• facebook
  • whatsapp
  • telegram

ధీమాగా.. ధైర్యంగా!

‣ అభ్యర్థులకు ఆత్మవిశ్వాసమే ఆయుధం!   


సురేష్‌ చాలా తెలివైన విద్యార్థి. పది నుంచి పీజీ వరకు మంచి మార్కుల      పర్సంటేజీ ఉంది. నరేష్‌ సగటు విద్యార్థి. ఒక రోజు ఇద్దరూ కలిసి కార్పొరేట్‌ సంస్థ నియామక పరీక్ష రాశారు. అందులో అర్హత సాధించారు. తర్వాత దశ అయిన బృంద చర్చ, ముఖాముఖిలో పాల్గొన్నారు. కానీ తుది ఫలితాల్లో నరేష్‌ చేతికి ఆఫర్‌ లెటర్‌ అందింది. సురేష్‌కు అవకాశం దక్కలేదు. ఎందుకిలా జరిగింది?

 

ఇది సురేష్, నరేష్‌ ఇద్దరికే సంబంధించిన వ్యవహారం కాదు. ప్రతి స్నేహితుల బృందంలోనూ దాదాపు ఇలాంటి దృశ్యాలు పునరావృతమైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉద్యోగార్థులకు మంచి అకడమిక్‌ పరిజ్ఞానం, అవసరమైన స్కిల్స్‌ రెండూ సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు. వీరు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవడానికి గల కారణాలను అన్వేషిస్తే ఆత్మవిశ్వాసం లోపించడమేనని తేటతెల్లమవుతుంది. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయం కొందరిదైతే, ఇంటర్వ్యూ అంటేనే చెమటలు పట్టేసేవాళ్లు మరికొందరు. సరైన సమాధానం తెలిసినప్పటికీ అది అవునో కాదో అనే సందేహం, చొరవ తీసుకోవడంలో మీమాంస, ఆందోళన...తదితర కారణాలతో వీరంతా ఆఖరి అంకంలో విఫలమవుతున్నారు. ఉద్యోగానికి కావాల్సిన అన్ని యోగ్యతలూ వీరికి ఉన్నప్పటికీ విఫలమవడానికి ఏకైక కారణం- ఆత్మవిశ్వాసం లోపించడమే. అంటే వారిపై వారికి విశ్వాసం లేకపోవడమే. దీంతో ఇంటర్వ్యూవర్ల, నియామ సంస్థల విశ్వాసాన్ని వీరు కోల్పోతున్నారు. ఫలితంగా ఉద్యోగం అందని ద్రాక్షగా మారుతోంది. పరీక్షలు, బృందచర్చలు, ముఖాముఖిల్లో విఫలమవుతున్నవారు తమ లోపాలను గుర్తించి, తగిన సాధన చేయడం ద్వారా ఉద్యోగాన్ని పొందవచ్చు.

 

పరిపూర్ణ విజ్ఞానాన్ని ప్రదర్శించినప్పుడే ఉద్యోగం సొంతమవుతుంది. సామర్థ్యాలను బయటకుతీస్తేనే మన గురించి అవతలి వారికి తెలుస్తుంది. అలా కాకుండా ‘నేనేమీ చెప్పను. నా గురించి మీరే తెలుసుకోండి’ అనుకుంటే నష్టపోయేది మనమే. చాలా మందికి వారిపై వారికే నమ్మకం ఉండదు. ఇలాంటి వారి విజయానికి ఇదే పెద్ద అవరోధమవుతుంది. దీంతో విషయపరంగా కాస్త వెనుకబడినప్పటికీ, ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్నవాళ్లు వీరికి దక్కాల్సిన అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలు చాలా మంది అభ్యర్థుల విషయంలో జరుగుతున్నాయి. అందుకు ఎంపిక విధానంలోనే లోపం ఉందని సమర్థించుకునేవారే ఎక్కువ. అలా కాకుండా తమ వైపు నుంచి జరిగిన తప్పులు, అందుకు కారణాలను విశ్లేషించుకుంటే తర్వాత జరగబోయే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మార్గం సులువవుతుంది. బృందచర్చ, ఇంటర్వ్యూల్లో అకడమిక్‌ ప్రతిభకు ప్రాధాన్యం ఉండదు. కేవలం ఆ వ్యవధిలో మీరెలా స్పందించారో పరిశీలిస్తారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసినవారికే అవకాశాలిస్తారు. వైఫల్యం చెందుతోన్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉమ్మడిగా ఉన్న లోపాలు, వాటిని సరిచేసుకోవడం ఎలాగో చూద్దాం.

