• facebook
  • whatsapp
  • telegram

అత్యున్నత పోటీకి అడుగెలా వెయ్యాలి?

సివిల్స్‌ - 2021 సన్నాహాలు

 

 

ప్రతిభావంతులైన, చురుకైన యువతను సూదంటురాయిలా ఆకర్షించే అత్యున్నత స్థాయి పోటీ పరీక్ష - సివిల్‌ సర్వీసెస్‌. ప్రతి సంవత్సరం మాదిరే సివిల్స్‌ ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష జూన్‌లో జరగబోతోంది. ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ విడుదల కావొచ్చు. ఈ సర్వీస్‌ లక్ష్యంగా ఉన్నవారు ప్రకటనతో సంబంధం లేకుండా ప్రిపరేషన్‌కు ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలి!

 

దాదాపు పది లక్షలమంది దరఖాస్తు చేసుకుంటే.. వారిలో సుమారు సగం మంది అభ్యర్థులు మాత్రమే రాసే పరీక్ష సివిల్స్‌ ప్రిలిమినరీ. పరీక్షకు హాజరయ్యే ప్రయత్నాలకు పరిమితి ఉన్నందున దరఖాస్తుదారుల సంఖ్యకూ, రాసేవారి సంఖ్యకూ ఇంత భేదం ఉంటుంది. 

 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రక్రియను రెండు లక్ష్యాలతో నిర్వహిస్తారు. 

 

1) నిరంతరం పరిజ్ఞానం, నైపుణ్యాలను నేర్చుకోగలిగిన అభ్యర్థులను ఎంపిక చేయటం 

 

2) నియమిత సర్వీసుకు స్వభావ, ప్రేరణల రీత్యా తగినవారు, భావోద్వేగ పరంగా అనుసంధానమయ్యేవారిని గుర్తించటం. ఈ లక్ష్యాలను చేరుకునేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. 

 

ప్రత్యేకంగా ప్రిలిమినరీ పరీక్ష అయితే.. అభ్యర్థుల సంఖ్యను వీలైనంతమేరకు తగ్గించేలా (వడపోత) కూడా ఉంటుంది.

 

ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నలు ఎలా ఉంటాయి? 

‣ అభ్యర్థికి ప్రాథమిక అంశాల పరిజ్ఞానం ఎంత ఉందో, దాన్ని వర్తమాన అంశాలకు ఎంత సమర్థంగా అన్వయించగలడో పరీక్షిస్తాయి.

‣ జాతీయ, అంతర్జాతీయ విషయాల్లో, అభివృద్ధి అంశంలో అభ్యర్థి ఆసక్తిని పరీక్షిస్తాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనా అభ్యర్థి స్పందన, వైఖరులు ఎలా ఉన్నాయో పరీక్షిస్తాయి.

‣ ప్రతి ప్రశ్నకూ ఇచ్చే నాలుగు సమాధానాలూ ఒకదానికొకటి దగ్గర పోలికలతో ఉంటాయి. అభ్యర్థికి స్పష్టమైన పరిజ్ఞానం లేకుంటే సరైన సమాధానం గుర్తించటం కష్టమయ్యేలా ప్రశ్నలుంటాయి. 

ప్రిలిమినరీలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపరూ 200 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1లో 100 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ 2 1/2 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 శాతం చొప్పున మార్కులను తగ్గిస్తారు (నెగిటివ్‌ మార్కింగ్‌).

అయితే  పేపర్‌-2 అనేది అర్హత (క్వాలిఫైయింగ్‌ నేచర్‌) కోసం మాత్రమే. ఈ పేపర్లో అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు (67/ 200) స్కోరు చేయాల్సి వుంటుంది. అలా సాధించినవారి పేపర్‌-1ను మాత్రమే దిద్దుతారు. రిజర్వేషన్‌ పాలసీ అమలును  దృష్టిలో ఉంచుకుని పేపర్‌-1లో ఉత్తమ స్కోర్లు సాధించినవారితో మెరిట్‌ జాబితాను తయారుచేస్తారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు సివిల్స్‌లో తర్వాతి దశ.. మెయిన్స్‌ రాయటానికి అర్హులవుతారు. ఉదాహరణకు... సివిల్స్‌- 2018, 2019లలో జనరల్‌ క్యాటగిరీకి ప్రిలిమినరీ కటాఫ్‌ 98 మార్కులు. 

