• facebook
  • whatsapp
  • telegram

పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం

పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగే అవకాశం ఉంటుంది. రైల్వేశాఖలో గ్రూప్‌-డి నియామకాలకు  అభ్యర్థులు రెండు దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వారిలో ప్రతిభావంతులకు ఉద్యోగావకాశం లభిస్తుంది.  

ట్రాక్‌మన్‌ (ఇంజినీరింగ్‌ విభాగం)
* ట్రాక్‌మన్‌ నుంచి పదోన్నతిపై సీనియర్‌ ట్రాక్‌మన్‌, కీమెన్‌, మేట్‌(ముఖదం), సూపర్‌వైజర్‌, జేఈగా వెళ్లవచ్చు. హెల్పర్‌-2 (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎస్‌అండ్‌టీ విభాగం)
* ఇక్కడి నుంచి టెక్నీషియన్‌-3, టెక్నీషియన్‌-2, 1 తర్వాత సీనియర్‌ టెక్నీషియన్‌ హోదా, మాస్టర్‌ క్రాఫ్ట్‌ మేనేజర్‌ (ఎంసీఎం) వరకూ చేరుకునే అవకాశం ఉంటుంది.అసిస్టెంట్‌ పాయింట్స్‌ మ్యాన్‌ (ఆపరేటింగ్‌ విభాగం)
* కనీసం 2 సంవత్సరాల తర్వాత పాయింట్‌మెన్‌ ఏఎస్‌ఎం, ట్రాక్‌ క్లర్క్‌, గార్డ్‌ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల ద్వారా వెళ్లవచ్చు.

రెండు దశల్లో...
ఈ పోస్టుల నియామకం రెండు దశల పరీక్షల ద్వారా జరుగుతుంది. మొదటిదశ- రాతపరీక్ష, రెండో దశ- శారీరక సామర్థ్య పరీక్ష.
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత/ ఐటీఐ/ దీనికి సమానమైన అర్హత
వెబ్‌సైట్‌:
www.scr.indianrailways.gov.in

ఎవరికి అనుకూలం?
కొత్తగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు శ్రద్ధగా కష్టపడాల్సిందే. అయితే కానిస్టేబుళ్లు, ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు, వీఆర్వో/ వీఆర్‌ఏ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించలేనివారికి దాదాపు అదే సిలబస్‌ ఉన్న ఈ పరీక్ష రాయడం సులభం. వీరు గతంలోని లోపాలు సవరించుకుని సన్నద్ధతకు పదును పెడితే విజయం సాధించవచ్చు.
పరీక్ష పద్ధతి: ఆబ్జెక్టివ్‌ విధానం. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌తో పాటు తెలుగు మాధ్యమంలోనూ ఉంటుంది.
ప్రతి తప్పు జవాబుకూ 1/3 రుణాత్మక మార్కుంటుంది. పరీక్షలో కనీస అర్హత తప్పనిసరి.
అర్హత మార్కులు: అన్‌ రిజర్వ్‌డ్‌- 40 శాతం, ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ- 30 శాతం
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది.
ఇందుకోసం ఎక్కువ దూరం పరుగెత్తడం అభ్యాసం చేయాలి. కనీసం వారానికి ఒకసారి 3000మీ. - 4000 మీ దూరం పరుగెత్తాలి. దీంతోపాటుగా 400 మీ (3 sets), 800 మీ (3 sets), 1000మీ (3 sets) రోజువారీగా పరుగెత్తడం వల్ల వేగం, Leg movement పెరుగుతుంది. మూలమలుపులు కూడా రోజువారీగా సాధన చేయాలి. పరుగు చివరి దశలో చేతులను వేగంగా కదిలించడం, కాళ్ల అడుగులు దూరంగా పడడం ద్వారా తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్చు.
గమనిక: ఈ విభాగంలో ఒకే అవకాశం ఉంటుంది. కనుక పరుగు మొదలు పెట్టేముందు వార్మప్‌ 5 నిమిషాలు చేయాలి. ఇది చేశాకే పరుగు ప్రారంభించాలి.