 

పోల్చుకోవడం
చాలామంది తమను ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ల దగ్గర ఏదైనా ఉంటే తన దగ్గర అది లేదని బాధ పడతారు. అంతేతప్ప నా దగ్గర ఇది ఉంది కదా అని తృప్తి పడరు. దీంతో ఒత్తిడికి గురవుతారు. ఆత్మవిశ్వాసం మీద దాని ప్రభావం పడుతుంది. అందువల్ల పోల్చుకోవడం ఆపండి. మీ లక్ష్యం దిశగా అడుగులేయండి. ఇతరుల సంగతి మనకు అనవసరం. మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశలో ముందుకు కదలండి. వేరెవరి దగ్గరో ఉన్నది మీకు సొంతం కాదు. ఒకవేళ అది మీకు అవసరమైనదైతే మీరు ప్రయత్నం చేస్తే తప్పక వస్తుంది. అంతే తప్ప పోల్చుకుంటే సమయం వృథాతోపాటు మీపై మీరే నమ్మకం కోల్పోతారు. 

 

చిన్నచిన్న లక్ష్యాలు
మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలు వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడం...దాన్ని అందుకోవడం అద్భుతమే. అయితే పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోలేకపోతే నిరాశ చెందుతాము. దాని ప్రభావం తర్వాత పెట్టుకునే లక్ష్యాలపైనా పడుతుంది. అందువల్ల లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించుకోండి. ఒక్కో దాన్ని అధిగమించడానికి కొంత గడువు నిర్ణయించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా ఒకదాని తర్వాత మరొకటి పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవికతకు అనుగుణంగా చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించడం ద్వారా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. దీంతో పెద్ద లక్ష్యాలను సైతం చేరుకోవడం సులువవుతుంది.

 

భయాలతో పోరు
భయమే క్రూరమైన శత్రువు. అది మీ విశ్వాసంపై దెబ్బకొట్టి, మిమ్మల్ని నిస్సహాయుల్ని చేస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోకుండా వెనక్కి లాగుతుంది. మీ భయాలను చూసి వాటి నుంచి దూరంగా పారిపోకుండా వాటితో యుద్ధం చేయాలి. భయానికి కారణాలు తెలుసుని, ప్రయత్నం ద్వారా అధిగమించాలి.   

 

విమర్శ వద్దు 
తమని తాము విమర్శించుకునేవారికి ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కొంతమంది వాళ్లకు సంబంధించి ప్రతి విషయాన్నీ విమర్శనాత్మక ధోరణిలో చూస్తారు, వారిపై వాళ్లే ప్రతికూలంగా (నెగెటివ్‌) ఆలోచిస్తారు. దీంతో నియంత్రణ కోల్పోతారు. మాతో ఏమీ సాధ్యం కాదు అనే పరిస్థితికి చేరుకుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం ఆవిరవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించడాన్ని మొదలు పెట్టండి. మీపై మీకు నమ్మకం కలిగేలా వ్యవహరించండి. 
చాలామందికి వారిపై వారికే నమ్మకం ఉండదు. దీంతో విషయపరంగా కాస్త వెనుకబడినప్పటికీ, ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్నవాళ్లు వీరికి దక్కాల్సిన అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.  

 

అభిప్రాయాలతో పనిలేదు
‘నేను చెప్పే విషయాలు ఎవరూ పట్టించుకోవడం లేదు’ అనుకునేవారు ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లే. ఎవరి పనులతో వాళ్లు తీరిక లేకుండా ఉంటారు. ఒకరిని ఇంకొకరు పట్టించుకునే పరిస్థితులు అన్నిసార్లూ ఉండకపోవచ్చు. మీరు కూడా వేరేవాళ్లను పట్టించుకోవడంలేదు కదా. కాబట్టి ఇతరుల స్పందన కోసం చూడకుండా మీరు చేసే పనిని ప్రేమించండి. 

 

విజయాలను గుర్తుంచుకోండి 
గతంలో మీరు సాధించిన విజయాలు, మీకు లభించిన గుర్తింపు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటి నుంచి ప్రేరణ పొందండి. కొత్త లక్ష్యం దిశగా సానుకూలంగా ముందుకు వెళ్లండి. 

