• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సైన్స్‌ స్కాలర్‌షిప్పులు ఇవిగో!   

ప్రముఖ సంస్థ లోరియల్‌ ఇండియా.. అమ్మాయిలకు ఉపకార వేతనాలు ప్రకటించింది. సైన్స్‌ విభాగాల్లో కెరియర్‌ను తీర్చిదిద్దుకునేవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే రూ. రెండున్నర లక్షల మొత్తం అందుకునే అవకాశం. తాజాగా ఇంటర్‌ పూర్తిచేసిన  విద్యార్థినులు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు!


సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ లోరియల్‌ ఇండియా.. అమ్మాయిలకు మెరిట్‌ ఆధారిత స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. సైన్స్‌ విభాగాల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకునేవారికి ‘లోరియల్‌ ఇండియా ఫర్‌ యంగ్‌ విమెన్‌ ఇన్‌ సైన్స్‌ స్కాలర్‌షిప్‌’ పేరిట వీటిని అందిస్తోంది. భవిష్యత్తులో సైన్స్‌ విభాగాల్లో మహిళల పాత్రా ప్రధానమనేది సంస్థ ఉద్దేశం. అందుకే ‘ప్రపంచానికి సైన్స్‌ అవసరం; సైన్స్‌కు స్త్రీలు అవసరం’ అనే నినాదంతో వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు. 2003 నుంచి వీటిని అందిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పూర్తి అయ్యి, సైన్స్‌ విభాగాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే అమ్మాయిలు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.


స్కాలర్‌షిప్‌ మొత్తం
ఎంపికైనవారికి అకడమిక్‌ ఖర్చులకు రూ. 2,50,000 వరకూ చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో చెల్లిస్తారు.
ఆ ఏడాది పాస్‌ అయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే మరుసటి ఏడాది స్కాలర్‌షిప్‌ కొనసాగుతుంది.

 

దరఖాస్తు ఎలా?
లోరియల్‌ ప్రముఖ వెబ్‌సైట్‌ బడ్డీ ఫర్‌ స్టడీ ఆధ్వర్యంలో వీటిని అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ https://www.buddy4study.com/articleoreal-india-for-young-women-in-science-scholarship లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
మొదట విద్యార్థి జీ-మెయిల్‌/ ఫేస్‌బుక్‌ ఐడీతో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆపై అయిదు అంచెల దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా అవసరమైన పత్రాలనూ సమర్పించాల్సి ఉంటుంది.
అవి: 
వయసు ధ్రువీకరణ పత్రం (ఆధార్‌/ జనన ధ్రువీకరణ పత్రం/ పాస్‌పోర్టు/ ఓటరు కార్డు మొదలైనవి) 
తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం (తల్లిదండ్రుల పే స్లిప్‌/ ఫారం 16) 
పది, ఇంటర్‌ మార్క్‌ షీట్లు 
దరఖాస్తు గడువు: అక్టోబరు 15, 2020

 

అర్హత
ఈ ఏడాది (2019-20) ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకుని ఉండాలి. ఎంపీసీ/ బైపీసీ/ పీసీఎంబీలో 85% మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్థినుల వార్షిక ఆదాయం రూ. నాలుగు లక్షలకు మించకూడదు.
వయసు 31.05.2020 నాటికి 19 సంవత్సరాలు మించకూడదు.
సైన్స్‌ విభాగాల్లో (సైన్స్, అప్లయిడ్‌ సైన్స్, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర సైన్స్‌ సంబంధిత విభాగాల వారెవరైనా) అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఉండాలి.
గ్యాప్‌ ఇయర్‌ ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు.
దేశంలో ఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థను ఎంచుకున్నవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
విదేశాల్లో చదివేవారు అనర్హులు.

 

ఎంపిక ప్రక్రియ
మొత్తంగా మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా స్క్రీనింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. ఇక్కడ ఎంపికైన వారికి రెండో దశలో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇక్కడా అర్హత సాధించినవారికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన జ్యూరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తిరిగి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలో విద్యార్థితోపాటు తన తల్లిదండ్రులు/ గార్డియన్‌ పాల్గొనాల్సి ఉంటుంది. దీనిలోనూ అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. ఫలితాలను ఇంటర్వ్యూ పూర్తయిన 20 రోజుల్లోగా వెల్లడిస్తారు.