• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అర్హత ఉన్నా.. అవకాశం రాలేదా? 

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు పిలుపు రాకపోవడం మామూలే. ఉత్తమమైన, మెరుగైన  అర్హతలూ, నైపుణ్యాలూ ఉన్నవారికే సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. కానీ ఇవి రెండూ ఉన్నా కూడా నియామక సంస్థ నుంచి తర్వాతి దశ పరీక్షలకు ఆహ్వానం రావట్లేదంటే.. ఆలోచించాల్సిందే మరి!

 

 

ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ప్రకటనలను ఇచ్చేటపుడు సంస్థలు హోదాకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాయి. విద్యార్హతలు, అనుభవం, అవసరమైన/ ఆశిస్తున్న నైపుణ్యాలు మొదలైనవి ఇందులో భాగం. దానికి తగ్గట్టుగానే ఉద్యోగార్థులూ తమ రెజ్యూమెలు, దరఖాస్తులను మార్పు చేసుకుంటుంటారు. కొన్నిసార్లు అభ్యర్థులకు బాగా నమ్మకంగా ఉన్నప్పటికీ సంస్థల నుంచీ పిలుపు రాదు. నిజానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి సంస్థ నుంచీ పిలుపు రావాలనేం లేదు. కానీ ఒక్కోసారి తగిన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండీ, వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నవాటినుంచీ ఏ కబురూ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు మాత్రం ఓసారి తరచి చూసుకోవడం తప్పనిసరి. లేదంటే.. భవిష్యత్‌లోనూ ఇలాంటి సమస్య తలెత్తే అవకాశముంటుంది.

 

అసంపూర్తి దరఖాస్తు 
ఎంపిక ప్రక్రియలో భాగంగా రిక్రూటర్లు వందల కొద్దీ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుంది. పనిని సులభతరం చేసుకోవడంలో భాగంగా వారు చేసే పని- ముందుగా అరకొర సమాచారమున్న లేదా పూర్తి సమాచారం లేని వాటిని పక్కన పెట్టడం. ఆపై పూర్తి సమాచారం ఉన్నవాటిని పరిశీలిస్తారు. కాబట్టి, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సరిపోతారో లేదో నిరూపించుకోవాలంటే.. దరఖాస్తు రిక్రూటర్‌ దృష్టి వరకూ వెళ్లాలి. కాబట్టి, మొదటి దశ అయిన దరఖాస్తు ప్రక్రియ, రెజ్యూమెలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తప్పనిసరి. చాలామంది రెజ్యూమె విషయంలో ఎంత ఎక్కువ సమాచారం పొందుపరిస్తే దానికి అంత విలువ చేకూరుతుందనే భ్రమలో ఉంటారు. అది కూడా తప్పు ఆలోచనే. ఇక్కడ పరిమాణం కంటే ఎంతవరకూ మీ వల్ల ప్రయోజనం అనేదే చూస్తారు. కాబట్టి, ముఖ్యమైన సమాచారం అదీ వీలైనంత క్లుప్తంగా ఉండేలా చూసుకోండి.

 

ప్రత్యేకమేనా?
ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించబోయే ప్రతి ఒక్కరి దృష్టీ పడేది రెజ్యూమెపైనే. దాని ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ దానిపై ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. నిజానికి ఇది మంచి విషయమే. కానీ.. మొదటిసారే అందంగా, అన్ని హంగులతో చేసేసి వదిలేసేవారే ఎక్కువ. ఇక ఏ ఉద్యోగానికైనా దాన్నే పంపిస్తుంటారు. ఎంత పనిచేసేది ఒకటే రంగమైనా సంస్థను బట్టి, అభ్యర్థి నుంచి ఆశించే అంశాల్లో మార్పులుంటాయి. కాబట్టి, దానికి అనుగుణంగా మార్పు చేయడం తప్పనిసరి. సంస్థ ఆశించే వాటికి అనుకూలంగా లేకుండా ఎంత అందంగా తీర్చిదిద్దినా దాని వల్ల ప్రయోజనం ఉండదని గమనించాలి.
జాబ్‌ పోర్టళ్లలోనూ వివిధ పోస్టులకు ఒక క్లిక్‌తో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఇలాంటివాటికి ఆస్కారం ఇవ్వకపోవడమే మంచిది. నచ్చిన ఒక్కోదాన్ని పరిశీలించి, దరఖాస్తు చేసే పోస్టుకూ, సంస్థ ఆశించే నైపుణ్యాలకూ సరిపోయేట్టు తగిన మార్పులు చేసి పంపాలి. ఈ ‘కస్టమైజ్‌డ్‌ అప్లికేషన్‌’కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. 

