• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీల్లోకి సీడ్స్‌ దారి

డిజైన్‌ కోర్సులకు ప్రవేశ ప్రకటనలు   

 

కొన్ని వస్తువులు చూడగానే మనసు పారేసుకుంటాం. చూపు తిప్పుకోకుండా ఉండిపోతాం. ఆ రూపాన్ని చూస్తూ మురిసిపోతాం. ఆ వస్తువు అవసరం లేకపోయినప్పటికీ కొనాలనిపిస్తుంది. ఆ ఆకర్షణ వెనుక కొంతమంది నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. అందుకు డిజైన్‌ కోర్సులు దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారికి మేటి సంస్థల్లో చేరే అవకాశం వచ్చిందిప్పుడు. డిజైన్‌ కోర్సులకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి!

 

యూసీడ్‌
డిజైన్‌ కోర్సుల్లో చేరి రాణించాలనుకునే ఇంటర్‌ విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సివుంటుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) ద్వారా ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు పేరున్న సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిస్‌.) కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అలాగే ఈ స్కోరును ప్రసిద్ధ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. 
అర్హత: 2020లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌.. అన్ని గ్రూపులవారూ అర్హులే. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్న, చదువుతున్నవారూ అర్హులే. ఐఐటీ-గువాహటి కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి. 
వయసు: అక్టోబరు 1, 1996 తర్వాత జన్మించినవాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1991 తర్వాత జన్మించినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

 

పరీక్ష ఇలా
ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు (ఎ, బి) ఉంటాయి.
పార్ట్‌-ఎ : ఈ విభాగానికి 240 మార్కులు. వ్యవధి రెండున్నర గంటలు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి.
సెక్షన్‌ 1 (న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌): ఈ విభాగానికి 72 మార్కులు కేటాయించారు. 18 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 మార్కులు. ఆప్షన్లు ఉండవు. జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఆన్‌లైన్‌ కీబోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. 
సెక్షన్‌ 2 (మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు): ఈ విభాగానికీ 72 మార్కులు కేటాయించారు. మొత్తం 18 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. అభ్యర్థులు సరైన ఆప్షన్లు గుర్తిస్తే 4 మార్కులు సొంతమవుతాయి. ఆ ప్రశ్నకు ఉన్న సరైన సమాధానాలన్నీ గుర్తిస్తేనే మార్కులుంటాయి. గుర్తించిన ఆప్షన్లలో కొన్ని సరైనవి ఉన్నప్పటికీ పాక్షిక మార్కుల కేటాయింపు ఉండదు. అలాగే ఈ సెక్షన్‌లోనూ రుణాత్మక మార్కులున్నాయి. తప్పు సమాధానానికి 0.19 మార్కులు తగ్గిస్తారు. 
సెక్షన్‌ 3 (మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు): ఈ విభాగానికి 96 మార్కులు కేటాయించారు. ఇందులో 32 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. అయితే వీటిలో ఒకటే సరైనది. అందువల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులు ఉన్నాయి.  
పార్ట్‌-బి: ఈ విభాగానికి 60 మార్కులు కేటాయించారు. వ్యవధి 30 నిమిషాలు. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రశ్న ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతుంది. అయితే సమాధానం (డ్రాయింగ్‌) జవాబు పత్రంపై రాయాలి.

 