 

ఈ పొరపాట్లు చేయొద్దు!  

‣ చాలామంది కొత్త అభ్యర్థులు ఒక సబ్జెక్టుపై ఇష్టం పెంచుకుని దానికి మరీ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఆ సబ్జెక్టులో అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తూ దానిలో తమకు తిరుగులేదనిపించుకోవాలని ఆశిస్తుంటారు. ఇలా ఒకే అంశంపై మితిమీరిన దృష్టి పెట్టటం మంచిది కాదు. ప్రిపరేషన్లో సమతూకం చాలా అవసరం.

‣ కొందరు కొన్ని సబ్జెక్టులపై అనవసరమైన అయిష్టం పెంచుకుని, దాన్ని చదవకుండా వదిలేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. ఉదాహరణకు.. ఆర్థిక శాస్త్రం ఆసక్తికరంగా ఉండదని చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రతి సబ్జెక్టు నుంచీ ప్రశ్నలు వస్తాయని గుర్తించి, దేన్నీ వదలకుండా చదవాలి. 

‣ ప్రతి సబ్జెక్టులో దొరికే అన్ని పుస్తకాలనూ చదివెయ్యాలనుకోవటం మంచిది కాదు. అలా చేయటం అసాధ్యం, అనవసరం కూడా! 

 ‘నాకు చాలా తక్కువే తెలుసు’ అనుకుంటూ బాధపడిపోకూడదు. గరిష్ఠంగా సబ్జెక్టు తెలియటానికి కొలమానమేమీ ఉండదు. ప్రస్తుతానికైతే పరీక్షలో నెగ్గటానికి అవసరమైనంత చదివితే చాలని గుర్తుంచుకోవాలి. అంతకంటే ఎక్కువేమీ అవసరం లేదు కదా!   

‣ ‘ఫలానా అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి’ లాంటి అంచనాలకు మితిమీరి ప్రాధాన్యం ఇవ్వకూడదు. అన్ని అంచనాలకు పూర్తి భిన్నంగా ప్రశ్నపత్రం ఉండొచ్చు. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి.

‣ సీనియర్ల సలహాల కోసం పదేపదే ఎదురుచూడవద్దు. మొదటిసారి మంచిదే. సందేహాలు తీర్చుకోవటానికి రెండో సారీ మంచిదే. కానీ అంతకుమించి సీనియర్లను సంప్రదించటం సమయం వృథానే! 

‣ ఇతరుల టైమ్‌టేబుల్‌ను అనుసరించవద్దు. బాగుంటే దాన్నో మోడల్‌గా తీసుకోవచ్చు. అందరికీ సరిపోయే నమూనా అంటూ ఏమీ ఉండదు. మీ అవసరాలకు అనుగుణంగా సొంత టైమ్‌టేబుల్‌ రూపొందించుకోవటం సరైనది. 

‣ ప్రాక్టీస్‌ టెస్టులు చేయాల్సిందే కానీ మరీ ఎక్కువ వద్దు. ఏదో ఒక సబ్జెక్టులో 100 మార్కుల పేపర్‌ కాకుండా.. అన్ని సబ్జెక్టులూ కలిసి 100 మార్కులకు రూపొందించిన సమగ్రమైన పేపర్‌ను నిర్దిష్ట సమయంలో రాయటం మేలు చేస్తుంది.  

‣ టెస్టులు రాసినప్పుడు మీరు చేసిన పొరపాట్లను రాసుకోండి. అవి మైనస్‌ మార్కులుగా మీ తుది స్కోరును ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించండి. ప్రతి ప్రశ్నా విలువైనదే. ఒక్క ప్రశ్న.. సరిగా రాస్తే పరీక్ష నెగ్గేందుకో, మార్కు కోత పడితే ఫెయిల్‌ అవ్వటానికో కారణం కావొచ్చు!

 

ఇతర అభ్యర్థుల టైమ్‌టేబుల్‌ను అనుసరించవద్దు. మీ అవసరాలకు అనుగుణంగా సొంత టైమ్‌టేబుల్‌ రూపొందించుకుని పాటించాలి! 

 

సీనియర్ల సలహాల కోసం పదేపదే ఎదురుచూడవద్దు. ఒకటి రెండు సార్లకు మించి సీనియర్లను సంప్రదించటం కేవలం సమయం వృథా.

 

ఏ అంశాల నుంచి ప్రశ్నలు?       

గత కొన్ని సంవత్సరాలుగా ప్రిలిమినరీ పరీక్షను బాగా క్లిష్టంగా ఇస్తున్నారు. ఏటా దాదాపు 10,500 మంది నెగ్గుతూ వస్తున్నారు. వీరికీ, వైఫల్యం పొందినవారికీ తేడా ఏమిటి? విజేతలైనవారు కోర్‌ పరిజ్ఞానం, కొత్త ధోరణుల సమ్మిళితంగా పఠన వ్యూహం అనుసరిస్తున్నారని గ్రహించాలి.  

ప్రిలిమినరీ పేపర్‌-1 సిలబస్‌ ఏడు అంశాల్లో ఉంటుంది. 

1) వర్తమాన అంశాలు- జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్నవి.

2) భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం

3) ప్రపంచ, భారతదేశ భౌతిక, సాంఘిక, ఆర్థిక భౌగోళిక వ్యవస్థ

4) భారత రాజకీయ వ్యవస్థ, పాలన- రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్‌ పాలసీ, హక్కుల అంశాలు.

5) ఆర్థిక, సామాజికాభివృద్ధి- స్థిరాభివృద్ధి, పేదరికం, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్‌ సెక్టార్‌ ఇనిషియేటివ్స్‌

6) ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ- బయో డైవర్సిటీ, క్లైమేట్‌ చేంజ్‌

7) జనరల్‌ సైన్స్‌- సైన్స్‌ అనువర్తిత అంశాలు.

ఈ సిలబస్‌ ఎంత సాధారణంగా ఉందంటే... ఏ అంశం నుంచి నిర్దిష్టంగా ఏ ప్రశ్నలు వస్తాయో అవగాహన చేసుకోవటం కష్టం. గత కొద్ది సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నల విశ్లేషణను బట్టి మాత్రమే ఒక అంచనాకు రాగలం.

 

ఎలా చదివితే మేలు?

‣ పరీక్ష తేదీకి 30 రోజుల ముందు వరకూ స్టడీ టైమ్‌ టేబుల్‌ సిద్ధం చేసుకోవాలి. దీనిలో అన్ని సబ్జెక్టులూ కవరవ్వాలి. ప్రతి సబ్జెక్టులోనూ కోర్, కరంట్‌ అఫైర్స్‌ భాగం పూర్తయ్యేలా ఇది ఉండాలి. 

‣ మొదట ప్రిలిమినరీ పేపర్‌-1 సిలబస్‌లోని సబ్జెక్టులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలన్నీ చదవాలి.

‣ తర్వాత ప్రతి సబ్జెక్టులో సంబంధిత సంప్రదింపు పుస్తకాల పఠనం పూర్తి చేయాలి.

‣ ప్రతి అంశంలోనూ బహుళైచ్ఛిక ప్రశ్నలను ఆన్సర్‌ చేసి, పరిజ్ఞానం ఏమేరకు ఉందో గమనించుకోవాలి. బలహీనంగా ఉన్నవాటిపై దృష్టిపెట్టాలి. 

‣ ఆ అంశాల్లో వర్తమాన అంశాల ఆధారిత ప్రశ్నలను కూడా ఆన్సర్‌ చేయాలి.

‣ చివరి నెలలో అన్ని అంశాలూ కలిసిన సమగ్ర ప్రశ్నపత్రానికి జవాబులు గుర్తించాలి. మరీ ఎక్కువ నెగిటివ్‌ మార్కులు పోకుండా రెండు గంటల్లో పేపర్‌ పూర్తిచేసేలా ఉండాలి. 

‣ పరీక్ష తేదీకి ముందు 30 రోజులూ పునశ్చరణ (రివిజన్‌)కూ, బహుళైచ్ఛిక ప్రశ్నల సాధనకూ మాత్రమే కేటాయించాలి.

‣ ఏమీ సిద్ధం కాకుండానే పేపర్‌-2 పూర్తి చేయగలననే నిర్లక్ష్యం అసలు పనికి కాదు. అది అర్హత పరీక్ష మాత్రమే కదా అనే తేలిక భావం సరి కాదు. పెద్దగా పట్టులేని అంశాలను గుర్తించి, వాటిపై పట్టు పెంచుకోవాలి.

 

Posted Date : 04-02-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

నమూనా ప్రశ్నపత్రాలు