ్‌-19 కార‌ణంగా ఆన్‌లైన్ విద్య‌కు డిమాండ్ పెరుగుతోంది. అందులో ప్రధానమైనది ఎలక్ట్రానిక్ లెర్నింగ్‌(ఈ-లెర్నింగ్‌). ఇందులో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అన్ని రకాల సబ్జెక్టులను నేర్చుకోవచ్చు. ఇంటరాక్టివ్ లెర్నింగ్ దీని ప్రత్యేకత. విద్యార్థులు ఎక్కడ ఉన్నా  సులభంగా, వేగంగా నేర్చుకోవచ్చు. ఈ-లెర్నింగ్ కోర్సుల్లో యానిమేషన్, పాడ్‌కాస్ట్‌(విన‌డం), ప్రాక్టికల్ లెర్నింగ్ అనుభవాన్ని సృష్టించే వీడియోలు ఉంటాయి. ఈ టెక్నాల‌జీ చాలా కాలం నుంచీ ఉన్నప్పటికీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఎక్కువ ఆన్‌లైన్ బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సులు వ‌స్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు జూమ్ ద్వారా విద్యార్థులకు రియ‌ల్‌టైమ్‌(సింక్రనస్ ప‌ద్ధ‌తి)లో పాఠాలు నేర్పవచ్చు. డిజిటల్ ఫంక్షన్లతో రికార్డ్ చేసిన (అసింక్రన‌స్ ప‌ద్ధ‌తి) విష‌యాల‌నూ తెలియజేయవచ్చు.

 

 

ప్రస్తుతం బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)  ట్రెండింగ్ ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీలుగా ఎదుగుతున్నాయి.  2020లో అత్య‌ధిక ఆద‌ర‌ణ పొంది 2021లోనూ కొన‌సాగుతున్న ఆ టెక్నాలజీల గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ బోధన, అధ్యయన విధానాలను మరింత మెరుగుపరచుకొని, మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

 

వీడియో ఆధారిత అధ్యయనం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు కంప్యూటర్ల ద్వారా వీడియో ఆధారిత లెర్నింగ్ ఎక్కువవుతోంది. అందులోనూ యానిమేటెడ్ వీడియోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాఠాల మౌలికాంశాలను సులభంగా అర్థం చేసుకోడానికి వీలుగా వాటిని రూపొందిస్తున్నారు. వీటి వల్ల విద్యార్థులకు ప్రయోజనాలు చేకూరడంతోపాటు ఉపాధ్యాయులపై పనిభారం తగ్గుతోంది. 

 

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ

విద్యార్థులకు సంబంధించిన సమాచారంతోపాటు ఆన్‌లైన్‌లో వీడియోలు, కంటెంట్‌ అప్‌లోడింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ డేటా స్టోరేజీ ఇబ్బందిగా మారుతుంది.  దీన్ని సమర్థంగా అధిగమించడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సమాచారాన్ని అప్ లోడ్ చేసిన ప్రతిసారీ ఒక కొత్త బ్లాక్ ఏర్పడుతుంది. దీంతో అపరిమితమైన స్టోరేజీ తయారవుతుంది. కానీ ఇది ఒకేచోట కాకుండా వివిధ కంప్యూటర్లలో నిక్షిప్తమవుతుంది. డేటాలు మార్పులు చేసినప్పుడల్లా ఇంకో బ్లాక్ ఏర్పడుతుంది. దీంతో కంటెంట్ వికేంద్రీకృతమవుతుంది. పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేర్చుకోడానికి సాయపడుతుంది. 

