• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫ్రెషర్లు అవకాశాలు అందుకోవాలంటే?

సంస్థ‌ల ‌వ్యూహాలకు అనుగుణంగా సన్నద్ధం కావాలి

 

 

డిగ్రీ పూర్తి చేసిన యువత సహజంగా ఉద్యోగం వేటలో పడుతుంటారు. ఆ సందర్భంలో రకరకాలుగా పోటీలు ఎదురవుతుంటాయి. ఏదైనా ఇంటర్వ్యూకి వెళితే అప్పటికే ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవాళ్లు ఎదురవుతారు. వాళ్లని దాటుకొని అవకాశాలను అందుకోవడం క్లిష్టంగా మారుతుంది. ఫ్రెష‌ర్ల‌కు ప‌ని అనుభవం, నైపుణ్యం లేకపోవడంతో కొన్ని సంస్థ‌లు ఉద్యోగాల్లో నియ‌మించుకోవ‌డానికి ఆస‌క్తిని ప్రదర్శించవు. కానీ, క‌రోనా కారణంగా ఈ ధోర‌ణిలో కొంత మార్పు వచ్చింది. ఎంట్రీస్థాయి ఉద్యోగాల కల్పన ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాయి. ఫ్రెష‌ర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. అందుకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫ్రెషర్లు కూడా కొన్ని అంశాలపై అవగాహన పెంచుకుంటే అవకాశాలను అందుకోవచ్చు. 

 

వినూత్న, సృజనాత్మక ఆలోచ‌నా దృక్పథం

సంస్థలు సాధారణంగా కొత్త కొత్త ఆలోచనలు చేసే వారిని, ఎంత కష్టమైనా పని చేయడానికి సిద్ధపడే వారిని నియమించుకోడానికి ప్రాధాన్యం ఇస్తాయి. ఆ అంశాలనే ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తాయి. అందుకే అభ్యర్థులు తాము ప్రయత్నించే ఉద్యోగానికి సంబంధించిన సంస్థ గురించి తెలుసుకోవడంతోపాటు ఇంకా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచించాలి. ముఖాముఖిలో ప్రశ్నలు ఎదురైనప్పుడు సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఫ్రెషర్లు సాధారణంగా అప్పుడే క‌ళాశాల విద్య పూర్తి చేసుకుని కెరియర్‌లోకి ప్రవేశించే ఉత్సాహంలో ఉంటారు. అన్ని విషయాల పట్ల ఆసక్తి క‌న‌బ‌రుస్తుంటారు.  ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. వీటి వల్ల ఉన్న బృందానికి ఫ్రెషర్లు కొత్త శక్తి వస్తుందనే ఆలోచనతోనే సంస్థలు ఫ్రెషర్ల నియామకాలకు ప్రాధాన్యాన్నిస్తున్నాయి. అలాంటి లక్షణాలు తమకు ఉన్నాయని అభ్యర్థులు నిరూపించుకోవాలి. అందుకోసం ముందుగా వినూత్న, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేయాలి.

 

సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌ల నుంచే ఎన్నో స్టార్ట‌ప్‌లు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియా, మార్కెటింగ్, డిజైనింగ్ వంటి క్రియేటివ్ రంగాల్లో ఫ్రెష‌ర్ల‌కు అపార అవ‌కాశాలు ఉన్నాయి. ఫ్రెషర్లు బహుళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తగిన సమయాన్ని వెచ్చించి నైపుణ్యాలను సంపాదించుకోవాలి. వేర్వేరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, అప్లికేష‌న్ల‌పై ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. 

 

నాయకత్వ లక్షణాలు

ఒక్కోసారి కొన్ని సంస్థల్లో కొన్ని రకాల హోదాల భర్తీకి తగిన అభ్యర్థులు దొరకరు. అవి సాధారణంగా నాయకత్వానికి సంబంధించి ఉంటాయి. అలాంటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నియామకాలు చేపడుతుంటాయి. ఎంట్రీ స్థాయిలోనే ఆ అంశాలను పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. దీర్ఘకాలంలో సంస్థ అవసరాల మేరకు నాయకత్వం వహించి సమర్థంగా రాణించగలరనే నమ్మకాన్ని కలిగించాలి. జట్టు సభ్యులను నడిపించే దృక్పథం తమకు ఉందని తెలియజేయాలి. అప్పగించిన పని వరకే పూర్తి చేసి సరిపెడతారనే విధంగా సంస్థకు కనిపిస్తే అవకాశాలు అందుకోవడం కష్టం కావచ్చు.

 

సాంకేతిక పరిజ్ఞానం

నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక ముఖ్యమైన నైపుణ్యంగా మారింది. కొత్త వారి నుంచి సంస్థలు ఆ స్కిల్స్‌ను ఆశిస్తున్నాయి. సమకాలీన టెక్నాలజీలకు సంబంధించిన పరిజ్ఞానం వృద్ధి చేసుకోవడంతోపాటు వీలైతే కోర్సులు చేసి ఉండటం మంచిది. దాదాపు అన్నీ వర్చువల్ విధానాల్లో సాగిపోతున్న తరుణంలో అందుకు తగిన విధంగా ఫ్రెషర్లు సిద్ధం కావడం చాలా అవసరం. 

 

ఇంట‌ర్న్‌షిప్‌లతో అనుభ‌వం

ఎంట్రీ లెవల్ ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా ఎంతోకొంత‌‌ పని అనుభవం ఉంటే బాగుంటుందని సంస్థలు భావిస్తున్నాయి. ఉద్యోగంలోకి తీసుకొని శిక్షణ ఇచ్చే విధానాలకు దాదాపు స్వస్తి చెబుతున్నాయి. మరి ఫ్రెషర్లకు పని అనుభవం ఎలా వస్తుంది? ఇందుకు చక్కటి మార్గం ఇంటర్న్‌షిప్. ఇది చేస్తే రియల్ టైమ్ వర్క్ అనుభవం వస్తుంది. నియామకాల్లో ఇంటర్న్ షిప్ చేసిన వారికి ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా గ్రాడ్యుయేట్లు ఈ విషయాన్ని గుర్తించాలి. డిగ్రీ చేస్తున్నప్పుడు లేదా పూర్తి కాగానే ఇంటర్న్‌షిప్‌లు చేయడం మంచిది.

 

ఈ అంశాలను గుర్తించి ఫ్రెషర్లు తగిన నైపుణ్యాలను పెంపొందించుకొని సంస్థల తాజా నియామక వ్యూహాలకు తగిన విధంగా సిద్ధమైతే ఆశించిన ఉద్యోగాలను తేలిగ్గా అందుకోవచ్చు. 

Posted Date : 25-02-2021 .