• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ ఏడాది వీటిదే హవా! 

పోటీలో ముందుంచే మేటి నైపుణ్యాలు

 

 

2020 ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాది తీసుకొచ్చిన చెడు ప్రభావమంతా పోయి కొత్త అవకాశాలు తలుపు తట్టాలని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆశావహంగా సంవత్సరాన్ని ప్రారంభించడం మంచిదే కానీ.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన సన్నద్ధతనూ జోడిస్తేనే  కొత్త ఏడాది సానుకూలమై ఆనందకరమవుతుంది. ఏటా పరిశ్రమలు కోరే నైపుణ్యాలు ఎంతో కొంత మారుతుంటాయి. వాటిని ముందుగా తెలుసుకుని, చేజిక్కించుకునేవారు పోటీలో ముందుంటారు. ఈసారి వీటిలో ప్రధాన మార్పులే చోటు చేసుకున్నాయి. అవేంటో తెలుసుకుందామా!

 

సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభమవుతుందనగానే డిమాండ్‌లో ఉండబోయే నైపుణ్యాల జాబితాను ప్రముఖ సంస్థలు విడుదల చేస్తుంటాయి. గత ఏడాది విశ్లేషణ, రాబోతున్న కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందిస్తుంటారు. కెరియర్‌ పురోగతిని ఆశించే వారందరూ వీటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాల్సిందే! అదీకాక 2020 ఎన్నో భారీ మార్పులకు కారణమైంది. ఎన్నో పరిశ్రమల, ఉద్యోగాల తీరుల్లో మార్పులొచ్చాయి. మరికొన్ని మందగించాయి. దీంతో సంస్థలు తిరిగి పుంజుకునేందుకు తాజా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. సంస్థల పనితీరు, ఆచరణ విధానాల్లో మార్పులు అంటే.. దానికి తగ్గట్టుగా అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులొస్తాయి. తాజాగా ఫోర్బ్స్‌ సహా ప్రముఖ సంస్థలు 2021లో పట్టు సాధించాల్సిన నైపుణ్యాల జాబితాను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఉద్యోగపరమైన పోటీలో నిలవాలనుకునే, దానిలో విజయం సాధించాలనుకునేవారు వీటినీ పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ముఖ్యమైనవాటిని గమనిస్తే..

 

పరిస్థితులకు అనుగుణంగా

గత ఆరు నెలలపైగా పరిస్థితిని పరిశీలిస్తే.. పాఠశాలల్లూ, కళాశాలలూ మూతబడ్డాయి. సంస్థలూ సంప్రదాయ పద్ధతి నుంచి ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కొన్నేళ్లపాటు ఢోకా ఉండదన్న పరిశ్రమలూ మూతబడ్డాయి. కొన్ని కొలువులూ కనుమరుగయ్యాయి. పాఠశాల నుంచి కళాశాల, ఉద్యోగం వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. దీంతో అప్పటిదాకా సాంకేతికత అవసరం లేని ఉద్యోగులూ వాటిని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేర్చుకోలేకపోయినవారు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితీ ఏర్పడింది. దీంతో అనుకోకుండా ఎదురయ్యే సవాళ్లను తట్టుకోగలగడం, కొత్త మార్పులకు అనుగుణంగా మారగలిగేలా ఉండటం అభ్యర్థులకు తప్పనిసరి. తరచూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధంగా ఉండగలిగే నైపుణ్యానికి ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది.

 

నేర్చుకోవడం..నిరంతరం

ఒకప్పుడు ఏదైనా కెరియర్‌ ఎంచుకుంటే ఏళ్లపాటు ఢోకా ఉండేది కాదు. ఒకసారి చదువుకున్న పరిజ్ఞానం జీవితాంతం సరిపోయేది. నేడు కెరియర్, పరిశ్రమలు అలాగే ఉన్నా.. ఏటా వాటిలో ఎంతో కొంత మార్పు సహజమవుతోంది. కొనసాగాలంటే సంబంధిత నైపుణ్యాలను అందుకోవడం తప్పనిసరి. కాబట్టి, ఒకదాన్ని నేర్చేసుకుంటే సరిపోతుందనే ధోరణి మంచిది కాదు. ఎప్పటికప్పుడు వస్తున్న తాజా ధోరణులను గమనిస్తుండటం, వాటి ఆధారంగా నైపుణ్యాలను నేర్చుకుంటుండటం చేస్తుండాలి. 