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)

ఈ ఏడాది విద్యారంగం సహా అన్నింటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉప‌యోగించ‌డం 45% కంటే ఎక్కువవుతుందని అంచ‌నా. ఎడ్యుకేష‌న్ లో ఏఐ టెక్నాల‌జీని వినియోగించి గ్రేడింగ్ సహా రకరకాల సమాచారాన్ని వేగంగా సేకరించవచ్చు. దాని ఆధారంగా వారి లెర్నింగ్ సామర్థ్యాన్ని తేలిగ్గా అంచనా వేయవచ్చు. వేల సంఖ్యలో ఉండే విద్యార్థుల ప్రొఫైళ్లను పరిశీలించేందుకు, అవసరమైన మార్పులు చేసేందుకు ఏఐ టూల్స్ ఉపయోడగపడతాయి. విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే పరిష్కరించేందుకు, అప్రమత్తం చేసేందుకు సాయపడతాయి. 

 

లెర్నింగ్‌ అనలిటిక్స్

లెర్నింగ్ అనలిటిక్స్ ను ముఖ్యంగా ఉన్నత విద్యలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచ‌నా వేస్తారు. సంబంధిత నివేదికలను రూపొందిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు విద్యార్థులు ఏ రకమైన సమాచారాన్ని (టెక్ట్స్‌, ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు) ఎక్కువగా ఇష్ట‌ప‌డుతున్నారో తెలుసుకుంటారు. పాఠాలు బోధించడానికి తగిన విధంగా ప్లాట్‌ఫామ్‌ల‌ను వినియోగిస్తారు.

 

గేమిఫికేషన్

సంప్రదాయ రీతుల్లో అధ్యయనం కొన్నిసార్లు విసుగు కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఆసక్తిని దూరం చేస్తుంది. అలాంటప్పుడు ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటే ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందుకోసం ఉపయోగపడే టెక్నాలజీ గేమిఫికేషన్. ఇందులో పాఠాలను, ఇతర సమాచారాన్ని ఆట‌ల రూపంలో నేర్పిస్తారు. రకరకాల ఆటలు ఆడుకుంటూ చదువుకోవచ్చు. దీంతో లెర్నింగ్ సామర్థ్యం విద్యార్థుల్లో పెరుగుతుంది. 

 

వ‌ర్చువ‌ల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ

 

 

ఏ విషయాన్నయినా చదవడం కంటే కూడా  అనుభవం ద్వారా ప్రభావపూరితంగా నేర్చుకోవచ్చు. అన్ని అంశాలను అనుభవపూర్వకంగా అభ్యసించడం సాధ్యం కాదు. అది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఇబ్బందులను వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలు తొలగిస్తాయి. ఈ టెక్నాలజీలను ఉపయోగించి ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయకుండానే, అంతటి అనుభవాన్ని, నాలెడ్జ్ ను పొందవచ్చు. ప్రయోగశాలల్లోని సంక్లిష్ట అంశాలనూ సరళంగా ఈ సాంకేతికత సాయంతో బోధించవచ్చు. వైద్య‌విద్యలో వీఆర్‌ను ఉప‌యోగించి రియ‌ల్ టైమ్ స‌ర్జ‌రీలు చేయిస్తున్నారు.

 

సోషల్ మీడియా లెర్నింగ్‌

విద్యార్థుల ప్రిపరేషన్ లో ఇప్పుడు సోషల్ మీడియా ఒక పెద్ద భాగంగా మారిపోయింది. విద్యా సంస్థలూ కమ్యూనికేషన్ కోసం ఈ మాధ్యమాన్ని వినియోగిస్తున్నాయి. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి రకరకాల విషయాలు, సబ్జెక్టు అంశాలపై మాట్లాడుకోవచ్చు. స్పందించవచ్చు. చర్చించుకోవచ్చు. పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.

 

ఇలా ఎన్నో రకాల టెక్నాలజీలు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో లెర్నింగ్ సామర్థ్యాలను వృద్ధి చేసుకోడానికి, సౌకర్యవంతం చేసుకోడానికి సాయపడుతున్నాయి. అవసరాలకు అనుకూలమైన వాటిని తెలుసుకొని అధ్యయనం సాగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Posted Date : 12-02-2021 .