 

జ్ఞానంతో గుర్తింపు
నెగెటివ్‌ లక్షణాలు తగ్గించుకుని జ్ఞానం పెంచుకోవడానికి పుస్తక పఠనంపై దృష్టి సారించండి. విస్తృతంగా చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి జ్ఞానానికి మించిన ఆయుధం లేదు. ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అంత మొత్తంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జ్ఞానం కారణంగా నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందవచ్చు. 

 

సమర్థతపై నమ్మకం 
స్వశక్తిపై పూర్తి విశ్వాసం ఉన్నవాళ్లే దేన్నైనా సాధించగలరు. దేన్నైనా సాధించాలంటే పూర్తిస్థాయుల్లో మీ శక్తియుక్తులు, సామర్థ్యాన్ని ప్రదర్శించడం ముఖ్యం. సానుకూల దృక్పథంతోనే సానుకూల ఫలితాలు వస్తాయి. 

 

పెట్టుబడి పెట్టండి..
మీపై మీరే పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని మీకోసం మీరు వెచ్చించాలి. వీలైతే అదనపు సమయాన్ని వెచ్చించుకోండి. మీకు ఏదైనా అంశంలో ప్రావీణ్యం లేకపోతే వాటిలో అభివృద్ధి చెందడానికి కృషి చేయండి. మీరు చేసే కృషిపైనే మీ సమర్థత ఆధారపడుతుంది. కృషి కారణంగా సమర్థత, సమర్థతతో ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. ఫలితంగా మీ లక్ష్యానికి మార్గం సుగమమవుతుంది. ‘నేను తప్పకుండా ఫెయిల్‌ అవుతాను’ అనుకునే బదులు ‘నేను మరి కొంచెం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాను’ అనే నమ్మకంతో ప్రయత్నం దిశగా అడుగులేయాలి. 

 

అదుపులో ఆలోచనలు
ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇస్తే నెమ్మదిగా మన బుర్రంతా వాటితోనే నిండిపోతుంది. కాబట్టి నెగెటివ్‌ ఆలోచనలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ వాటిని అక్కడితో ఆపి సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.

 

ఇలా చేస్తే సరి!
‣ సానుకూలంగా మాట్లాడేవాళ్లతో ఒక సమూహంగా ఏర్పడండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. కొంతమంది మిమ్మల్ని నైతికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రతికూలంగా మాట్లాడతారు. అలాంటివారికి దూరంగా ఉండండి. 
‣ గతంలో మీకు ఎదురైన ప్రతికూల ఫలితాలను గుర్తుతెచ్చుని బాధపడకుండా వాటిని వీలైనంత త్వరగా మర్చిపోండి. గత వైఫల్యాల ప్రభావం పడకుండా చూసుకోవడం ముఖ్యం.
‣ మీకంటూ ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోండి. మీరు ఎక్కడ వెనుకబడుతున్నారు, అందుకు కారణాలు ఏమిటి, అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ విశ్లేషించుకోవాలి. మీ గురించి మీకే బాగా తెలుస్తుందని గుర్తించుకోండి.
‣ ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం లేదా విభాగంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. మీరు ఎందులో సమర్థులో తెలుసుకోండి. అందులో మరింత పట్టుకోసం కృషిచేయండి. దీంతో నలుగురిలోనూ మీకంటూ ప్రత్యేక గుర్తింపు సాధ్యమవుతుంది. 
‣ మనసుకు నచ్చిన పనినే చేయడం వల్ల మనమై మనకు నమ్మకం పెరుగుతుంది. నెగెటివ్‌ ఆలోచనలు రావు. అందువల్ల మీ లక్ష్యాలు ఎప్పుడూ మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. ఏమాత్రం ఇష్టంలేనివాటిని లక్ష్యంగా ఏర్పాటుచేసుకుంటే విఫలమవ్వడమే కాకుండా, మీపై మీకు నమ్మకం పోతుంది. దాని ప్రభావం మిగిలిన అన్నింటిపైనా పడుతుంది. 
‣ ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణాలు తెలుసుకోండి. ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోవడం సమస్య అయితే ఆ భాషను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ విషయంలో మీకంటే మెరుగైన వ్యక్తుల సహాయాన్ని తీసుకోండి. ఇలా ప్రతి సమస్యను అధిగమించడానికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని ఆచరించడం ముఖ్యం. 

 

ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. ఇది లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అది వెలుగులోకి రాదు. కానీ ధీమా ఉంటే అవసరమైనంత ప్రతిభ లేకపోయినప్పటికీ విజయాన్ని అందుకోవచ్చు!