 

సహానుభూతి

చాలా సందర్భాల్లో.. ముఖ్యంగా పెద్దవాళ్లు.. ‘అవతలి వ్యక్తి కోణంలో ఆలోచించు’ అంటుండటం వింటాం. దీనికీ ఉద్యోగానికీ/ వ్యాపారానికీ సంబంధం లేదు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే.. సంస్థ అన్నాక వ్యాపార లావాదేవీలుంటాయి. అవి విజయవంతం కావడానికి క్లయింట్లు, బృంద సభ్యులు, మార్కెట్‌ నిపుణులు మొదలైనవారిని అర్థం చేసుకోవడం తప్పనిసరి. ‘ఆ పరిస్థితిలో నువ్వే ఉంటే ఏం చేస్తావ్‌?’ వంటి ప్రశ్నలు ఇంటర్వ్యూ సమయంలో అడిగడానికీ కారణమిదే. అవతలి వాళ్ల ఉద్దేశాన్ని అభ్యర్థి ఎంతవరకూ తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతున్నారనేది ఈ ప్రశ్న ఉద్దేశం. ఎవరైనా ఇబ్బందికి గురవుతున్నపుడు సహానుభూతిని ప్రదర్శించాలి. తోటివారితో మంచి సంబంధాలు ఏర్పడటంలోనూ తద్వారా కొత్త ఆవిష్కరణలు సాధ్యపరచడంలోనూ దీని ప్రాధాన్యం ఉందనేది నిపుణుల మాట. ఈ నైపుణ్యం ఉన్నవారు తోటివారు సహజంగా ప్రవర్తించేలా, వారి ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా ఉంచగలిగే వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. సంస్కృతి, నేపథ్యం, వ్యక్తిత్వం, వయసుతో సంబంధం లేకుండా వారితో కలిసి ఎలా మెలగాలో ఈ నైపుణ్యం ఉన్నవారికి బాగా తెలుసు. కొత్త ఏడాది సంస్థలు ప్రాధాన్యమిచ్చే నైపుణ్యాల్లో దీనికీ ప్రాధాన్యం ఏర్పడింది.

 

విమర్శనాత్మక దృక్పథం

సంస్థ, రంగం ఏదైనా అనుకోని సవాళ్లు ఎదురవుతుండటం మామూలే. కొవిడ్‌ పరిస్థితినే తీసుకుంటే.. పూర్తిగా కనుమరుగైన పరిశ్రమలను పక్కనపెడితే.. చాలావరకూ సంస్థల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ పరిస్థితి మాత్రం అందరికీ ఒకటే. అయినా కొందరు ఉద్యోగాలను నిలుపుకోగలిగారు కదా! అంటే.. ఉద్యోగాలను కోల్పోయినవారితో పోలిస్తే వీరిలో భిన్న, మెరుగైన నైపుణ్యాలు ఉన్నట్టే కదా! ఇక్కడ మిగతా వారితో పోలిస్తే భిన్నంగా ఆలోచించడం, త్వరితగతిన సమస్యలకు పరిష్కారాలను కనుక్కోగలగడం వంటి విమర్శనాత్మక దృక్పథం ఉండే నైపుణ్యాలకు ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి, వీటిని అలవరచుకోవడం ప్రధానం.

 

భాగస్వామ్యం

ఇంటి నుంచి పనిచేయడం.. సాధారణంగా ఇది పరిచయమున్న విధానమే. కానీ.. గత ఏడాది చాలా కొద్ది మినహా దాదాపుగా ప్రతి రంగమూ ఈ విధానాన్ని ఆకళింపు చేసుకుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి ఆటంకమూ లేకుండా పని సజావుగా సాగాలంటే విభిన్న వ్యక్తులు, బృందాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ వారి వ్యక్తిత్వాల్లో ఆలోచన తీరుల్లో తేడాలుంటాయి. అయినా అనుకున్న దిశగా పని సాగాలంటే అవతలివారితో సంభాషణ సరైన దిశగా సాగించాల్సి ఉంటుంది. ఇందుకు మంచి భావప్రకటన నైపుణ్యాలు, ఎదుటివారు చెప్పేటపుడు వినే ఓపిక అవసరమవుతాయి. వీటిని అలవరచుకుంటూనే విభిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేయగల నేర్పూ, ఓర్పూ పెంచుకోగలగాలి.

 

డిజిటల్‌ స్కిల్స్‌

న్యూ ఏజ్‌ ఎంప్లాయబుల్‌ స్కిల్స్‌గా వీటిని చెబుతున్నారు. కొవిడ్‌ పరిస్థితి చక్కబడినా కూడా భవిష్యత్‌లో దాదాపుగా 30% ఉద్యోగాలు ఇంటి వద్ద నుంచి చేసేలానే కొనసాగుతాయని అంచనా. విద్యారంగం, రిటైల్‌ పరిశ్రమలు దీన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాయి. ఇతర రంగాలూ తాజా పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికీ, భవిష్యత్‌ మార్పులకు ముందస్తుగా సిద్ధంగా ఉండటానికీ డిజిటల్‌పరంగా తమను తాము అభివృద్ధి పరచుకుంటున్నాయి. ఇందులో భాగంగా సంస్థలు తమ ఉద్యోగులకు డిజిటల్‌ నైపుణ్యాలతోపాటు సామాజికంగా చురుకుగా ఉండాలని ఆశిస్తున్నాయి. కాబట్టి వెబ్‌ టెక్నాలజీలు, సోషల్‌ మీడియా మొదలైన అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఆదరణ పెరుగుతోంది.

Posted Date : 08-01-2021 .

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