• facebook
  • whatsapp
  • telegram

ఏక పరీక్షతో ఏడు సంస్థల్లోకి! 

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్స్‌ (సీపీజీఈటీ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ చూపినవారు పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ స్కోరుతో  ఉస్మానియా, కాకతీయ,  తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ  టెక్నలాజికల్‌ యూనివర్సిటీల్లో       ప్రవేశాలు పొందవచ్చు! 

 

ఒకే పరీక్షతో అన్ని విద్యా సంస్థల్లోని సీట్లకు పోటీపడే అవకాశం రావడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ప్రతి విశ్వవిద్యాలయానికీ విడిగా దరఖాస్తు చేసుకుని, ప్రవేశ పరీక్షకు ప్రత్యేకంగా హాజరుకావడం లాంటి సమస్యలు ఉమ్మడి పరీక్షతో తప్పుతాయి. దీంతో సమయం, డబ్బు- రెండూ ఆదా అవుతాయి. ఉదాహరణకు కెమిస్ట్రీలో పీజీ చేయాలనుకున్నవారు ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఒకే పరీక్షతో ఆ కోర్సు అందిస్తోన్న అన్ని సంస్థల సీట్లకూ పోటీపడవచ్చు. సంబంధిత స్కోరును అన్ని సంస్థలూ పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రవేశాలు స్థానిక రిజర్వేషన్లు, మెరిట్‌ ప్రాతిపదికన దక్కుతాయి. 15 శాతం సీట్లకు అభ్యర్థులంతా (స్థానికులు, స్థానికేతరులు) పోటీ పడవచ్చు. 

 

ఇవీ కోర్సులు...
ఎంఏ (ఆర్ట్స్‌): ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ (ఏఐహెచ్‌సీఏ), అరబిక్, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠీ, పర్షియన్, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్‌ ఆర్ట్స్‌.
ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్, జండర్‌ స్టడీస్, హిస్టరీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. ఎంకాం, ఎంఎడ్, ఎంపీఎడ్, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ.
ఎమ్మెస్సీ: బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియో ఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సైకాలజీ. 
పీజీ డిప్లొమా: చైల్డ్‌ సైకాలజీ, జియోగ్రాఫికల్‌ కార్టోగ్రఫీ, సైకలాజికల్‌ కౌన్సెలింగ్, సెరీకల్చర్‌. 
ఇంటిగ్రేటెడ్‌ పీజీ: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ ఎకనామిక్స్, ఎంబీఏ. 

 

 

పరీక్ష విధానం
సబ్జెక్టు ఏదైనప్పటికీ ప్రశ్నపత్రం వంద మార్కులకే! ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు 3 లేదా 4 రకాలుగా ఉండవచ్చు. అనాలజీలు, క్లాసిఫికేషన్లు, మ్యాచింగ్‌లు, కాంప్రహెన్షన్‌ విధానాల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడగవచ్చు. 
ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, జెనెటిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌ ఎలో కెమిస్ట్రీ 40 మార్కులకు అందరికీ ఉంటుంది. పార్ట్‌ బి 60 మార్కులకు నిర్వహిస్తారు. ఈ విభాగంలో డిగ్రీలో చదివిన కోర్సును అనుసరించి.. ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. బయోటెక్నాలజీ పరీక్షలో పార్ట్‌ ఎలో కెమిస్ట్రీ 40 మార్కులకు, పార్ట్‌ బిలో బయోటెక్నాలజీ 60 మార్కులకు ఉంటాయి. వెబ్‌సైట్‌లో రెండు మాక్‌ పరీక్షలు అందుబాటులో ఉంచారు. అలాగే సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలూ పొందుపరిచారు. 

 

ఎవరు అర్హులు?  
అన్ని పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకూ అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. చాలా పీజీలకు యూజీలో సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును చదివివుండడం తప్పనిసరి. కొన్ని జనరల్‌ కోర్సులకు యూజీ అన్ని విభాగాలవారూ అర్హులే. ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది. ఇంటిగ్రేటెడ్‌లో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ కోర్సులకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులవారు అర్హులు. ఎకనామిక్స్, ఎంబీఏలకు అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది.

 

సీపీజీఈటీ ఎప్పుడు? ఎలా?
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 19
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600. మిగిలిన అందరికీ రూ.800.ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాలనుకున్నవారు ఒక్కో సబ్జెక్టుకు రూ.450 అదనంగా చెల్లించాలి.
పరీక్షలు: అక్టోబరు 31 నుంచి మొదలవుతాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌లోని వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్‌లో వివిధ ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్‌ నగర్, వరంగల్, నిజామాబాద్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 
వెబ్‌సైట్‌:  http://tscpget.com