• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్ట్ అవుతారా..?

నెట్‌, ఏఆర్ఎస్‌, ఎస్‌టీఓ అర్హ‌త ప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

222 ఖాళీల భర్తీకి సన్నాహాలు

జూన్ 21 నుంచి 27 తేదీల్లో ప‌రీక్ష‌

 

 

‌‌మ‌న‌ది వ్య‌వ‌సాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం, దాని సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల‌పైనే ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా నేటికీ మూస ప‌ద్ధ‌తిలోనే పంటల సాగు చేప‌డుతుండ‌టంతో ఆశించినంత‌గా దిగుబ‌డి సాధించ‌లేక న‌ష్ట‌పోతున్నారు. వీరి శ్ర‌మ‌కు స‌రైన స‌ల‌హాలు, సూచ‌న‌లు, మెల‌కువ‌లు జోడిస్తేనే అభివృద్ధి ప‌థంలో దూసుకెళతారు. అందుకే ఆ దిశగా కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్ఆర్‌బీ) కృషి చేస్తోంది. రైతుల స‌మ‌స్య‌ల‌న్నింటికీ పరిష్కారం చూపించేందుకు పాటుపడుతోంది. ఇందులో భాగంగానే 2021 సంవ‌త్స‌రానికి ప్ర‌తిభావంతులైన బోధ‌నా సిబ్బంది, శాస్త్ర‌వేత్త‌ల‌ను గుర్తించేందుకు నెట్‌, ఏఆర్ఎస్(ప్రిలిమిన‌రీ), ఎస్‌టీఓల ‌సంయుక్త నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖలోని అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ విభాగం కింద ప‌ని చేస్తోంది.

 

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స‌ర్వీసెస్-ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌(ఏఆర్ఎస్‌), సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (ఎస్‌టీఓ) అర్హ‌త పరీక్ష‌లు నిర్వ‌హించి అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలు, సంబంధిత ప‌రిశోధ‌న సంస్థ‌ల్లో వివిధ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రాష్ట్రాల‌కు చెందిన లేదా ఇత‌ర అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీల్లో లెక్చ‌ర‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల నియామ‌కాల‌కు నెట్‌ను నిర్వ‌హిస్తారు. ఇది కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ). దీనికి సెప్టెంబ‌రు 19, 2021 నాటికి సంబంధిత విభాగాలు, స్పెష‌లైజేష‌న్ల‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. జ‌న‌వ‌రి 01, 2021 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. గ‌రిష్ఠ వ‌య‌సు ప‌రిమితి లేదు. అప‌రిమిత సంఖ్య‌లో ప‌రీక్ష రాసుకునే అవ‌కాశం ఉంది. ఈ ప‌రీక్ష‌లో ఒకటే పేపర్ 150 మార్కుల‌కు ఉంటుంది. 150 మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. ప్రతి ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి  1/3 కోత విధిస్తారు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ప్ర‌చురిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు కేటాయించారు. అర్హ‌త‌గా అన్‌రిజ‌ర్వుడ్‌/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు 50%, ఓబీసీలు 45%, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ కేట‌గిరీలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 

అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స‌ర్వీసెస్-ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌(ఏఆర్ఎస్‌)

ఈ ఏఆర్ఎస్ ప‌రీక్ష ద్వారా 222 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, వైవా వాయిస్ ఉంటాయి. ఈ మూడు ద‌శ‌ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వారికి ఐకార్‌లో సైంటిస్ట్‌లుగా చేరేందుకు అవ‌కాశం ద‌క్కుతుంది. ఇందుకు సంబంధిత విభాగంలోని స్పెష‌లైజేష‌న్‌తో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త సాధించాలి‌. జ‌న‌వ‌రి 01, 2021 నాటికి వ‌య‌సు 21-32 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు ఆరుసార్లు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీల వారు తొమ్మిదిసార్లు మాత్ర‌మే ఈ ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం ఉంది. ప్రిలిమ్స్.. కంప్యూట‌ర్ బేస్ట్, అబ్జెక్టివ్ త‌ర‌హా ప‌రీక్ష‌. దీన్ని 150 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం రెండు గంట‌లు. అర్హ‌త‌గా అన్‌రిజ‌ర్వుడ్‌/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు 45%, ఓబీసీలు 40%, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ కేట‌గిరీలు 35% ‌మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీనిలో అర్హ‌త సాధించిన వారికి 240 మార్కుల‌కు మెయిన్స్ ప‌రీక్ష ఉంటుంది. ఇందులో ఎ, బి, సి సెక్ష‌న్లు ఉంటాయి. పార్ట్ ఎలో 40 రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ఇస్తారు. పార్ట్ బిలో 20 అయిదు మార్కుల ప్ర‌శ్న‌లు ఉంటాయి. పార్ట్ సిలో ఆరు ఎస్సే ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు రాయాలి. ఒక్కో ప్ర‌శ్న‌కు ప‌ది మార్కులు. ప‌రీక్ష కాల‌వ్య‌వ‌ధి మూడు గంట‌లు. ఇందులోనూ ఉత్తీర్ణ‌త సాధిస్తే వైవా వాయిస్‌కు ఎంపిక చేస్తారు. ఇది 60 మార్కుల‌కు ఉంటుంది.

 

సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (ఎస్‌టీఓ)

ఎస్‌టీఓ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధిస్తే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐకార్ హెడ్‌క్వార్ట‌ర్స్‌, ఇత‌ర ప‌రిశోధ‌నా సంస్థ‌ల్లో సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల్ని భ‌ర్తీ చేస్తారు. ఇందులో మొత్తం 65 ఖాళీలు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌రు 19, 2021 నాటికి సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త సాధించాలి‌. ఏప్రిల్ 25, 2021 నాటికి 21-35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ప‌రీక్ష‌ను 150 మార్కుల‌కు మ‌ల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంట‌లు ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో క‌నీస అర్హ‌త మార్కులు అన్‌రిజ‌ర్వుడ్‌/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు 50%, ఓబీసీలు 45%, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ కేట‌గిరీలు 40% సాధించాల్సి ఉంటుంది. అర్హులైన వారికి అనంత‌రం 30 మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

 

 

ప‌రీక్షా కేంద్రాలు;  తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌.

 

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తి ఉండి అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందుకు చివ‌రి గడువు ఏప్రిల్ 25, 2021 వ‌ర‌కు ఉంది. ఏఆర్ఎస్, ఎస్టీఓ ప‌రీక్షల ‌రుసుముగా జ‌న‌ర‌ల్/ఈడ‌బ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500 చొప్పున ‌చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ/మ‌హిళ‌లు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. నెట్ ద‌ర‌ఖాస్తుదారుల్లో జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.1000, ఈడ‌బ్ల్యూఎస్‌/ఓబీసీ కేట‌గిరీ వారు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ/మ‌హిళ‌లు రూ.250 చెల్లించాలి. ‌‌నెట్‌, ఏఆర్ఎస్ ప్రిలిమిన‌రీ, ఎస్‌టీఓ మూడు ప‌రీక్ష‌లు జూన్ 21 నుంచి 27 తేదీల్లో జ‌రుగనున్నాయి. ఏఆర్ఎస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారికి సెప్టెంబ‌రు 19, 2021న మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

 

అధికారిక వెబ్‌సైట్‌: http://www.asrb.org.in/

 

నోటిఫికేష‌న్ పీడీఎఫ్‌ కోసం క్లిక్ చేయండి

Posted Date : 12-04-2021 .