• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీసీఎస్‌ కొలువుకు.. ఎన్‌క్యూటీ

మీరు బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులా? అయితే మీకోసమే విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)లో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ముందుగా నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అందులో చూపిన ప్రతిభతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు! 

 

టీసీఎస్‌ సంస్థలో కొలువు సాధించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా టీసీఎస్‌ ఎన్‌క్యూటీ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం టీసీఎస్‌ నెక్స్‌స్టెప్‌ పోర్టల్‌లో అప్లై ఫర్‌ డ్రైవ్‌లోకి వెళ్లాలి. అందులో ఐటీ విభాగాన్ని క్లిక్‌ చేసి ఇతర వివరాలతోపాటు ఎన్‌క్యూటీ ఐడీ సంఖ్యను నమోదుచేసుకోవాలి.  

 

ఎన్‌క్యూటీ పరీక్ష ఇలా:
ఇందులో 5 విభాగాల నుంచి మొత్తం 92 ప్రశ్నలు వస్తాయి. ఆయా విభాగాల వారీ ప్రశ్నలకు సమయాన్ని నిర్దేశించారు. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు. వెర్బల్‌ ఎబిలిటీలో 24 ప్రశ్నలను 30 నిమిషాల్లో,  రీజనింగ్‌ ఎబిలిటీలో 30 ప్రశ్నలను 50 నిమిషాల్లో, న్యూమరికల్‌ ఎబిలిటీ 26 ప్రశ్నలు 40 నిమిషాల్లో,  ప్రోగ్రామింగ్‌ లాజిక్‌ 10 ప్రశ్నలు 15 నిమిషాల్లో, కోడింగ్‌ 2 ప్రశ్నలు 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. పరీక్షను టీసీఎస్‌ అయాన్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. అందులో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. టీసీఎస్‌ పోర్టల్‌లో నమూనా పరీక్షను అందుబాటులో ఉంచారు. దానిద్వారా పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు. 

 

ఈ అంశాల్లో ప్రశ్నలు
వెర్బల్‌ ఎబిలిటీలో ఆంగ్ల వ్యాకరణం, దాన్ని ఉపయోగించే విధానం, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. రీజనింగ్‌ ఎబిలిటీలో ఖాళీలో ఉండాల్సిన పదాలు, అంకెలు కనుక్కోవడం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం..తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీలో నంబర్‌ సిస్టమ్, అరిథ్‌మెటిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రోగ్రామింగ్‌ లాజిక్‌లో సూడోకోడ్, అల్గ్గారిద]మ్స్, ప్రోగ్రామింగ్‌ కన్‌స్ట్రక్ట్, ఎస్‌డీఎల్‌సీ, సీ, సీ++, జావాల్లో ప్రశ్నలు వస్తాయి. కోడింగ్‌ విభాగంలో సీ, సీ++, జావా, పైథాన్, పెర్ల్‌ల్లో 15 నిమిషాల వ్యవధితో ఒకటి, 30 నిమిషాల వ్యవధితో మరో ప్రశ్న ఉంటాయి.

 

ఎవరు అర్హులు?  
విద్యార్హత: బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ వీటిలో ఏదైనా కోర్సు ఫుల్‌ టైమ్‌ విధానంలో ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు (2021లో పూర్తి చేసుకోబోతున్నవారు) అర్హులు. ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచ్‌లూ, ఎమ్మెస్సీ అన్ని విభాగాల వారూ ఈ పరీక్ష రాసుకోవచ్చు. సంబంధిత కోర్సులను రెగ్యులర్‌ విధానంలో చదివుండాలి. పది, ఇంటర్‌ మాత్రం ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదివినప్పటికీ అర్హులే. 
ఎంత శాతం మార్కులు: పది, ఇంటర్‌/ డిప్లొమా, యూజీ/ పీజీ అన్నింటా కనీసం 60 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ తప్పనిసరి. 
బ్యాక్‌ లాగులు: ప్రస్తుతానికి ఒకటి కంటే ఎక్కువ ఉండరాదు. అదీ నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి.
గ్యాప్‌లు: విద్యాభ్యాసం మొత్తంమీద రెండేళ్ల కంటే ఎక్కువ విరామం (గ్యాప్‌) ఉండరాదు. అంతకంటే ఎక్కువ గ్యాప్‌ ఉన్నవారి విషయంలో అందుకు బలమైన కారణం (అనారోగ్యం, ప్రమాదాలు.. మొదలైనవి) ఆధారాలతో చూపగలిగితే పరిగణనలోకి తీసుకుంటారు.
వయసు: 28 ఏళ్లలోపు ఉండాలి.

 

రిజిస్ట్రేషన్లకు గడువు: అక్టోబరు 17
పరీక్ష తేదీలు: అక్టోబరు 24, 25, 26
ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థుల ఈ మెయిల్‌కు అందుతాయి. 
వెబ్‌సైట్‌: https://www.tcs.com/careers/TCSCampusHiringYoP2021