• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నవతరానికి నయా నైపుణ్యాలు

‣ టీసీఎస్ ఇంటెలిజెమ్ ప్రోగ్రామ్
‣ 5 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థులు అర్హులు
‣ విజేతలకు నగదు బహుమతులు, కొత్త త‌రం గాడ్జెట్లు

 

 

రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిట‌ల్ యుగానికి తగినట్లుగా యువత సిద్ధమైతేనే పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠ‌శాల ద‌శ నుంచే సాంకేతిక ప‌రిజ్ఞానంపై పట్టు సాధించాలి. ఇందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌ (టీసీఎస్‌)  తగిన తోడ్పాటును అందించేందుకు ముందుకు వ‌చ్చింది. 21వ శ‌తాబ్ద‌పు సార్వ‌త్రిక‌ నైపుణ్యాల‌పై పాఠ‌శాల స్థాయి నుంచే విద్యార్థులు ప‌రిజ్ఞానాన్నిపెంపొందించుకునేందుకు ప్రోత్సహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులను రేపటి సవాళ్లను ఎదుర్కోగలిగే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. టీసీఎస్ అయాన్ ఇంటెలిజెమ్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా యువతలో నైపుణ్యాలను వృద్ధి చేస్తోంది.  ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడోసారి జాతీయస్థాయి పోటీ పరీక్షకు ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప‌రీక్ష‌ను టీసీఎస్ దాని అనుబంధ యూనిట్ అయిన టీసీఎస్ అయాన్‌, ప్ర‌ముఖ గ్లోబ‌ల్ ఐటీ స‌ర్వీసెస్‌, క‌న్స‌ల్టింగ్ & బిజినెస్ సొల్యూష‌న్స్ సంస్థల‌ భాగ‌స్వామ్యంతో నిర్వ‌హిస్తోంది. 

 

అభ్యర్థులు త‌మ‌ ప్ర‌వ‌ర్త‌న, ప్ర‌తిభ, నైపుణ్యాల‌ను మెరుగ‌ప‌రుచుకునేందుకు టీసీఎస్ ఇంటెలిజెమ్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా  21 వ శతాబ్దపు నైపుణ్యాలను అయిదు విభాగాల్లో అభివృద్ధి చేస్తుంది. అవి సార్వత్రిక విలువలు (యూనివర్సల్ వాల్యూస్), ప్రపంచ పౌరసత్వం (గ్లోబల్ సిటిజన్ షిప్), సమాచార నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్),  సృజనాత్మకత & ఆవిష్కరణ (క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్), ఆర్థిక అక్షరాస్యత (ఫైనాన్షియల్ లిటరసీ).

 

ఎవరు అర్హులు?
గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5 నుంచి 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొద‌టగా పాఠ‌శాల యాజ‌మాన్యం సంబంధిత వెబ్‌సైట్ ‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అప్పుడు పాఠ‌శాల‌కు ఒక గుర్తింపు సంఖ్య వ‌స్తుంది. దానిని ఆ పాఠ‌శాల విద్యార్థులు వ్య‌క్తిగ‌తంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో నమోదు చేయాలి. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది న‌వంబ‌రు 21, 2020. నిర్ణీత ప‌రీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

 

ఎంపిక ఎలా?
ఈ ఎంపిక‌ మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ క్వాలిఫైయింగ్ రౌండ్, ప్రీ-ఫైనల్ రౌండ్లు, జాతీయ స్థాయి గ్రాండ్ ఫైనల్స్. విద్యార్థులు ద‌ర‌ఖాస్తు  స‌మ‌యంలోనే నిర్ణీత అయిదు విభాగాల్లో ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ‌ అంశాలను ఎంచుకోవ‌చ్చు. దాని ప్ర‌కార‌మే ప్ర‌శ్న‌లు అడుగుతారు. మొద‌టి ద‌శ‌లో రెండు ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు ఉంటాయి. ఎంచుకున్న అంశంపై విద్యార్థికి ఉన్న అవ‌గాహ‌న‌, జ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు. ఈ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్ తరువాత, ప్రతి గ్రేడ్-టాపిక్ నుంచి మెరిట్ విద్యార్థులను తీసుకుంటారు. ప్రీ-ఫైనల్స్ రౌండ్లో నిపుణుల బృందం ఆడియో / విజువల్, కార్యాచరణ-ఆధారిత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల నైపుణ్య ప్రదర్శన / పనితీరును అంచ‌నా వేసి మూడో రౌండ్‌కు ఎంపిక చేస్తుంది. చివ‌రిలో జ్యూరీ ముఖాముఖి ఉంటుంది. ఇందులో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. విజేత‌లుగా నిలిచిన 5, 6 త‌ర‌గతుల విద్యార్థుల‌ను జూనియ‌ర్లుగా, 7, 8, 9 త‌ర‌గ‌తుల వారిని సీనియ‌ర్లుగా విభ‌జించి నగదు బహుమతులు, కొత్త త‌రం గాడ్జెట్లు, ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలను ప్ర‌దానం చేస్తారు. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు సంబంధించిన పాఠశాలలకు - స్కూల్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు జాతీయస్థాయి గుర్తింపు లభిస్తుంది.

 

పోటీలోని వివిధ దశలకు అవసరమైన మెటీరియల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. వాటిని అధ్యయనం చేసి విద్యార్థులు పోటీల్లో పాల్గొనాలి. 21 వ శతాబ్దపు నైపుణ్యాలను ఆన్ లైన్ లో పొందెందుకు అవకాశం దక్కుతుంది. వెబినార్లు, పజిల్స్, ఆటలు తదితరాల్లో పాల్గొని వినోదాత్మకంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. డిజిటల్ బుక్ లెట్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. పరిశ్రమ అనుభవజ్ఞులతో అనుసంధానం కావచ్చు. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చు. చివర్లో అభ్యర్థులు నేర్చుకున్న నైపుణ్యాలు, వారి పరిజ్ఞానం, అవగాహనలకు సంబంధించి ఇంటెలిజెమ్ కోషెంట్ నివేదిక రూపంలో వ్యక్తిగత ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. 
వెబ్ సైట్: http://intelligem.tcsion.com/

 

పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని..
ఎప్ప‌టిక‌ప్పుడు భవిష్యత్ తరానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. అందుకు సంబంధించి అనేక కంటెంట్ ఉత్పత్తులను ప్రారంభిస్తున్నాం. ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఇంటెలిజెమ్  ప్రోగ్రామ్, 21 వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించుకోడానికి విద్యార్థులకు సహాయపడుతుంది.  వాటి గురించి ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యా విధానంలోనూ పేర్కొన్నారు.  ఇంటెలిజెమ్ అనేది విద్యార్థుల విభిన్న ఆకాంక్షలను గుర్తించి, ప్రపంచీకరణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో అధిక నైపుణ్యాలతో పోటీ ప‌డేందుకు వారిని సన్నద్ధం చేస్తుంది.

- వెంగస్వామి రామస్వామి, టిసిఎస్ అయాన్ గ్లోబల్ హెడ్