 

పరీక్షలోని విభాగాలు
జనరల్‌ నాలెడ్జ్‌ /అవేర్‌నెస్‌: జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి సుమారు 30- 40 ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. ఈ విభాగానికి ఒక నిర్దిష్ట సిలబస్‌ ఉండదు. గతంలో జరిగిన వివిధ రైల్వే పరీక్షలను గమనిస్తే జనరల్‌ నాలెడ్జ్‌లో భారతదేశ చరిత్ర నుంచి సమకాలీన అంశాల వరకూ అన్ని టాపిక్‌ల్లో ప్రాథమిక పరిజ్ఞానం పరీక్షిస్తారు.
రాజుల చక్రవర్తుల బిరుదులు, చరిత్రలో ముఖ్యమైన సంవత్సరాలు, ప్రసిద్ధి చెందిన కవులు, రచయితలు, భారత స్వాతంత్రోద్యమంపై ప్రశ్నలడిగే అవకాశముంది. రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన సవరణలు, వాటి ఉద్దేశాలు, ఆర్టికల్స్‌, మాజీ ప్రధానులు, రాష్ట్రపతుల జాబితా, ముఖ్యమైన వ్యక్తుల విధులు, సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి.
భూగోళశాస్త్రంలో సౌరకుటుంబం, భౌగోళిక సరిహద్దులు, జనాభా, నదులు, పర్వతాలు ప్రాజెక్టులు, నదులపై నిర్మించిన డ్యాంలు, రవాణావ్యవస్థ, నేలలు, వ్యవసాయం, పరిశ్రమలు ముఖ్యమైనవి.
జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల పరిధిలో- మానవుని శరీర నిర్మాణ వ్యవస్థ విటమిన్లు, ఉపయోగాలు, లోపిస్తే వచ్చే వ్యాధులు, కొన్ని భౌతికచర్యలు, రసాయన నామాల సాధారణ పేర్లు, కొన్ని మూలకాలు, క్షిపణి పరీక్షలు- ప్రయోగించిన తేదీలు తెలుసుకోవాలి. పై అంశాలతోపాటు జాతీయంగా, అంతర్జాతీయంగా వర్తమాన అంశాలను పరిశీలించాలి. పదోతరగతి పాఠ్యపుస్తకాలతోపాటు దినపత్రికలను చదవడం మంచిది.

గణితం: మొత్తం అంశాలను 5 భాగాలు చేసుకుని, ఒక్కోదానిపై వివిధ రకాల ప్రశ్నలు సాధిస్తే ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. దీనిలోని ప్రశ్నలు 8, 9, 10 తరగతుల స్థాయిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. అందుకే ప్రాథమికమైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు సాధన చేయాలి.
‣ నిష్పత్తి- అనుపాతంలో చాలారకాల ప్రశ్నలున్నాయి. ఇందులో ప్రతి ప్రశ్నకూ రఫ్‌వర్క్‌ చేయడం ద్వారా దీనికి సంబంధం గల భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభనష్టాలు, సగటులపై వచ్చే ప్రశ్నలను సులువుగా చేయవచ్చు.
‣ కాలం-పని, పంపులు-కుళాయిల్లో దాదాపు ఒకే తరహా ప్రశ్నలుంటాయి. కాబట్టి మొదటిది పూర్తిస్థాయిలో చదివితే రెండోది చదవాల్సిన అవసరం లేదు. కాలం-దూరం రైళ్లలో ఒకే రకం ప్రశ్నలుంటాయి. గడియారం, క్యాలెండర్‌ మొదలైన అంశాలపై సంక్షిప్త పద్ధతిలో సాధన చేయాలి.
‣ వైశాల్యాల్లో త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం మొదలైన వాటి సూత్రాలు నేర్చుకోవాలి. ఘనం, స్తూపం, శంఖువు, గోళం మొదలైనవి కూడా ముఖ్యమే.
‣ సంఖ్యలో చిన్న, పెద్ద, వాటి లబ్దం, వర్గాల మధ్య వ్యత్యాసం, క.సా.గు, గ.సా.భా., బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం, వాటి సూత్రాలపై ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఇటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
‣ ప్రాథమిక గణితంలో మాత్రికలు, త్రికోణమితి, బహుపదులు, ఘాతాలు, శ్రేఢులు మొదలైనవాటి సాధన అవసరం.

Posted Date : 03-02-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

నమూనా ప్రశ్నపత్రాలు