• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జేఈఈకి వందశాతం.. ఎంసెట్‌కు 70శాతం

పాఠ్యాంశాలతో ఇంటర్‌ విద్యార్థుల సన్నద్ధత

‣ జులై రెండో వారంలో ఎంసెట్‌ నిర్వహణకు కసరత్తు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ విద్యార్థులు ఈసారి జేఈఈ మెయిన్‌కు వందశాతం, ఎంసెట్‌కు 70 శాతం పాఠ్యాంశాలు చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా తరగతులు ప్రారంభమయ్యేందుకు ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఇంటర్‌ పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించారు. దీన్నే ప్రయోగ పరీక్షల్లోనూ అమలు చేస్తున్నారు. ఇంటర్‌ పాఠాలను తగ్గించిన మేరకు ఎంసెట్‌లోనూ తగ్గించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంటర్‌ మొదటి ఏడాది నుంచి పూర్తి పాఠాలు, రెండో ఏడాది నుంచి 70శాతం పాఠ్యాంశాలపై ప్రశ్నలు ఇవ్వడంపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 70శాతం పాఠాలనే నేర్చుకుంటున్నారు. అందువల్ల వీరికి 2022లో నిర్వహించే ఎంసెట్‌లోనూ 30శాతం తగ్గింపు విధానం అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  

జేఈఈకి పూర్తిగా..

జేఈఈ మెయిన్‌లో పూర్తి పాఠ్యాంశాలను ఇవ్వనున్నట్లు ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. విద్యార్థులకు సెక్షన్‌-బీ న్యూమెరికల్‌ విభాగంలో ఛాయిస్‌ను ఇచ్చింది. ఈ విభాగంలో ప్రతి సబ్జెక్టు నుంచి ఐదు ప్రశ్నలు రాయాల్సి ఉండగా.. అదనంగా మరో ఐదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఇస్తారు. ఈ ఛాయిస్‌లో వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయోనన్న స్పష్టత లేనందున గతంలోలాగే పూర్తి పాఠ్యాంశాలతో సిద్ధమవుతున్నారు. పాఠ్యాంశాల తగ్గింపు లేదని ఎన్‌టీఏ వెల్లడించడంతో వందశాతం పాఠాలపై అభ్యాసన కొనసాగిస్తున్నారు.   

జులైలో ఎంసెట్‌..

ఉమ్మడి ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రకటించినందున ఎంసెట్, ఇతర పరీక్షల షెడ్యూల్‌పై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జూన్‌ రెండో వారం వరకు ఉండగా, జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్‌ జులై 5 నుంచి నాలుగురోజుల నిర్వహించనున్నారు. దీంతో ఏపీ ఎంసెట్‌ రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. 

Posted Date : 16-02-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని