• facebook
  • whatsapp
  • telegram

కనిపెట్టొచ్చు నప్పే కెరియర్‌!

కెరియర్‌ విషయంలో తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్‌ గురించి కంగారు. విద్యార్థులకేమో తగినదే ఎంచుకుంటున్నామా లేదా అనే ఆందోళన. ఎన్నో సంస్థలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దీనిపరంగా తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఐబీఎం, ఎంసీఎంఎఫ్‌ వంటి ప్రముఖ సంస్థలూ దీనిపరంగా సేవలను అందిస్తున్నాయి. 

 

ఐబీఎం
ఎడ్యుగై కెరియర్‌ ప్రిడిక్టివ్‌ టెస్ట్‌ (ఈసీపీటీ)ను ఐబీఎం సంస్థ అందిస్తోంది. తమకు నప్పే కెరియర్‌ ఏదో తెలుసుౖకోవాలనుకునే విద్యార్థులు, కెరియర్‌ మార్పు కోసం చూసే వర్కింగ్‌ ప్రొఫెషనల్స్, తమ పిల్లలకు మంచి కెరియర్‌ను అందించాలనుకునే తల్లిదండ్రులు ఎవరైనా దీనిని ప్రయత్నించవచ్చు. ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్‌ కెరియర్‌ ప్రిడిక్టివ్‌ టెస్ట్‌గా దీన్ని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏఐ, డీపీ లర్నింగ్‌ అభ్యర్థిని అంచనావేసి తనకు సరిపడే కెరియర్‌లను సూచించడం దీనిలో ప్రధానాంశం.

ప్రపంచంలో ఎన్నో రకాల కెరియర్లు అందుబాటులో ఉన్నా మన విద్యార్థులు కొన్ని ప్రముఖమైన వాటికే పరిమితమవుతుంటారు. ఈసీపీటీ ద్వారా అభ్యర్థుల నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్, ఆసక్తులను అంచనావేసి, వారికి సరైన కెరియర్‌ ఏదో సూచిస్తారు. సుమారు 1400 కెరియర్‌ ఆప్షన్లలో అభ్యర్థికి తగినవేంటో సూచిస్తారు. ఇందుకుగానూ 120 నిమిషాల పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష. డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ ద్వారా మాత్రమే రాయగలుగుతారు. మొబైల్‌ వెర్షన్‌ పనిచేయదు. మూడు సెక్షన్లు- పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్, ఇంట్రెస్ట్‌లు ఉంటాయి. ప్రతి విభాగాన్నీ విడివిడిగా పరీక్షిస్తారు. పరీక్ష పూర్తవగానే ఫలితాలను ఇచ్చేస్తారు. పరీక్ష అనగానే సమాధానాలను రాయాల్సిన పనిలేదు. ప్రశ్నకు అవును/ కాదు సమాధానంగా గుర్తిస్తే చాలు. అభ్యర్థికి అనుకూలమైన మూడు ఉత్తమ కెరియర్‌ అవకాశాలను సూచిస్తారు.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో పేరు, ఈ-మెయిల్, మొబైల్‌ నంబరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఉచితం మాత్రం కాదు. కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://ecptonline.com/#/home ను సందర్శించవచ్చు.

 

ఎంసీఎంఎఫ్‌
‘మై చాయిస్‌ మై కెరియర్‌’.. విద్యార్థుల వ్యక్తిత్వం, ఆసక్తులు, పాషన్‌ ఆధారంగా వారికి నప్పే కెరియర్‌/ కోర్సులను సూచిస్తుంది. సాధారణంగా దేశంలో ఎక్కువ శాతం కెరియర్‌ ఎంపిక విద్యార్థి కుటుంబం/ స్నేహితుల ప్రభావంతో జరుగుతుంటుంది. తీరా వాటిల్లో చేరాక విద్యార్థి వాటిని కష్టంగా, భారంగా భావించడం కనిపిస్తుంటుంది. ఇలా కాకుండా విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు సంయుక్తంగా దీన్ని రూపొందించారు. దీనిలో విద్యార్థుల బలాలను అర్థం చేసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వానికి తగిన కెరియర్‌ను సూచిస్తారు.

దీనిని హైస్కూలు, హయ్యర్‌ సెకండరీ, కళాశాల విద్యార్థులు, కెరియర్‌ మార్చుకోవాలనుకునే వారెవరైనా ప్రయత్నించవచ్చు. దీనిలో అభ్యర్థికి సంబంధించి 12 అంశాలను పరిశీలిస్తారు. సుమారు 72 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్‌తోపాటు వ్యక్తిగత విశ్లేషణ నివేదిక, కౌన్సెలింగ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. పరీక్ష ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో సైన్‌అప్‌ అవ్వాల్సి ఉంటుంది. కొంత మొత్తం చెల్లించడం ద్వారా అసెస్‌మెంట్‌ తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://www.mychoicemyfuture.com/ ను సందర్శించవచ్చు.