ప్రశ్నలడిగే విభాగాలు...
విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల స్వరూపంపై అవగాహనకు రావచ్చు. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు.
ప్రవేశం కల్పించే సంస్థలు, సీట్లు: ఐఐబీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌.. ఈ సంస్థలు నేరుగా యూసీడ్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. వాటిలో మొత్తం 179 సీట్లు ఉన్నాయి. ఐఐటీ-బాంబే 37, ఐఐటీ-గువాహటి 56, ఐఐటీ- హైదరాబాద్‌ 20, ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌లో 66 చొప్పున సీట్లు కేటాయించారు. ఐఐటీ-బాంబేలో చేరినవారు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు అయిదేళ్లలో పూర్తవుతుంది. యూసీడ్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఇతర సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్, లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శ్రేష్ఠ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌...తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. 
అగ్గి పెట్టెలు.. సబ్బు డొక్కులు, పాదరక్షలు.. పైజామాలు, సెల్‌ ఫోన్లు.. సెమీ కండక్టర్లు... ఇలా ప్రతిదానికీ ఒక ఆకారం అవసరం. వాటిని ఆకర్షణీయంగా, సులువుగా ఉపయోగించేలా, తక్కువ స్థలంలో ఇమిడేలా డిజైనర్లు తీర్చిదిద్దుతున్నారు. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారికోసం యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులను ఎన్నో సంస్థలు అందిస్తున్నాయి. ప్రవేశాల నిమిత్తం సంస్థల వారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి యూసీడ్, సీడ్‌. ఇందులో ప్రతిభ చూపినవారు ఐఐటీలు, ఐఐఎస్‌సీతోపాటు పేరున్న సంస్థల్లో డిజైన్‌ కోర్సులు చదువుకోవచ్చు. తాజాగా ఐఐటీ బాంబే యూసీడ్, సీడ్‌ ప్రకటనలు విడుదల చేసింది.


పీజీ కోర్సులు / స్పెషలైజేషన్లు
ఐఐఎస్సీ బెంగళూరు: ఎండిజైన్‌- ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ బాంబే: ఎండిజైన్‌- ఇండ[స్టియల్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్‌ డిజైన్, మొబిలిటీ అండ్‌ వెహికల్‌ డిజైన్‌; పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ దిల్లీ: ఎండిజైన్‌- ఇండ[స్టియల్‌ డిజైన్‌
ఐఐటీ గువాహటి: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ హైదరాబాద్‌: ఎండిజైన్‌- విజువల్‌ డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ కాన్పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

 

పీజీ, పీహెచ్‌డీలకు సీడ్‌
డిజైన్‌లో యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీలో ప్రవేశానికి సీడ్‌ ద్వారా అవకాశం కలుగుతుంది. అలాగే ఈ పరీక్షతో పీజీ విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సులో చేరవచ్చు. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐటీడీఎం జబల్‌పూర్‌లో డిజైన్‌కు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి  కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) రాయడం తప్పనిసరి.  

 

ప్రశ్నపత్రం ఇలా: 
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. అవి పార్ట్‌ ఎ, బి. పార్ట్‌ - ఎ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ విభాగంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. మొత్తం 41 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ప్రశ్నలు 8 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు ఉండవు. మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు 10 వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి 0.2 మార్కులు తగ్గిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విభాగంలో 23 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పార్ట్‌ ఎలో విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బి ప్రశ్నలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతాయి. అయితే వీటికి సమాధానాలు (డ్రాయింగ్స్‌) బుక్‌లెట్‌లో రాయాలి. ప్రతి ప్రశ్నకు 20 మార్కులు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. స్కెచింగ్, క్రియేటివిటీ, ఫామ్‌ సెన్సిటివిటీ, విజువల్‌ సెన్సిటివిటీ, ప్రాబ్లమ్‌ ఐడెంటిఫికేషన్‌ ఒక్కో విభాగంలో ఒక ప్రశ్న చొప్పున ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పార్ట్‌ ఎను స్క్రీనింగ్‌ టెస్టుగా పరిగణిస్తారు. పార్ట్‌ ఎ పరీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారి పార్ట్‌ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపికలో పార్ట్‌ ఎకు 25, పార్ట్‌ బికి 75 శాతం వెయిటేజీ లభిస్తుంది. 
అర్హత: గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశం కల్పించే సంస్థలను బట్టి స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. బీటెక్, బీఆర్క్, డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, బీఎఫ్‌ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రాం (10+5 విధానంలో) చదివినవారికి అన్ని సంస్థల్లోనూ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. వయసు నిబంధన లేదు.

 

యూసీడ్, సీడ్‌ ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 10
పరీక్ష తేదీ: జనవరి 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్‌సైట్లు:  www.uceed.iitb.ac.in, www.ceed.iitb.ac.in