• facebook
  • whatsapp
  • telegram

నేర్పు ఉందా? నెగ్గండి… మరి!

అంతర్జాతీయ స్థాయిలో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ 


జీవితంలో విజయం సాధించడానికి మార్కులు మాత్రమే సరిపోవడం లేదు. జీవన నైపుణ్యాలూ కావాలి. వాటిని చిన్నప్పటినుంచే పెంపొందించాల్సిన అవసరముందంటున్నాయి ప్రముఖ సంస్థలు. ఇందులో భాగంగా ఇవి పిల్లల్లో ఎంతవరకూ అలవడుతున్నాయో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలూ నిర్వహిస్తున్నాయి. ఇందులో ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌’ ప్రముఖమైనది. దీనికి  ప్రకటన విడుదలైంది. ఈసారి కొత్తగా మూడు ఒలింపియాడ్స్‌నూ నిర్వహిస్తోంది. మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 
పాఠశాల స్థాయి నుంచీ జీవన నైపుణ్యాలపై దృష్టిసారిస్తేనే వృత్తిగత జీవితంలోనూ మంచి అవకాశాలను అందుకోవడం సాధ్యమవుతుందని యూనిసెఫ్, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ వంటి ఎన్నో సంస్థల పరిశోధనలూ చెబుతున్నాయి. సింగపూర్‌కు చెందిన ‘స్కిలిజెన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌’- ఇదే ఉద్దేశంతో పనిచేస్తోంది. ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ (ఐఎల్‌ఎస్‌ఓ)’ పేరిట పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో లైఫ్‌స్కిల్స్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి క్రిటికల్‌ స్కిల్స్‌కు సంబంధించి కొత్తగా మరో మూడు ఒలింపియాడ్స్‌ను సంస్థ నిర్వహిస్తోంది. మూడు నుంచి పన్నెండు తరగతులవారు దీనిలో పాల్గొనవచ్చు. 100కు పైగా దేశాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు.


నాలుగు గ్రూపులు
తరగతులను బట్టి 4 గ్రూపులుగా విభజించారు. గ్రూపును బట్టి ప్రశ్నించే అంశాల్లో తేడా ఉంటుంది. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆంగ్లమాధ్యమంలో ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. వెబ్‌సైట్‌లో సిలబస్, లైఫ్‌ స్కిల్స్‌ గైడ్, ప్రాక్టీస్‌ ప్రశ్నలుంటాయి. గ్రూపులవారీ మాదిరి పరీక్షలూ ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.lifeskillsolympiad.org ను సందర్శించవచ్చు.


1. లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌
పిల్లల్లో క్రిటికల్‌ లైఫ్‌ స్కిల్స్‌ కోషంట్‌ను అంచనావేయడం కోసం రూపొందించారు. దీనిలో నిజజీవిత పరిస్థితుల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. లీడర్‌షిప్‌ స్కిల్స్, వాల్యూస్‌ అండ్‌ ఎథిక్స్, ఎకనామిక్‌ సెన్స్, టీమ్‌ వర్క్, ఎంపతీ, క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్, కమ్యూనికేషన్, ఎన్విరాన్‌మెంటల్, స్మార్ట్‌ కన్స్యూమర్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, సోషల్‌ మీడియా, డెసిషన్‌ మేకింగ్, గోల్‌ సెట్టింగ్, నెగోషియేషన్, పర్సనల్‌ ఫైనాన్స్, క్రియేటివిటీ అండ్‌ ఇన్నవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, వర్చువల్‌ ప్రొడక్టివిటీ, కొలాబరేటివ్, గ్లోబల్‌ సిటిజన్‌షిప్, సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్, పర్సనల్‌ బ్రాండింగ్, నెట్‌వర్కింగ్, ప్లానింగ్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ను ఇందులో భాగంగా పరీక్షిస్తారు.
పరీక్ష తేదీ: డిసెంబరు 6, 2020

2. ఎథిక్స్‌ అండ్‌ వాల్యూస్‌
జీవితంలో విజయం సాధించడానికి ఏది మôచో, ఏది చెడో తెలుసుకోవడం ప్రధానం. నైతికత, విలువలు సరైన మార్గాన్ని సూచించడంలో తోడ్పడుతాయి.వ్యక్తిగత, వృత్తిగత, సామాజిక జీవనాల్లో వీటికీ ప్రాధాన్యం ఉంది. పిల్లలో దీనిని పెంపొందించడానికీ, పరిశీలించడానికీ దీనిని నిర్వహిస్తున్నారు. దీనిలో వ్యక్తిగత నైతిక ప్రవర్తన; వృత్తిగత విలువలు, ప్రవర్తన; గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌; ఎన్విరాన్‌మెంటల్‌ ఎథిక్స్‌ అండ్‌ వాల్యూస్‌; ఎంపతీ అండ్‌ కంపాషన్‌; టీమ్‌వర్క్‌ అండ్‌ కొలాబరేటివ్‌ ఎథిక్స్‌ అండ్‌వాల్యూస్‌ అంశాలను పరిశీలిస్తారు. 
పరీక్ష తేదీ: నవంబరు 21, 2020


3. ఎకనామిక్‌ స్కిల్స్‌
పిల్లల్లో ఆర్థికానికి సంబంధించి అవగాహన కలిగించడం ఈ ఒలింపియాడ్‌ ఉద్దేశం. దీనిలో ఎకానమీ సంబంధిత థియరీలు, పరిశోధనల గురించి ప్రశ్నలుండవు. డబ్బు, దాని విలువ, కొనుగోళ్లు, అమ్మకాలు, ఆర్థికపరంగా అనుకూలంగా ఉండటం వంటివాటిని పరిశీలిస్తారు. నిత్యజీవితంలో జరిగే ఆర్థిక లావాదేవీల ప్రాథమికాంశాలు, స్మార్ట్‌ కన్స్యూమర్‌ స్కిల్స్, పర్సనల్‌ ఫైనాన్స్‌ సెన్స్, ఎకనామిక్‌ రీజనింగ్‌ ఫర్‌ డెయిలీ డెసిషన్స్, ఎకనామిక్‌ డెసిషన్స్‌ అబౌట్‌ ద ఎన్విరాన్‌మెంట్, ఎకనామిక్‌ డెసిషన్స్‌ ఫర్‌ సొసైటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 
పరీక్ష తేదీ: డిసెంబరు 5, 2020


4. లీడర్‌షిప్‌ స్కిల్స్‌
తరగతి నిర్వహించే విద్యార్థి అయినా ఒక సంస్థ అధిపతి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ప్రధానం. స్థాయి ఏదైనా తమవారిని నడిపించడం, ఒప్పించడం వంటివి ఉంటాయి. ఇవి చిన్నవయసు నుంచీ ఎంతవరకూ అభివృద్ధి చెందుతున్నాయో పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ప్రశ్నలు వివిధ ఉదాహరణల ద్వారా అడుగుతారు. ఇతరులను నడిపించడం, తననుతాను నడిపించుకోవడం, భావప్రకటన, నెగోషియేషన్, వివాదాలు ఏర్పడినపుడు పరిష్కరించే తీరు, భావోద్వేగ ప్రజ్ఞ మొదలైన అంశాలను పరీక్షిస్తారు. 
పరీక్ష తేదీ: నవంబరు 22, 2020