 

సూచనలు పాటించారా?
ఉద్యోగ ఖాళీల ప్రకటనలో భాగంగా సంస్థలు కొన్ని సూచనలు చేస్తుంటాయి. ఉదాహరణకు- ‘ఫోన్‌ కాల్స్‌ చేయొద్దు’.. నిజానికి ఫాలోఅప్‌ మంచి విషయమే. ఇది ఉద్యోగ విషయంలో అభ్యర్థి ఆసక్తిని సూచిస్తుంది. కానీ సంస్థ ప్రత్యేకంగా చేయొద్దని చెప్పినప్పటికీ చేస్తే ఇది అభ్యర్థి నిర్లక్ష్యాన్నీ, క్రమశిక్షణ లేమినీ సూచిస్తుంది. ‘ఫలానా భాష వచ్చుండటం తప్పనిసరి’- ఆ భాష రాకపోయినా చేస్తే.. దరఖాస్తు బుట్ట దాఖలే అవుతుంది. ఇలాంటి సూచనలను జాగ్రత్తగా గమనించుకుని, పాటించడం తప్పనిసరి.

 

హడావుడిగా చేస్తే..
ఇంటర్వ్యూ పిలుపు దరఖాస్తు, రెజ్యూమెల ఆధారంగానే జరుగుతుంది. చేయాలి కాబట్టి, చేశాం అన్న ధోరణిలో చేస్తే అది తప్పులకు దారి తీయొచ్చు. కాబట్టి, నింపాదిగా దరఖాస్తు మొత్తాన్నీ ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని పంపడం మంచిది. అక్షర దోషాలు, అన్‌ఫార్మాటెడ్‌ రెజ్యూమెలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
అలాగే రిక్రూటర్‌ దృష్టిలో చూడగానే పడాలనే ఉద్దేశంతో చాలామంది కొంత ఫ్యాన్సీ అంశాలను జోడిస్తుంటారు. ఫుటర్లను ఫ్యాన్సీగా రూపొందించడం, వివిధ ఫాంట్లను ఉపయోగించడం, వ్యక్తిగత వేడుకోళ్లు.. ఇవన్నీ దీని కిందకే వస్తాయి. నిజానికి ఒక రిక్రూటర్‌ సగటున వీటి మీద కేటాయించే సమయం కొన్ని సెకన్లు మాత్రమే. మరీ ఆసక్తిగా కనిపిస్తే ఇంకాస్త సమయం కేటాయిస్తారు. ఆ ఆసక్తి మీరు చెప్పే అంశాల ఆధారంగా కలుగుతుందే తప్ప, దాని ‘లుక్‌’ ఆధారంగా కాదని గమనించాలి.

 

ఫాలోఅప్‌ చేశారా?
దరఖాస్తు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.. ఏదైనా ఫాలోఅప్‌ మాత్రం తప్పనిసరి. వాళ్లు ప్రత్యేకంగా చెబితే తప్ప దాన్ని వదిలేయకపోవడం మంచిది. రిక్రూటర్‌ నుంచి దరఖాస్తు చేసుకున్న వారం నుంచి పదిరోజుల్లో కాల్‌ రాకపోతే ఫాలోఅప్‌ చేయడం మంచిది. అలాగని పంపగానే/ ప్రతిరోజూ చేయొద్దు. ఇది విసుగు కలిగిస్తుంది. ఇక్కడ దరఖాస్తు పత్రం గురించి ఆరా తీస్తూ దరఖాస్తు చేసుకున్న హోదాపై ఆసక్తిని తెలిపేలా మాట్లాడటం లాభిస్తుంది.